Wednesday, September 16, 2015

1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా రచన : మనోజ్‌ మిట్ట & హెచ్‌.ఎస్‌ . ఫూల్కా

1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా
రచన : మనోజ్‌  మిట్ట  &  హెచ్‌.ఎస్‌ . ఫూల్కా


1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం దేశ రాజధాని దిల్లీలో సిక్కులపై జరిగిన జాతి హననకాండలో దాదాపు మూడువేల మంది బలయ్యారు. 2002లో గోద్రా సంఘటన అనంతరం గుజరాత్‌లో ముస్లింలపై జరిగిన జాతి హననకాండలో దాదాపు రెండువేల మంది బలయ్యారు. భారతదేశ చరిత్రలోనే అత్యంత కిరాతకమైన మారణహోమాలివి.

బాధితులకు కనీస న్యాయాన్ని అందించడంలో, నేరస్తులకు శిక్షలు విధించడంలో, భవిష్యత్తులో ఇలాంటి అమానుష సంఘటనలు జరగవని ప్రజలకు భరోసా కల్పించడంలో అన్ని వ్యవస్థలూ దారుణంగా విఫలమయ్యాయి.

ఆస్తినీ, ఆప్తులనూ కోల్పోయిన బాధితులు తలవంచుకుని భయం భయంగా బతుకీడుస్తుంటే ... ఈ దారుణాలకు పాల్పడిన నేరస్తులూ, గూండాలూ, రాజకీయనాయకులూ తాము ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో బోరవిరుచుకుని తిరుగుతున్నారు.

దిల్లీ అల్లర్లను ప్రస్తావిస్తూ అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ ''ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు దాని చుట్టూ వున్న భూమి కంపించడం సహజమే'' అని వ్యాఖ్యానించారు.

గుజరాత్‌ అల్లర్లను దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ''ప్రతి చర్యకూ ప్రతి చర్య వుంటుంది'' అని వ్యాఖ్యానించారు.

దిల్లీ అల్లర్లను విచారించేందుకు నియమించబడ్డ జస్టిస్‌ మిశ్రా కమిషన్‌ అతకతవకగా వ్యవహరించి ఘోరంగా విఫలమయింది. ఇక గుజరాత్‌ విషయంలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ మోదీకి ''క్లీన్‌ చిట్‌''ను ప్రసాదించింది.

ఈ రెండు మారణహోమాలు జరిగి సంవత్సరాలు గడిచినా వాటి ప్రాసంగికత మాత్రం నేటికీ చెక్కుచెదరలేదు. పైగా మొన్న దిల్లీ, నిన్న గుజరాత్‌ ... రేపు ఎక్కడో అని భయపడేలా మతోన్మాదం రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. చాపకింద నీరులా అన్ని వ్యవస్థలకూ విస్తరిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఈ అగ్నిపర్వతం పేలుతుందో, మరెంతమందిని అది బలితీసుకుంటుందో అన్న ఆందోళనను కలిగిస్తోంది.

పత్రికా రచయిత మనోజ్‌మిట్టా, సీనియర్‌ న్యాయవాది హెచ్‌.ఎస్‌.ఫూల్కా దిల్లీ ఊచకోత బాధితులకు న్యాయం జరిగేలా ఏళ్లతరబడి తమ శక్తిమేరా  ప్రయత్నించడమే కాకుండా - ఎంతో నిబద్ధతతో ఈ రెండు మారణహోమాలపై పరిశోధనలు జరిపి ''వెన్‌ ఎ ట్రీ షుక్‌ దిల్లీ : ద 1984 కార్నేజ్‌ అండ్‌ ఇట్స్‌ ఆఫ్టర్‌మాత్‌'' (రోలీ బుక్స్‌); ''ది ఫిక్షన్‌ ఆఫ్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ : మోదీ అండ్‌ గోద్రా'' (హార్పర్‌ కాలిన్స్‌) అనే పుస్తకాలను వెలువరించారు.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆ రెండు పుస్తకాలనూ ''1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు : వ్యవస్థల వైఫల్యాలపై పంచనామా'' పేరుతో ఒకే పుస్తకంగా తెలుగు పాఠకులకు అందిస్తోంది.

మంచి భవిష్యత్తును ఆకాంక్షించే, లౌకికవాదాన్నీ మానవ విలువలనీ  కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
..............

పై రెండు పుస్తకాలపై వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని సమీక్షలు:

సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కాంగ్రెస్‌ పార్టీ కౌన్సెలర్లు, పార్లమెంట్‌ సభ్యులు, కేంద్ర మంత్రులు ఏవిధంగా పాలుపంచుకున్నారో మనోజ్‌ మిట్ట, హెచ్‌ఎస్‌ ఫూల్కా ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా వివరించారు. ఆ సమయంలో కొందరు కాంగ్రెస్‌ వాదులు గుడ్లప్పగించి చూస్తుంటే, మరికొందరు వేటగాళ్లలాంటి గుంపులకు స్వయంగా నాయకత్వం వహించారు. ఇంకొందరు పోలీసులకు ఏ చర్యలూ తీసుకోవద్దంటూ ఆదేశాలను జారీ చేశారు.
- అశీష్‌ నందీ, ఔట్‌లుక్‌

ఈ పుస్తకాన్ని గొప్ప నిజాయితీతో రాశారు. ఎక్కడా రాజీపడకుండా కఠిన వార్తలను నివేదించే విలేఖరి దృక్పథంతో రాశారు. తిరుగులేని విస్పష్టమైన దృక్పథం అది. ఎవరినీ వదలకుండా, ఎంతటివారి పేరును ప్రస్తావించడానికైనా  వెనుకాడకుండా, కుండబద్దలు కొట్టినట్టు వారి బండారాన్ని బట్టబయలు చేసే దృక్పథం.  రంగుల మీడియా రాజ్యమేలుతున్న ఈరోజుల్లో దురదృష్టవశాత్తూ ఇలాంటి విలక్షణమైన దృక్పథం చాలా అరుదుగా కనిపిస్తుంది.
- రామచంద్ర గుహ, ది టెలిగ్రాఫ్‌

ఇప్పటికీ మనకు అత్యంత అవమానకరంగా అనిపించే దారుణాన్ని గుర్తుచేసుకునేందుకు మీరు ఈ పుస్తకాన్ని చదవాలి. ఎన్నో దారుణాలలో ఇది మొట్టమొదటిది. దిల్లీ తరువాత ముంబైలో, గుజరాత్‌లో ఇలాంటి దారుణాలే జరిగాయి. రేపు ఎక్కడ జరుగుతాయో ఎవరికి తెలుసు?
- సాగరిక ఘోష్‌, బిబ్లియో

స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వ ప్రమేయంతో జరిగిన ఒక గగుర్పొడిచే మారణహోమం గురించిన వాస్తవాలను ఈ పుస్తక రచయితలు ఎంతో శ్రమించి సమగ్రంగా ఆవిష్కరించారు. తమ రాజకీయ యజమానుల ఆదేశాలకు అనుగుణంగా దిల్లీ పోలీసులు పోషించిన అభిశంశనీయమైన పాత్రను ఈ పుస్తకం తూర్పారబట్టి ఎంతో సార్వజనిక సేవచేసింది. 
- లలిత పణికర్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌.

న్యాయస్థానంచేత నిర్దోషులుగా విడుదల చేయబడ్డవారు పునీతులని అనుకోవాల్సినపనిలేదని మనోజ్‌ మిట్టా పుస్తకం మనకు మరోసారి గుర్తుచేస్తుంది... ముఖ్యంగా భారీ పరస్పర విరుద్ధ సాక్ష్యాల మధ్య! అందుకే వాటిని ప్రశ్నించడం మన కర్తవ్యం అని ప్రబోధిస్తుంది.
- శివ విశ్వనాధన్‌, దక్కన్‌ క్రానికల్

గుజరాత్‌ అల్లర్లలో తన పాత్ర గురించి నరేంద్ర మోదీని గనక సరైన ప్రశ్నలు అడిగివుంటే ఇవాళ ఆయన బోనులో వుండేవారు... ప్రధాన మంత్రి పదవికి ఆయనను వ్యతిరేకించేవారు.
- మను జోసెఫ్‌, ద న్యూయార్క్‌ టైమ్స్‌

మనోజ్‌ మిట్ట రాసిన ఉత్కంఠభరితమైన పరిశోధనాత్మక పుస్తకం ''ద ఫిక్షన్‌ ఆఫ్‌ ఫాక్ట్‌ ఫైండింగ్‌ - మోదీ అండ్‌ గోధ్రా'' చదివినప్పుడు మీకు భారతీయ మీడియా ప్రాధాన్యతలు ఏమిటా అని ఆశ్చర్యం కలుగుతుంది. మన ఘనత వహించిన ప్రజాస్వామ్యానికి బాకా ఊదడం విషయమై అది కించిత్తు కూడా సిగ్గుపడకపోవడం గురించి విస్మయం కలుగుతుంది.
    మిట్ట చాలా మంచి పుస్తకం రాశారని చెప్తే సరిపోదు. గుజరాత్‌లో మోదీ నెలకొల్పిన 'నమూనా న్యాయం'ను ఈ పుస్తకం తూర్పారబట్టింది. భారత ఉదారవాద ప్రజాస్వామ్యంపై చాలా కటువైన వ్యాఖ్యానాలు చేసింది.  పత్రికా విలేకర్లతో సహా తగిన న్యాయ ప్రక్రియ మీద నమ్మకంతో కళ్లు మూసుకుని కూచున్న వాళ్లందరినీ మిట్టా ఎద్దేవా చేస్తాడు. వారి మూలంగానే న్యాయ వ్యవస్థను తెలివిగా కుప్పకూల్చారనీ, అది మోదీకీ ఆయనకంటే ముందరి 1984 అల్లర్లలో పాలుపంచుకున్న పలుకుబడివున్న నేతలకీ ''క్లీన్‌ చిట్‌''ని ప్రసాదించిందని అంటారు.
- రాజ్‌దీప్‌ సర్‌దేశాయ్‌, హిందుస్థాన్‌ టైమ్స్‌


1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు ... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా

రచన : మనోజ్‌  మిట్ట  &  హెచ్‌.ఎస్‌ . ఫూల్కా


ఆంగ్లమూలం: When A Tree Shook Delhi, The 1984 Carnage and its Aftermath by Manoj Mitta and H.S. Phoolka, Lotus Collection, Roli Books, New Delhi, © Manoj Mitta and H.S. Phoolka                        
The Fiction of Fact-finding: Modi and Godhra, HarperCollins Publishers India, 2014                     © Manoj Mitta 2014

తెలుగు అనువాదం :  ప్రభాకర్‌ మందార, రివేరా

ప్రధమ ముద్రణ : సెప్టెంబర్ 2015 

441 పేజీలు, వెల : రూ. 250/-

ప్రతులకు వివరాలకు:  
 హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com
 

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌