Saturday, November 1, 2014

మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?


మమ్మల్ని గౌరవంగా బతకనివ్వరా?

చుట్టూ ఉన్న సమాజపు చిన్నచూపు.. రౌడీమూకల లైంగిక వేధింపులు.. ఖాకీల క్రూరత్వం.. వెరసి ‘హిజ్రాల’కు మనిషిగా గుర్తింపే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తామూ మనుషులమేనని ధైర్యంగా గళం విప్పారు తమిళనాడుకు చెందిన ఎ.రేవతి. అందులో భాగంగా ఒక హిజ్రాగా తన జీవితాన్ని ఆమె అక్షరీకరించడం అరుదైన విషయం. ఆమె రాసిన ఆ పుస్తకం ఆంగ్లంలో ‘ఎ హిజ్రా లైఫ్‌ స్టోరీ’గా విడుదలైంది. తెలుగులో ‘ఓ హిజ్రా ఆత్మకథ’గా ఈ పుస్తకాన్ని అనువదించారు.

నేడు పుస్తకావిష్కరణ సందర్భంగా ఆమెని ‘నవ్య’ పలకరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
‘నాలో సీ్త్ర లక్షణాలు ఉన్నాయని గుర్తించాక బయట తిరగడానికి సిగ్గుపడ్డా. అప్పటి వరకు అబ్బాయిలా అందరితో కలివిడిగా ఉన్న నాకు ఒక్కసారిగా అమ్మాయిల దుస్తులు వేసుకోవాలనిపించేది. అమ్మాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. మాది ఒక పల్లెటూరు. పరువుగల కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈ లక్షణాలేంటని కన్నీరు పెట్టుకోని రోజు లేదు. మా అమ్మ, నాన్నలు తలెత్తుకుని తిరగ్గలరా..? అని మధనపడిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి ఆత్మన్యూనత నుంచి నేను హిజ్రానని సగర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగడం వెనుక ఒళ్లు జలదరించే సంఘటనలనేకం ఉన్నాయి. ఓ మగాడు హిజ్రాగా మారిన తరువాత సమాజంలో ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో. నా హృదయాంతరాలను ఆవిష్కరించి, మా హిజ్రాల బాధలు సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాను’ అంటూ రేవతి తన జీవితానుభవం గురించి ఇలా చెప్పుకొచ్చారు.

క్రికెట్‌బ్యాట్‌తో కొట్టాడు..
‘‘మాది తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాకు చేరువలో ఉన్న ఓ కుగ్రామం. మేం నలుగురం. అందరికన్నా నేనే చిన్న. నా పేరు దొరైస్వామి. మా ముగ్గురు అన్నయ్యల్లాగే నేను కూడా అబ్బాయిలతో స్నేహంగా ఉండేవాడిని. ఏమైందో ఏమో తెలియదు కొంచెం ఊహ వచ్చాక నాలో మార్పులు చోటు చేసుకోవడం గమనించా. అప్పటివరకు అబ్బాయిలతో కలివిడిగా తిరుగుతున్న నాకెందుకో చెప్పలేనంత సిగ్గుగా ఉండేది. అబ్బాయిలతో కంటే అమ్మాయిలతో స్నేహం చేయాలనిపించేది. అమ్మాయిల దుస్తులు ధరించాలి అనిపించేది. నాలో మార్పులను మా అన్నయ్యలు గుర్తించి మా నాన్నకు చెప్పేవారు. మొదట్లో నాన్న తేలిగ్గా తీసుకున్నా, ఆ తరువాత నా ప్రవర్తన ఆయనకూ నచ్చేది కాదు. ఎందుకిలా చేస్తున్నావంటూ కోప్పడేవారు. నేనేందుకు ఇలా మారానో నాకు తెలిస్తే కదా...? నాన్న కోప్పడినప్పుడల్లా బాధగా ఉండేది. ఏడుపు తన్నుకొచ్చేది. నాలాంటి వాళ్లకు ఇక్కడ చోటు లేదనిపించేది. పదో తరగతి వరకు ఎలాగోలా బండి లాగుతూ వచ్చా. ఒక రోజు మా అన్నయ్య నా ప్రవర్తనతో విసిగిపోయి క్రికెట్‌ బ్యాట్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.. ఇక ఇక్కడ నేనుండడం కష్టమని.

ఢిల్లీ ప్రయాణం..
మా అమ్మ చెవిపోగులు దొంగతనం చేసి, సేలం నుంచి ఢిల్లీ రైలెక్కాను. రెండు రోజుల ప్రయాణం అనంతరం ఢిల్లీలో దిగి, అక్కడ నాలాంటి వారిని చూశాక కాని మనసు కుదుటపడలేదు. హిజ్రాలు అధికంగా నివసించే ప్రాంతానికి ఒక వ్యక్తి సహాయంతో చేరుకున్నా. నా గురించి ఓ హిజ్రాకు పూర్తిగా చెప్పాను. ఆమే నాకు అమ్మైంది, గురువైంది. అలా ఢిల్లీలో దొరైస్వామిని కాస్తా రేవతిగా మారిపోయాను. అప్పటి నుంచి సమాజంలో నేను అనుభవించని ఛీత్కారాలు లేవు. ఢిల్లీ పోలీసులు నానా చిత్రహింసలకు గురిచేసేవారు. యాచకం చేసి తెచ్చుకున్న డబ్బులను కూడా తీసేసుకునేవారు. ఆ బాధలు పడడం కన్నా, చచ్చిపోతే బాగుండు అనిపించేది. ఆ రోజుల్ని తల్చుకుంటే ఇప్పటికీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. నేను పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. అయినప్పటికీ చిన్నప్పుడు నాకు
అబ్బిన నాట్యం, నటన, కొద్దో గొప్పో రాయగల సామర్థ్యం ఉన్నాయి. వాటిని ఆయుధంగా చేసుకుని హిజ్రాల ఈతిబాధలను సమాజానికి చెప్పాలని తీవ్రంగా ఆలోచించేదాన్ని. రేవతిగా మారిపోయిన తరువాత ఓ రౌడీమూక నాపై అత్యాచారానికి తెగబడింది. దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే పోలీసులు నన్ను నగ్నంగా నిల్చోబెట్టి మరీ అవమానించారు. అవన్నీ భరించాను. నాలా ఇలాంటి బాధలు ఎవరూ పడకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఢిల్లీ వదిలి ఎక్కడికైనా వెళ్లి సమాజంలో గౌరవంగా బతకాలనుకున్నాను.

సాహిత్యమే నా ఆయుధం..
మా అమ్మ (ఢిల్లీలో రేవతికి ఆశ్రయమిచ్చిన హిజ్రా) సహాయంతో బెంగళూరుకు చేరుకుని ఢిల్లీ పరిచయాలతోనే ‘సంగమ’ అనే ఎన్జీవో సంస్థలో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా చేరాను. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన సంస్థ అది. లైంగిక వేధింపుల బాధితులకు సంబంధించిన వివరాలు సేకరించే పని నాది. అలా సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందేందుకు బెంగళూరు మొత్తం తిరగడంతో పాటు, తమిళనాడులోని హిజ్రాల గురించి ఆరా తీయాలని సంకల్పించాను. ఆ విధంగా తమిళనాడులోని అన్ని జిల్లాల్లో పర్యటించి, హిజ్రాలపై పరిశోధన చేసి 2004 సంవత్సరంలో నా తొలి పుస్తకం ‘ఉనర్వుం - ఉరువవుమ్‌’ (దేహం- భావం) రాశాను.

50 మంది హిజ్రాలను కలుసుకుని వారి జీవితానుభవాలను, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని రాసిన పుస్తకమది. ఆ పుస్తకాన్ని హిందీలో ఢిల్లీకి చెందిన యోధప్రెస్‌ ప్రచురించింది. అలాగే కన్నడంలోకి తర్జుమా అయ్యింది. అయితే ఆ పుస్తకంలో ఇంకా ఏదో వెలితి అనిపించింది. అందుకే నా జీవిత చరిత్రను రాయాలని
నిర్ణయించుకున్నాను. కళ ద్వారానే సమాజంలోకి భావాలను సులువుగా తీసుకెళ్లగలమని బలంగా నమ్మే నేను సాహిత్యాన్నే ఆయుధంగా మార్చుకోవాలనుకున్నాను. 2005-06 సంవత్సరం మధ్య నా ఆత్మకథను రాశాను. తెహెల్కా పత్రిక ప్రతినిధుల ద్వారా పెంగ్విన్‌ సంస్థను సంప్రదించి నా ఆత్మకథ గురించి చెప్పాను. వారు ముందుకు రావడంతో ‘వెల్లైమొళి’ (తెల్లని భాష)గా తమిళంలో నా ఆత్మకథ పుస్తకం ప్రచురితమైంది. ఓ హిజ్రా ఆత్మకథకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దేశంలోనే ఏ హిజ్రా పంచుకోలేని వ్యక్తిగత అనుభవాలకు కూడా ఈ పుస్తకంలో అక్షర రూపమిచ్చాను. మొదట్లో నా చిన్ననాటి స్నేహితులు ఇలా ఎందుకు రాయటం అని నిరుత్సాహపరిచారు. అయితే సమాజంలో హిజ్రాల పట్ల ఉన్న దురభిప్రాయం తొలగాలన్న సంకల్పంతోనే ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఈ పుస్తకం రాశాను.

అన్ని భాషల్లోకి అనువాదం..
నా ఆత్మకథ ఆంగ్లంలో ‘ద ట్రూ స్టోరి: ఏ హిజ్రా లైఫ్‌’గా అనువాదం కాగా, మలయాళం, కన్నడం భాషలలో కూడా అనువదించారు. తాజాగా తెలుగులోనూ ‘ఓ హిజ్రా కథ’ పేరుతో అనువాదానికి నోచుకుంది. ఓ హిజ్రా ఆత్మకథ ఇన్ని భాషలలో రావడం నిజంగా రికార్డే. నా కథతో ఇప్పటికే పలు నాటక సంఘాలు తమిళనాడు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్నాయి. నాటకంపై నాకూ కొంచెం అవగాహన ఉండడంతో నేను కూడా నా ఇతివృత్తాన్ని వీథి నాటకంలా వేయిస్తున్నాను.

కళాశాలల్లో, పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చేలా చేస్తున్నాను. అమెరికాలోని ఓ కళాశాలలో నా ఆత్మకథ పాఠ్యాంశంగా కూడా చేర్చారంటే నా జీవితం ఎంతమందిని ప్రభావితం చేసిందో కదా.

మేమంటే ఎందుకీ చిన్నచూపు..
హిజ్రాలంటే సమాజంలో చిన్నచూపు ఉంది. చేతులు చరుస్తూ యాచిస్తుంటారని, లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారన్న హీనమైన అభిప్రాయం ఉంది. మాకు ఎక్కడా ఉపాధి అవకాశాలు ఇవ్వరు. కనీసం ఇల్లు కూడా అద్దెకివ్వరు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పులు రావాలనే నేను పోరాడుతున్నాను. నాకు తెలిసిన మార్గం ద్వారానే సమాజంలో మాపై ఉన్న అభిప్రాయాన్ని తుడిచిపెట్టాలనేదే నా లక్ష్యం. అందుకే నా పుస్తకాన్నే ఆయుధంగా మలచుకున్నాను. ప్రస్తుతం నేను స్వప్నించిన మార్పులు కన్పిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా హిజ్రాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. కేంద్రప్రభుత్వం మమ్మల్ని మూడో విభాగం కింద పరిగణించడాన్ని వ్యక్తిగతంగా నేను వ్యతిరేకిస్తున్నాను. నా వరకు నేను మహిళగానే భావిస్తాను. ప్రస్తుతం నా వయస్సు 47 యేళ్లు. ఇన్నేళ్ల నా ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... మా పట్ల సమాజంలో చిన్నపాటి మార్పులు వచ్చాయనిపిస్తోంది. నా వరకు అయితే నేను అనుకున్నది సాధించాననే సంతృప్తి ఉంది. నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో పత్రికల సహకారం కూడా చాలానే ఉంది. ప్రస్తుతం నేను నామక్కల్‌లో నా తండ్రి వద్దే ఉంటున్నాను. మా అమ్మ చనిపోయింది. బెంగళూరులో ఉద్యోగానికి రెండున్నర సంవత్సరాల క్రితమే రాజీనామా చేశాను. సామాజిక కార్యకర్తగా మా హిజ్రాలకు చేయాల్సింది ఎంతో ఉంది. ప్రజలందిరిలోను మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అని చెప్పారు రేవతి.

గొల్లపల్లి ప్రభాకర్‌రావ్‌, చెన్నై

(ఆంధ్ర జ్యోతి 1 నవంబర్ 2014 శనివారం 'నవ్య పేజీ ' సౌజన్యంతో) 

నిజం చెప్తున్నా-
ఒక హిజ్రా ఆత్మకథ


- ఎ. రేవతి
ఆంగ్ల మూలం :The Truth About Me: A Hijra Life Story by A. Revathi, Penguin Books India, 2010

తెలుగు : పి. సత్యవతి
పేజీలు: 154, ధర : రూ.130/-



ప్రతులకు వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ నెం. 040-2352 1849

ఇమెయిల్‌ :  hyderabadbooktrust@gmail.com







 



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌