Thursday, December 7, 2017

నిర్భీతికి ప్రతీక గౌరీ లంకేశ్

నిర్భీతికి ప్రతీక గౌరీ లంకేశ్ 

గౌరి లంకేశ్‌ 29 జనవరి 1962న షిమోగాలో జన్మించారు. డిగ్రీ వరకు బెంగళూరులో చదువుకున్నారు. ఆ తరువాత పి.జి. డిప్లొమా (మాస్‌ కమ్యూనికేషన్స్‌) ఐ.ఐ.ఎం.సి., దిల్లీలో (1983-84) చేశారు.

ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో  బెంగళూరు, దిల్లీ (1985-90), సండే వీక్లీలో  (1990-93, 1998-2000), చీఫ్‌ బ్యూరోగా ఈ టీవీ న్యూస్‌, , దిల్లీలో  (1998-2000) పనిచేశారు. ఆతరువాత తండ్రి పాల్యాద లంకేశ్‌ మరణానంతరం ఆయన నిర్వహిస్తూ వచ్చిన 'లంకేశ్‌ పత్రికె' ఎడిటర్‌ బాధ్యతలను (2000-2005) చేపట్టారు.

నక్సలైట్ల విషయంలో గౌరి లంకేశ్‌ చూపిన శ్రద్ధ మూలంగా ఆమెకూ, ఆమె సోదరునికీ మధ్య విభేదాలు తలెత్తాయి. అతనే ఆ పత్రిక యజమాని కాబట్టి 2005లో లంకేశ్‌ పత్రికె నుంచి బయటికి వచ్చి ''గౌరి లంకేశ్‌ పత్రికె'' ను స్థాపించారు. 2017 సెప్టెంబర్‌ 6న హత్యకు గురై చనిపోయేనాటివరకు వ్యవస్థాపక సంపాదకురాలిగా ఆ పత్రికను అనితరసాధ్యమైన రీతిలో నిర్వహించారు.

'కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు' పుస్తకంలో గౌరిని పరిచయం చేస్తూ బెంగళూరు అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకులు, రచయిత చందన్‌ గౌడ ఇలా చెప్పారు:

'విలేఖరిగా జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి కూడా అధికారం పట్ల నిర్భీతి, చక్కటి పదచాతుర్యం, ఏ పరిస్థితినైనా మానవీకరించే సహజసిద్ధ నైపుణ్యం ఆమెలో పుష్కలంగా ఉండడం గమనించవచ్చు. అవి చివరి వరకూ చెక్కుచెదరలేదు.

 సత్యసాయిబాబా మీద రాసిన వ్యాసంలో ఆయన ఆధిపత్య వ్యవహార శైలి పట్ల తన అయిష్టతను ఆమె స్పష్టంగా తెలియజేసింది. వరుస హత్యలు చేసిన ఒక నేరగాణ్ని జైల్లో కలిసినప్పుడు ఫోటో కోసం మొఖానికి కట్టుకున్న ముసుగును తీసేయమని చెప్పడంలో ఆమె సాహసం కనిపిస్తుంది.

చివరికి కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరేంద్ర పాటిల్‌ను తొలగించడంపై రాసిన రాజకీయ ముఖచిత్ర కథనంలో కూడా ఆమెలోని చమత్కారం ప్రతిబింబిస్తుంది. రాష్ట్రంలో పర్యటించేందుకు రాజీవ్‌ గాంధీ హెలికాప్టర్‌ కావాలని అడిగితే ముఖ్యమంత్రి కార్యాలయం వారు హెలికాప్టర్‌ మరమ్మతులో వుంది కాబట్టి దానికి బదులు కారు సరిపోతుందా అని సమాధానం చెప్పారని రాయడంలో ఆమెలోని హాస్యచతురత వ్యక్తమవుతుంది. ఆమె ఇంగ్లీషు రిపోర్టింగ్‌లో కనిపించే వివరణాత్మకత, భాషా నైపుణ్యం నిరుపమానమైనవి.

ఇంగ్లీషు జర్నలిస్టుగా పదిహేనేళ్లపాటు (1985-2000) పనిచేసిన గౌరి ఈ పుస్తకం మొదట్లోనే పేర్కొన్నట్టు తన తండ్రి 2000 సంవత్సరం తొలినాళ్లలో చనిపోయిన తరువాతే ఆయన నడిపిన 'లంకేశ్‌ పత్రికె'కు సంపాదకత్వ బాధ్యతలను చేపట్టింది. అప్పటివరకూ ఆమె ఎప్పుడూ కన్నడలో రాయలేదు. కానీ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలన్న తపనతో కన్నడలో పత్రికా రచనలను మొదలుపెట్టింది. తర్వాతి పదిహేడేళ్లలో ఆమె కన్నడ భాషా ప్రావీణ్యం ఎంతో మెరుగైనప్పటికీ ఇంగ్లీషు భాషపై  ఉన్నంత పట్టును, సౌలభ్యాన్ని మాత్రం అందుకోలేకపోయిందనే చెప్పాలి.

ఇంగ్లీషు చదువులు చదివిన అనేకమంది భారతీయుల మాదిరిగానే తను చిన్నప్పుడే మాతృభాషకు ఎలా దూరమయిందీ, తిరిగి దానిపై పట్టుకోసం ఎంత సంఘర్షణ పడిందీ ఒక  రచనలో ఆమె హృదయాన్ని కదిలించేలా రాసింది. ... ...

ప్రభుత్వ బాధ్యతారహిత చర్యలనూ, రాజకీయ నాయకుల  తప్పులనూ, వ్యాపారవేత్తల అవకతవకలనూ ఎక్కడికక్కడ ఎండగట్టేది. మొదట్లో సాహిత్యానికి కూడా పత్రికలో తగిన చోటును కల్పించేందుకు కృషి చేసింది. రచనల కొరత ఏర్పడినప్పుడు తనే స్వయంగా చిన్న కథలను అనువదించి ఆ కొరత లేకుండా చూసేది.

ఒక పక్క 'లంకేశ్‌ పత్రిక'ను వారం వారం వెలువరిస్తూనే మరోపక్క సొంతంగా అనేక రచనలు చేసింది. బెనజిర్‌ భుట్టో సంక్షిప్త జీవిత చరిత్రను రచించింది. ఇద్రీస్‌ షా 'టేల్‌ ఆఫ్‌ ది డర్వేషెస్‌'ను అనువదించింది. అలాగే ఫ్రాంకోయిస్‌ శాగన్‌, కుష్వంత్‌ సింగ్‌, ఇస్మత్‌ చుగ్తాయ్‌, గై డి మపాసా, ఓ.హెన్రీ, కేట్‌ చాపిన్‌ మొదలైన వారి కథలను అనువదించి 'కప్పు మల్లిగె' (బ్లాక్‌ జాస్మిన్‌-నల్ల మల్లెలు) పేరుతో ఒక సంకలనాన్ని వెలువరించింది. 1997లో కొంత కాలం అమెరికాలో వున్నప్పుడు పూర్ణచంద్ర తేజస్వి నవల 'జుగారి క్రాస్‌' ను ఇంగ్లీషులోకి అనువాదం చేసింది. (ఆ రాత ప్రతి ఎక్కడుందో ఇప్పుడు వెతకాలి.)

లంకేశ్‌ పత్రిక సంపాదకురాలిగా గౌరి బాధ్యతలు నిర్వహిస్తున్న కాలమూ, కర్ణాటకలో హిందుత్వ శక్తులు  సంఘటితమవుతున్న కాలమూ ఒకటే. హిందువులు, ముస్లింలు కూడా ఆరాధించే సూఫీ సాధువు బాబాబుడన్‌కు, హిందూ దేవుడు దత్తాత్రేయకు నెలవైన బాబా బుడన్‌గిరి ఆరాధనా స్థలాన్ని హిందూ మితవాద శక్తుల ఆక్రమణ నుంచి కాపాడేందుకు 2003లో గౌరి చేసిన సమరశీల రచనలు ఆమెను ఒక్కసారిగా సంక్లిష్టమైన రాజకీయ ప్రపంచంలో ఒక నూతన క్రియాశీల కార్యకర్తగా నిలబెట్టాయి.

తదనంతర కాలంలో కర్ణాటకలో హిందుత్వ శక్తుల హింసాకాండ పెరగడంతో ఆమెకు ఇక అదే ప్రధాన పోరాట రంగంగా మారింది. హిందుత్వ శక్తుల ఆగడాలకు వ్యతిరేకంగా 'కర్ణాటక మత సామరస్య వేదికల కార్యక్రమాల్లో గౌరి చాలా చురుకుగా పాలుపంచుకుంది. డజన్లకొద్దీ ప్రతిఘటనా సమావేశాలను నిర్వహించింది. ఆమె చిట్టచివరి సంపాదకీయం కూడా దేశానికి ఆందోళనకరంగా తయారవుతున్న 'తప్పుడు వార్తల' (టaసవ అవషర) విధానం గురించే. ...   ... 

తండ్రి లాగే గౌరికి కూడా లౌకికవాద ఆదర్శాలంటే ఎనలేని అభిమానం. అలాగే స్త్రీ పురుష సమానత్వం, కులాల సమానత్వం, మతాల శాంతియుత సహజీవనం, రైతుల, ఆదివాసుల సంక్షేమం వంటి అంశాల పట్ల కూడా. అందుకే వాటికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది.

సోషలిస్టు మేధావి రామ్‌ మనోహర్‌ లోహియా అభిమాని కావడం వల్ల లంకేశ్‌ తన పత్రికలో కమ్యూనిస్టు, వామపక్ష అతివాద రాజకీయాలకు స్థానం కల్పించేవాడు కాదు. కానీ గౌరి మాత్రం 2004, 2005 - రెండు సంవత్సరాల కాలంలో అంటే కర్ణాటకలో నక్సలైట్ల ఉనికి అంతంత మాత్రంగా వున్న కాలంలోనే నక్సలైట్‌ రాజకీయాల పట్ల పాఠకుల అవగాహనను పెంచేందుకు కృషి చేసింది. అయితే నక్సలైట్ల ఎన్నికల బహిష్కరణ పిలుపును మాత్రంగా ఆమె ఎన్నడూ సమర్థించలేదు. ఎందుకంటే ఎన్నికలనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మల వంటివని ఆమె భావించేది.

ఆమె దృష్టిలో అహింసా విధానం తిరుగులేనిది. అందుకే 2016 డిసెంబర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు లొంగిపోవడానికి గౌరి మధ్యవర్తిగా వ్యవహరించింది. మొదటి నుంచి ఆమె నక్సలైట్లను ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఎంతో నిజాయితీగా ప్రయత్నించింది.

అందుకు ఆమె రచనలే సాక్ష్యం.



కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్‌ రచనలు
ఇంగ్లీష్‌ పుస్తక సంపాదకుడు : చందన్‌ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి,   కె.సజయ,   ప్రభాకర్ మందార,   పి.సత్యవతి,   కాత్యాయని,   ఉణుదుర్తి సుధాకర్‌,   కె. సురేష్‌, కె.ఆదిత్య,   సుధాకిరణ్‌,   కల్యాణి ఎస్‌.జె.,    బి. కృష్ణకుమారి,   కీర్తి చెరుకూరి,  కె. సుధ,   మృణాళిని,   రాహుల్‌ మాగంటి,   కె. అనురాధ,   శ్యామసుందరి,   జి. లక్ష్మీ నరసయ్య,   ఎన్‌. శ్రీనివాసరావు,   వినోదిని,   ఎం.విమల,     ఎ. సునీత,    కొండవీటి సత్యవతి,   బి. విజయభారతి,    రమాసుందరి బత్తుల,    ఎ.ఎమ్‌. యజ్దానీ (డానీ),         ఎన్‌. వేణుగోపాల్‌,    శోభాదేవి,    కె. లలిత,    ఆలూరి విజయలక్ష్మి,   గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి



230 పేజీలు  , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849

Email ID : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌