Wednesday, August 12, 2015

చరిత్ర చాటిన సత్యం - వి. ప్రతిమ (మాతృక, మాస పత్రిక ఆగస్ట్ 2015 సంచిక)



      చరిత్ర  చాటిన  సత్యం

నల్లజాతి  నిప్పు కణిక  సోజర్నర్  ట్రూత్’ నవల పరిచయం  
వి. ప్రతిమ

స్వేచ్ఛ’ అన్న పదమే ఎరుగని బానిసలకు పిల్లలపై ప్రేమే తప్ప హక్కుండదు. ఇది రాక్షసులు రాసిన చట్టం. ఏ మనిషయినా ఎన్నెన్ని అవసరాలూ, అత్యవసరాలనైనా వొదులుకోగలరు కానీ తమ కడుపులో పుట్టిన పిల్లలు తమ కళ్ళ ముందు పెరగాలని కోరుకోవడం అత్యాశేమీ కాదు గదా. నవమాసాలు మోసి అయిదారేళ్ళు ప్రేమతో పెంచుకున్న పిల్లల్ని యజమాని తమ కళ్ళ ముందే వేలం వేసి అమ్మేసుకుంటుంటే చూస్తూ వూరుకోవాలి.

కన్నవాళ్ల కడుపుకోత యజమానికి పట్టదు. ఇది ఏ ఒక్కరిదో, ఒక యింటిదో, ఒక వూరిదో కాదు మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసించిన ఒకానొక జాతి మొత్తానిది. 

ఆ జాతి ఏది? ఆఫ్రికా అడవుల్లో పచ్చి నెత్తురు తాగే క్రూరమృగాల్ని ఎదిరించగలిగిన ఒక మహా జాతి... అదే నల్ల జాతి. ఆఫ్రో అమెరికన్ జాతి. ఆ బడబాగ్నిని ఎదిరించి నిలిచిన ఇసబెల్లి కధ ఇది. ఒక్క బానిసత్వమే కాదు యింకా అన్ని రకాల వివక్షలకూ అవమానాలకూ ఎదురు నిలిచి పోరాడి తాను నిప్పుకణికయి రగులుతూ తన చుట్టూ ప్రపంచానికి వెలుతురు పంచిన ‘సోజర్నర్ ట్రూత్’ కధ యిది. 
చీకటి ఖండం అని పిలవబడే ఆఫ్రికా ఖండంలో స్వేచ్ఛగా వీధుల్లో పొలాల్లో తిరుగుతోన్న అమాయకమైన ఆఫ్రికన్స్ ను మోసంతో చేబట్టి కఠినంగా హింసించి ఇనుప గొలుసుల్తో బంధించి నరకం చూపించి నౌకలెక్కించి అమెరికా సంయుక్త రాష్ట్ర తీరాలు చేర్చి ఉక్కులాంటి నల్లజాతీయుల్ని బానిసలుగా తెగనమ్మి డబ్బు చేసుకున్నారు నరమాంసపు వ్యాపారులైన తెల్లవాళ్ళు. పంధొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో అమెరికా గడ్డ మీద వికృతరూపం దాల్చిన బానిసత్వం, విచ్ఛిన్నమైన నల్ల జాతీయుల లక్షల కుటుంబాల గురించీ గొలుసులతో బంధించబడి, కొరడా దెబ్బలతో పీల్చి పిప్పి కావించబడ్డ శరీరాలూ … యివన్నీ మనం గతంలో విని కరిగి నీరయినవే. 

అలెక్స్ హేలీ ‘రూట్స్’ లోనూ, మార్టిన్ లూధర్ కింగ్ జీవిత చరిత్రలోనూ, యింకా మాల్కం ఎక్స్ జీవిత చరిత్రలోనూ చాలా వరకు చదువుకొన్నవే. అయినా యిది ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీ జీవిత చరిత్ర.  తొమ్మిదేళ్ళ వయసులో విక్రయించబడి తల్లిదండ్రుల్నీ, కుటుంబాన్నీ కోల్పోయి, ఒంటరిగా విలపించి కుటుంబం కోసం పరితపించిపోయిన ఆ చిన్నారి పాప ఎట్లా ఆ సంకెళ్ళను తెంచుకుని స్వేచ్ఛాగానమాలపించిందో తెలిపే నల్లజాతి బానిసోద్యమకారిణి  జీవితం యిది. 

ఆమెకు చదువు లేదు. అక్షరమంటే తెలియదు, గురువంటే అసలే తెలీదు. కాఠిన్య జీవితమే ఆమెకు చదువు నేర్పించింది. ఆమె మనసే ఆమెకు గురువు. తెల్లవారి దౌష్ట్యమే పుస్తకం. గుండెల్లో రగిలే మంటల్ని పాటలుగా రూపాంతరం చెందించి ఆలపించి పాటల్నే పావురాలుగా ఎగురవేసిన స్వేచ్చా గానలహరి ఆమె.

బానిస పిల్లలకి పుట్టినప్పటి నుండే వినయంగా, బానిసత్వంతో మెలగడమెలాగో తలిదండ్రులే నేర్పిస్తారు. యజమాని మెప్పుతో స్వేచ్ఛ లభిస్తుందని ఆశపడి తన శరీరాన్ని మొత్తం పని అనే కొలిమిలో కాల్చుకోనేది బెల్లీ. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా యజమాని యింట్లో, పొలంలో పగలూ రాత్రీ ఎండా, గాలీ, వానా దేన్నీ లెక్క చేయకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఎప్పటికైనా తల్లిదండ్రుల్ని కలుసుకోగలనన్న నమ్మకంతో పనిచేస్తూనే ఉండేది. 

ఆ కల నిజమవకుండానే తల్లి మరణం ఆమెను ఎంతగానో క్రుంగదీస్తుంది. అయినా విలవిలలాడి పోతోన్న తండ్రిని తానే తల్లయి ఓదారుస్తుంది. “నాన్నా! వచ్చే పది సంవత్సరాలలో నల్లజాతి బానిసలందరికీ స్వేచ్ఛ వస్తుందట ... అప్పుడు ఎక్కడా బానిసత్వమే వుండదట. అందరూ చెప్పుకుంటున్నారు .. అప్పుడు నాకు స్వేచ్ఛ  వచ్చాక నిన్ను నాతో తీసుకుపోయి నా దగ్గరుంచుకొని అమ్మలాగా బాగా చూసుకుంటా ... అప్పటివరకూ దిగుల్లేక ఉండు నాన్నా’’అంటూ అమాయకంగా చెప్తుంది. 

తండ్రికి బాగా తెలుసు. అది కనుచూపు మేరలో లేదని. బానిసలకు మాతృప్రేమ, కన్నప్రేమ, సంతోషం, నిర్ణయాలు వంటి ఎన్నెన్నో అనుభూతులు కర్కశంగా సమాధి చేయబడ్తాయని. బానిసలకు యింటి పేరు ఉండదు. పేరు పక్కన తాము పని చేస్తున్న తమ యజమాని పేరు కలుపుతారు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు తమ పేరు చివర భర్త పేరు తగిలించుకోవడం బహుశ ఈ బానిస సంస్కృతికి ప్రతీకేమో అనిపిస్తుంది.
బానిసలకు కూడా ఒక పండగ వుంటుంది. ఆ పండగ వేడుకల్లో హఠాత్తుగా పరిచయమవుతాడు బాబ్. పక్క పక్క పొలాల్లో చెరొక యజమాని వద్ద పని చేస్తుంటారు. బాబ్ తో మాట్లాడటం బెల్లికి యిష్టంగా వుంటుంది. కానీ బాబ్ యజమాని కాటిలిన్ యిందుకు ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు బెల్లి యజమాని డ్యూమండ్ కి చెందుతారు కాబట్టి. “మన అనుబంధంలో మాధుర్యం మనం ఆలోచిస్తుంటే యింకా మనకి పుట్టని బిడ్డలపై వచ్చే లాభం గురించి వాళ్ళాలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడీ బానిసత్వం నుండి బయట పడదామా అని మనం వున్నాం. వాళ్ళేమో మన బిడ్డల్ని బానిసలుగా మార్వడం గురించి ఆలోచిస్తున్నారు” అంటుంది బెల్లి. 

బానిసలకు సొంత ఆలోచన, ఆశ, ఉల్లాసం, స్పందనలూ ఉండరాదు. యజమానులు భరించలేరు. తన యజమానిని కాదని బెల్లి వద్దకు వచ్చిన బాబ్ వెంటాడబడి, వేటాడబడి కొట్టి చంపబడతాడు. తన మాసా కిందనే పనిచేసే మరో నిగ్గర్ ని తప్పనిసరిగా పెళ్లి చేసుకుంటుంది. పిల్లలని కంటుంది. నాలుగేళ్ళు కూడా నిండని తన కొడుకుని యజమాని అమ్మివేయడాన్ని తట్టుకోలేక అతడి మీద కక్ష పెట్టుకుంటుంది బెల్లి. అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ చిలకా, గోరింకల్లా వున్న బిడ్డల్ని విడదీసి లాభానికమ్ముకోవడం, అర్ధరాత్రి తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రిస్తోన్న పసికందుల్ని సైతం లాక్కొచ్చి వేలంలో తెగనమ్ముకోవడం తెల్లవాడికి ఉగ్గుతో పెట్టిన విద్య. 

తమ పిల్లల జోలికెళితే ఏ జంతువయినా మన మీద పడి కరుస్తుంది. కానీ కొండల్ని పిండి కొట్టగల కండలు తిరిగిన నల్లవారు మాత్రం మౌనంగా రోదించారే తప్ప ఎదిరించలేదు. ఎదిరించిన వారు బతకనూ లేదు. కానీ బెల్లి దెబ్బతిన్న కాలనాగులా సలసల మరుగుతోన్న రక్తంతో బుసలు కొడుతూ యజమాని డ్యూమండ్ని ఢీకొంటుంది. దెబ్బతిన్న ఆత్మాభిమానంతో బిగించి కట్టబడ్డ ఉక్కుసంకెళ్ళను  ఛేదించి, నిరంకుశమైన చీకట్లను చీల్చుకుంటూ, స్వచ్ఛమైన వెలుగురేఖలను వెదుక్కుంటూ విశాలమైన ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.
1827వ సంవత్సరం జులై4వ తేదీ నాటికి 30 సంవత్సరాలు నిండిన బెల్లికి ఆమె నివస్తిస్తున్న రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక చట్టం వలన బానిసత్వం నుండి విముక్తి లభించింది. బెల్లి నవ్య స్వేచ్ఛావలువలు చుట్టుకుని పదేపదే మురిసిపోయి తన అసలైన ప్రయాణాన్ని ప్రారంభించింది ... తన కొడుకు పీటర్ని వెదుక్కుంటూ. పైసా ఫలితం రాని శ్రమ చేసి చేసి కాయలు కాసిన చేతులతో, ఉగ్గు పాలిస్తూ పసిబుగ్గల్ని నిమిరిన చేతులతో ఒక నల్లజాతి మనిషి, అందునా స్త్రీ మొట్టమొదటిసారిగా నవ్యసమాజానికి నిలువెత్తు గురుతుగా నిలిచిన న్యాయస్థానంలో రిట్ వేసింది. అలా తెల్లవాడిని ఎదిరించి నిలిచి కోర్టులో గెలిచి తన కొడుకుని దక్కించుకొన్న తొలి తల్లి బెల్లి. అంతే కాకుండా ఆమె న్యూయార్క్ లో వున్నప్పుడు ఆమె మీద పడిన హత్యానేరాన్ని ఆధారంగా చేసుకొని చాలా వ్యతిరేకంగా రాసిన ఒక పత్రిక మీద కూడా రిట్ వేసి గెలిచింది. చట్టపరంగా ఇది ఆమె రెండో విజయం. 

ఆ తర్వాత తాను నల్లజాతి స్త్రీ అయినందుకుగాను తనను బస్సు ఎక్కనివ్వకుండా చేసినందుకు బస్ కండక్టరు మీద కోర్టులో రిట్ వేసి గెలవడమే కాకుండా ఆ తర్వాత నల్లజాతి వారందరూ బస్సులో ఎక్కేందుకు మార్గం సుగమం చేసింది. 
 
కుటుంబాన్ని భర్త కప్పచెప్పి, శృంఖలాలు అవి ఏ రూపంలో వున్నా సరే, శక్తివంతంగా బద్దలు కొట్టటం కోసం జీవితమంతా సంచారం చేసిన విముక్తి ఉద్యమనేత బెల్లి. ఇంకా చెప్పాలంటే స్త్రీల హక్కు, ఆస్తిహక్కు, ఓటు హక్కు యింకా జైళ్ల సంస్కరణవంటి అనేక అణచివేతల్ని ఎదిరించి నిలిచిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె. అప్పటికి అరాచకంగా ఉన్న న్యూయార్కును వదిలి చాలా ప్రాంతాలు తిరగదలిచి తన పేరును సోజర్నర్ ట్రూత్ గా మార్చుకుంటుంది. సోజర్నర్  అంటే ‘సంచారిణి’ అని అర్ధం. సత్యం కోసం అన్వేషిస్తూ తిరుగుతోంది కాబట్టి ఆ సత్యమే ఆ యింటి పేరై  ‘సోజర్నర్  ట్రూత్’ గా మారింది. 

ఎవరు తనతో నడిచినా నడవక పోయినా తాను మాత్రం ఎన్నో పట్టణాలనీ, పల్లెల్నీ  తిరుగుతూ యింకా మిగిలి ఉన్న బానిసత్వాన్ని విముక్తి చేయడం కోసం ముందుకు నడిచింది. బానిస సంకెళ్ళను ముక్కలు ముక్కలుగా విడగొట్టి తమ జాతీయులకు విమోచన కల్పించడానికి అలుపెరుగక శ్రమించిందామె. తిండి, నిద్ర, విశ్రాంతి కోసం ఎప్పుడూ తపించకుండా చాలా ప్రాంతాలని సుడిగాలిలా చుట్టేసిందామె. ఒక వైపు బానిసత్వ వ్యతిరేకోద్యమంలో పాల్గొంటూనే మరో వంక స్త్రీల హక్కుల సభలు ఏర్పాటు చేసి ఎన్నో చర్చలు చేసేది. మరో వంక నీగ్రోల ఓటుహక్కు కోసం అనేకానేక మందితో పరిచయం ఆమెను మరింత ముందుకు నడిచేలా తోడ్పడింది. 

ఆమె దారుఢ్యం, ఎత్తూ చూసి అంతా ఆమెను పురుషుడనే అనుకొనేవారు. “నేను దున్నగలను, నాటగలను. పంటకోసి నూర్చి ధాన్యాన్ని యిల్లు చేర్చగలను. ఏ పురుషుడి సహాయమూ నాకవసరం లేదు. నేను స్త్రీని కానా మరి?” అంటూ ఆవేశంగా గొంతెత్తి స్పష్టం చేస్తుంది. స్త్రీలను కించపరిచే విధంగా మాట్లాడే మతాధికారుల్ని ఆమె నిలదీస్తూ “క్రీస్తు స్త్రీలకు హక్కులివ్వలేదని మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే క్రీస్తు స్త్రీకాదు కనుక’ అంటుంది. 1840 ప్రాంతంలో సోజర్నర్  ఈ మాట అన్నది అనుకొంటే యివ్వాల్టి స్త్రీలకు కూడా ఉద్వేగం కలుగుతుంది. “తల్లకిందులుగా ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా సరి చేస్తామని స్త్రీలు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళనా పని చేయనిస్తే మేలని నేననుకుంటున్నాను” అంటూ సభలో నిష్కర్షగా ప్రకటిస్తుందామె.
ఈ కధలో ‘అండర్ గ్రౌండ్ రైల్ రోడ్’ అనే పదం ఒక మాట ఉంటుంది అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ అంటే భూమి అంతర్భాగాన రైల్వే ట్రాక్ అనో , రోడ్డు అనో కాదట. అమెరికాలో దక్షిణ రాష్ట్రాల నుండి ప్రతి సంవత్సరం వేలకొద్ది బానిసలు తప్పించుకొని పారిపోయి ‘ఫ్రీ స్టేట్స్’కి చేరేవాళ్లు. ఫ్రీ స్టేట్స్ అంటే బానిసత్వం లేని కొన్ని ఉత్తర రాష్ట్రాలు. ఈ పారిపోతున్న వాళ్ళను కనిపెట్టి వివిధ సురక్షిత ప్రాంతాలకు చేరవేసేవాళ్ళు కొందరు. ఎందరో మానవతావాదులు, వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈ అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ని నిర్వహించారనీ, ఆశ్చర్యకరంగా యిందుకు తెల్ల జాతీయులెందరో కూడా సహకరించారని తెలిసి విస్మయం కలుగుతుంది. 

ఇలా ఒక స్థావరం నుండి మరో స్థావరానికి అంచెలంచెలుగా మార్చడమన్నది అంత తేలికైన విషయమేమీ కాదు. మిలటరీ వాళ్ళు వేటకుక్కలతో ప్రతిచోటా కాపలా ఉండేవాళ్లు. చిన్న పొరపాట్లకే కఠినమైన శిక్షలూ, జరిమానాలూ వుండేవి. ఈ వ్యవస్థలో పనిచేసిన ఎందరో ఇప్పటికీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. అలా కెనడా చేరుకొన్న బానిసలకు ఎంతో స్వేచ్ఛ, విద్య, రక్షణ, పని లభించేవే. 
సోజర్నర్ పేరు అమెరికా అంతా వ్యాపించిపోయింది. ‘అంకుల్ టామ్స్ కాబిన్’ రచయిత్రి  ‘హరియట్ బీచర్ స్టవ్’ తెల్లజాతి మనిషి. ఆమె భర్త బానిసత్వ విమోచనోద్యమకారుడు. సోజర్నర్  ఆ నవలని ఎవరితోనో చదివించుకుని విని హరియట్ ని కలిసి అభినందనలు తెలిపినపుడు ఆమె గురించి చాలా విని వున్న రచయిత్రి  సోజర్నర్  ట్రూత్ ని కలుసుకోగలిగినందుకు ఆనందపడుతుంది. అలాగే అమెరికా పదహారో ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ని కలిసి నల్ల జాతీయులకు మేలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘మీరు ప్రెసిడెంట్ అయ్యేదాకా మీ పేరు విని వుండలేదు’ అంటుంది. అందుకు వెంటనే లింకన్ ‘నేను ప్రెసిడెంట్ కాక ముందు నుండే మీ పేరు విని ఉన్నాను. మీరు నాకు పరిచితులే’ అంటాడు. అంతేకాకుండా బానిసత్వాన్ని నిర్మూలించిన చేత్తో ‘ఫర్ ఆంటీ సోజర్నర్  ట్రూత్ ‘అని ఆటోగ్రాఫ్ ఇస్తాడు.
ఒక నిగ్గర్ అందునా ఒక స్త్రీ తన జీవితకాలంలోనే ఒక మహాత్మురాలిగా గుర్తింపునందుకున్న ‘మహాప్రస్థానం’ ఈ నవల. ఈ నవల, లేదా ఈ జీవిత చరిత్ర చదువుతున్నంత సేపూ ఎంతోమంది బానిసోద్యమకారుల జీవితాలు చరిత్రకెక్కాయి. కానీ ఈ సోజర్నర్ ట్రూత్ గురించి మనకెందుకు అందుబాటులోకి రాలేదు? కేవలం స్త్రీ అయినందువల్లేనా? ఆమె స్నేహితురాలు ఆల్బర్ట్ గిల్ట్ ఈ బానిసోద్యమకారిణి  జీవితాన్ని గురించి రాయకుండా వుండి ఉంటే, యర్రింగ్ టన్ అప్పుడా పుస్తకాన్ని ప్రచురించలేక పోయి ఉంటే ఆమె జీవితం ఎన్నటికీ చరిత్రకందేది కాదు. ముఖ్యంగా చేలూరి రమాదేవి ఈ గ్రంధాల ఆధారంగా ‘నల్లజాతి నిప్పుకణిక  సోజర్నర్ ట్రూత్’నవల మనకు అందించలేకపోయేది.
ఇది రాస్తున్న సమయానికి అమెరికా దక్షిణ రాష్ట్రాలలోని ప్రభుత్వ కార్యాలయాల మీద ఎగురుతున్న ‘కాన్ఫిగరేట్ జండాలను’ (బానిసత్వాన్ని సూచించే జండాలు)  దించివేయడం ముదావహం. 

(మాతృక మాసపత్రిక ఆగస్ట్ 2015 సౌజన్యం తో ) 

 నల్లజాతి నిప్పుకణిక  - సొజర్నర్‌ ట్రూత్‌
- రమాదేవి చేలూరు
ధర : రూ. 100/-
మొదటి ముద్రణ : డిసెంబర్ 2003 ; మహిళా మార్గం ప్రచురణలు, హైదరాబాద్
హెచ్ బి టి తొలి ముద్రణ : జూన్ 2015


పతులకు, వివరాలకు: 
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ : 040 23521849 
ఇ మెయిల్ ఐ డి : hyderabadbooktrust@gmail.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌