Sunday, October 21, 2012

మల్లు స్వరాజ్యం గారి ఉపన్యాసం ... కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి " పుస్తక అవిహ్కరణ సభలో ...

మల్లు స్వరాజ్యం గారు 
1946 నాటి నిజాం ప్రభుత్వానికి, జమిందార్లకు, రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన  
తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. 

ఆమె తలపై ప్రభుత్వం ఆనాడే పదివేల రూపాయల బహుమతిని ప్రకటించింది. 
ఏడు దశాబ్దాలుగా  కమ్యూనిస్ట్ రాజకీయాలతో పెనవేసుకుపోయిన జీవితం అమెది.

ఇటీవల  సెప్టెంబర్ 23 న మల్లు స్వరాజ్యం గారు హైదరాబాద్ లో 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మ కథ "నిర్జన వారధి" పుస్తకాన్ని ఆవిష్కరించిన విషయం విదితమే

కమ్యూనిస్టు ఉద్యమం , స్త్రీల పాత్ర, చీలికలు పేలికలైన కమ్యూనిస్టు పార్టీల  ప్రస్తుత దయనీయ పరిస్థితి
మొదలైన అంశాలపై ఆరోజు  ఆమె ఎంతో ఆవేదనతో మాట్లాడారు.  

సంచలనాత్మకమైన ఆ  ఉపన్యాసం వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ లో అందుబాటులో వుంది. 

.... ఇక్కడ ......   చూడండి.



.



Monday, October 15, 2012

వివేకానికో గీటురాయి... రీడింగ్ రూమ్ ...- మందలపర్తి కిషోర్...సాక్షి ...

వివేకానికో గీటురాయి

 బాలగోపాల్ చనిపోయి మూడేళ్ల యింది. ఈ మూడేళ్లలో ఆయన రచనలు - తెలుగులో - ఎనిమిది పుస్తకాలుగా వచ్చాయి. వాటిలో కొన్ని పత్రికలకు రాసిన వ్యాసాలు. కొన్ని కాలమ్స్. కొన్ని ముందుమాటలు. కొన్ని ఉపన్యాసాలు. కొన్ని కరపత్రాలు. కొన్ని సిద్ధాంత పత్రా లు. కొన్ని నివాళులు. కొన్ని జవాబులు. కొన్ని సంపాదకీయాలు. కొన్ని ఇంట ర్వ్యూలు. ఇన్ని ‘రచనా రూపాలు’ ప్రయత్నించిన రచయితలు బాలగోపాల్ సమకాలికుల్లో మరెవరూ లేరేమో! మత తత్వం, రాజ్యం-సంక్షేమం, హక్కుల ఉద్యమం, దళిత సమస్య, సాహిత్య పరామర్శ, మార్క్సిజం సమీక్ష-ఇలాంటి వస్తువులతో రాసినవీ రచనలు. అంటే, రూపంలోనూ సారంలోనూ కూడా బాలగోపాల్ రచనల్లో ఎంతో విస్తృతీ వైవిధ్యం కనిపిస్తుంది.

ఇవి దాదాపు మూడు దశాబ్దాల కాలంలో బాలగోపాల్ చేసిన రచనలు. ఈ కాలంలో ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పులన్నీ ఈ రచనల్లో ప్రతిఫలించాయి. ఈ మార్పుల్లో ైవైరుధ్యంలా అనిపించే వైవిధ్యం కనిపిస్తుంది. ఏకసూత్రతా ఉంది. మొదటినుంచీ ఆయన పనిచేసిన రంగం హక్కుల రంగం. మన దేశంలో ఈ రంగంలో ప్రధానంగా కేంద్రీకరించి పనిచేసినవాళ్లలో ఎక్కువమంది నక్సలైట్ ఉద్యమాన్ని అభిమానించే మేధావులు. ఎప్పుడో 1970 దశకంలోనే బొజ్జా తార కం, ప్రత్తిపాటి వెంకటేశ్వర్లు, కన్నబీరన్ తదితరులు ఈ కృషి మొదలుపెట్టారు. ఎనభయ్ దశకంలో బాలగోపాల్ ఈ రంగంలో మొదలుపెట్టిన కృషి కొత్తపుంతలు తొక్కింది.

చట్టాల ప్రకారం హక్కులను నిర్వచించి విశ్లేషించడం కాకుండా సామా జిక న్యాయం(ఇప్పటి వాడుక అర్థంలో కాదు-దాని అసలు అర్థంలో) ప్రాతిపది కగా బాలగోపాల్ హక్కుల గురించి మాట్లాడారు. దీన్నే తర్వాతి రోజుల్లో హక్కుల ఉద్యమానికి ఉండాల్సిన ‘తాత్విక దృక్పథం’గా ఆయన చెప్తుండేవారు. వ్యక్తిగతం గా-ఒంటరిగా మాత్రం కాదు- బాలగోపాల్ తీసుకొచ్చిన పెద్దమార్పు ఇదేనేమో!

ఇక, సాహిత్యరంగంలో కూడా బాలగోపాల్ చాలానే కృషి చేశారు. ‘సాహి త్యంమీద నేను రాసిన వ్యాసాలు సమగ్రమయిన సాహిత్య విమర్శ అని నేను అనుకోవడం లే’దన్నారు బాలగోపాల్. అంతేకాదు-ఆ వ్యాసాల్లో ఉన్నది ‘సామా జిక ఆర్థిక నేపథ్యంలో సాహిత్యాన్ని పరిశీలించడం’ మాత్రమేనని వివరించి, అదే సమగ్రమయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శ కాబోదని కూడా స్పష్టం చేశారు. ఇలా చెప్పడంవల్ల బాలగోపాల్ తన పరిమితులను వెల్లడించడమే కాదు- మార్క్సిస్టు ముద్రాంకిత విమర్శకుల పరిమితులను సైతం బయటపెట్టారు.

కిందటివారం, బాలగోపాల్ వ్యాసాలు కొన్నింటిని ‘మనిషి మార్క్సిజం’ పేరుతో పుస్తకంగా విడుదల చేసింది పర్‌స్పెక్టివ్స్ సంస్థ. ఇందులో, 1993 సెప్టెంబర్ ‘అరుణతార’లో వచ్చిన ‘చరిత్ర, మనిషి, మార్క్సిజం’ అనే వ్యాసం ఉంది. దీన్ని చాలామంది చరిత్రాత్మక వ్యాసంగా పరిగణిస్తారు. కానీ, ఆ వ్యాసంలో బాలగోపాల్ కనిపెట్టి చెప్పిన విషయాలేం లేవు. తను కొత్తగా ఆ విషయాలు చెప్పడమే అందులోని కొత్తదనం. అలాగే, ‘కల్లోల చిత్రాలు’ వ్యాసం లోని విషయాలు కూడా. ఈ వ్యాసాల్లోని విషయాలు -బహుశా బాలగోపాల్ చెప్పిన కారణంగా- అపారమయిన ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
చివరిగా ఓ మాట- మతానికి వ్యతిరేకంగా వచ్చిన చాలా సిద్ధాంతాలు కొత్త మతాలుగా స్థిరపడడం చరిత్రలో చూస్తాం. ఉదాహరణకు బౌద్ధం.

ఇది, సంప్రదాయ విరుద్ధత (నాన్‌కన్‌ఫామిజం), సంప్రదాయ విధేయత (కన్‌ఫా మిజం)గా మారడం మాత్రమే. మార్క్సిజం శాస్త్రమని, దాన్ని విశ్వసించేవాళ్లు చెప్తారు. ఏ శాస్త్రమయినా ప్రశ్నల పునాదిమీద పెరిగిపెద్దవుతుంది. స్వయంగా మార్క్సే అన్నిటినీ ప్రశ్నించమని చెప్పాడట. కానీ, మార్క్సిస్టు ప్రతిపాదనల విషయంలో ఆత్మవిమర్శకు ప్రయత్నించేవారిని మార్క్సిస్టు విశ్వాసులు ప్రశంసించరు. పెపైచ్చు అభిశంసిస్తారు కూడా. బాలగోపాల్ విషయంలో అదే జరిగింది. ఆయన చనిపోయి మూడేళ్లయింది. కానీ, కామన్‌సెన్స్ ప్రాతిపదికగా బాలగోపాల్ లేవనెత్తిన ప్రశ్నలను నక్సలైట్లూ, తదితర గోత్రికులయిన మార్క్సిస్టులు -అప్పట్లో- సరయిన స్పిరిట్‌లో తీసుకున్న దాఖలాలు కనిపించవు. ఇప్పటికయినా ఈ విషయంలో మార్పు వచ్చిందేమో పరిశీలించాలి. ఆ పరిశీలనకు బాలగోపాల్ రచనలు గీటురాళ్లుగా ఉపయోగపడతాయి.

- మందలపర్తి కిషోర్

( సాక్షి దినపత్రిక 15 10 2012 సౌజన్యం తో )





* 1. మనిషి-మార్క్సిజం, పే.168, వెల రూ.100/- దళిత / పే.209, వెల రూ.120/- 

2. రాజ్యం - సంక్షేమం / పే.161, వెల రూ.100/-

పర్‌స్పెక్టివ్, ఫ్లాట్ నం.305, ఇ.నం.2-2-647/182/ఎ3, హిమశివ అపార్ట్‌మెంట్స్ / బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్-13.


* 3. సాహిత్యంపై బాలగోపాల్ పే.339, వెల రూ.150/- /

4. మతతత్వంపై బాలగోపాల్ / పే.302, వెల రూ.150/-

 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్టాట్ నం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-67


* 5. నిగాహ్,  పే.407, వెల రూ.200/-

 ప్రజాతంత్ర కార్యాలయం, ఫ్లాట్ నం.1, ఇండస్ట్రియల్ పార్క్, ఐడీఏ, ఉప్పల్, హైదరాబాద్-39


* 6. హక్కుల ఉద్యమం - తాత్విక దృక్పథం / రూ.100/-  / నవోదయ, దిశ.


* 7. ఆ శిక్షే ఒక నేరం /  పే.88, వెల రూ.30/- ప్రజాశక్తి, నవోదయ.


.
  




.

Wednesday, October 10, 2012

అంతరంగం బ్లాగులో "నిర్జన వారధి" పై చరసాల గారి సమీక్ష ...


అయింష్టంగానైనా కొండపల్లి కోటేశ్వరమ్మని కొండపల్లి సీతారామయ్య భార్యగా పరిచయం చేయాల్సి వస్తోంది. 
ఎందుకంటే నాలాంటి వారికి ఆమె తెలియదు. 
ఆమె స్వీయ కథ, నిర్జన వారధిని చదివే ఆసక్తి కలగడానికి ఆమె సీతారామయ్య భార్య కావడమే కారణం. 
కానీ చదవడం మొదలెట్టాకా చివరికంటా చదవడానికి కారణం మాత్రం కోటేశ్వరమ్మే కాదు కాదు కోటేశ్వరవ్వే! 
ఆమె నడుస్తున్న చరిత్ర. తనకు తాను దీపపు వత్తియై, తన్ను తాను వెలిగించు కొని, నమ్మిన సిద్దాంతం కొరకు జీవితాన్ని, పిల్లలనీ, తల్లినీ, తననూ, తన ఆస్తినీ సర్వస్వాన్నీ ధారపోసి, ధారపోసే వారుంటారా అన్న సందేహానికి కోటేశ్వరవ్వ ఒక నిలువెత్తు సాక్ష్యం.
ఆమె ఆమెగానే సర్వ స్వతంత్రంగా బ్రతికిన కోటేశ్వరవ్వని ఇంకొకరి భార్యగా పరిచయం చేయాల్సి రావడం దురదృష్టమనే వుద్దేశ్యంతో నేను అయిష్టమన్నాను. 
నిజానికి కమ్యూనిస్టు వుద్యమానికి పరిచయం చెయ్యడమే సీతారామయ్య ఈ అమ్మకు చేసిన ఉపకారం(?). 
కమ్యూనిస్టు వుద్యమంలో దిగిన రోజునుండి ఈమె తన సర్వస్వాన్నీ పార్టీకి, వుద్యమానికే అర్పించింది.
ఈ కథ రాసిన తీరు, అవ్వ మన పక్కన కూర్చుని తన కథ చెబుతున్నట్లే వుంటుంది. 
చివరి వరకూ ఎక్కడా ఆత్మస్తుతీ, పరనిందా కనిపించవు. 
అలా అని తనతో వుద్యమంలో కలిసి నడిచిన వారి త్యాగాలని ఎక్కడా మెచ్చకుండా వుండదు. అప్పట్లో ఇంత మంచివారు వుండేవారా అని ఆశ్చర్యమనిపిస్తుంది.
.....
పూర్తి సమీక్ష అంతరంగం బ్లాగు లో చదవండి ...

Friday, October 5, 2012

కథలగూడు... దేవులపల్లి కృష్ఞమూర్తి ...




ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే

తెలంగాణా సాయుధ పోరాట జ్ఞాపకాలు మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయాల నుండి మెల్లగా తప్పుకుంటున్నాయి.
ప్రత్యేక ఉద్యమం, అస్తిత్వ ఉద్యమాలూ తెచ్చిన తక్షణ ఎజెండాలు కూడా కారణం కావచ్చు.
ఇదంతా తాత్కాలికమే ననిపిస్తుంది.

ఇవి వట్టి జ్ఞాపకాలు కావు. వయసు మళ్లిన వాళ్లు ''మా రోజుల్లో'' అంటూ నెమరేసుకునే సంగతులు మాత్రమే కాదు, ఆ పోరాటం ఈ నేల రంగూ రుచీ వాసనని పట్టిచ్చింది. ఈ జనం స్వభావాన్నీ, టెంపర్‌నీ చూపించింది.

చే గువేరా ఏనాడో అరవయ్యో దశకంలో చనిపోతే అదంతా నిన్నో మొన్నో అయినట్టు ఎందుకు తలుచుకుంటుందీ ప్రపంచం. మన స్వతంత్ర పోరాటం గురించీ అంతకు ముందెప్పుడో వందల ఏళ్ల క్రితం వచ్చిన పోర్చుగీసు పాలనా, గోవా ప్రతిఘటన గురించి ఈ రోజుకీ చెప్పుకుంటున్నాం రాస్తున్నాం. సినిమాలు కూడా తీస్తున్నాం. చూస్తున్నాం.

తెలంగాణా సాయుధ పోరాటమూ అంతే.
అది సజీవం.
దాన్ని మన కథలూ నవలలూ, సాహిత్యం మరింత నిత్యనూతనంగా ఉంచుతాయి.
ఉంచుతున్నాయి కూడా.

ఈ అరవైయ్యేళ్లుగా పోరాట సాహిత్యం చాలా వచ్చింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముఖ్దుం మొహియుద్దీన్‌, రాజ్‌బహదూర్‌ గౌర్‌ లాంటి యోధుల జ్ఞాపకాలు పుస్తకాలుగా వచ్చాయి. ఇందులో చాలా వాటికి అట్టమీది బొమ్మలు గీసింది నేనే.

సుద్దాల హన్మంతు, యాదగిరి పాటలు,
దాశరథి, తెన్నేటి సూరి, సోమసుందర్‌ కవితలు ఒక వరస.
కిషన్‌ చందర్‌, వట్టికోట ఆళ్వారుస్వామి, బొల్లిముంత శివరామకృష్ణ నవలలు మరో వరస.

చిత్త ప్రసాద్‌ బొమ్మలూ, సునీల్‌ జెనా ఫొటోలూ చరిత్రని రికార్డు చేశాయి.
'మా భూమి' లాంటి సినిమాలూ అదే చేశాయి.
ఈ పరంపర ఇంతటితోనే ఆగిపోలేదు.

ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమై క్లైమాక్స్‌కు చేరినప్పుడు కూడా హైదరాబాద్‌లో, ఇతర పట్నాల్లో జరిగిన అనేక సభల్లో సాయుధ పోరాట ప్రస్తావన పదే పదే వస్తూనే ఉంది.

దేవులపల్లి కృష్ణమూర్తి కథలకి ఓ విశేషం, ప్రత్యేకతా ఉన్నాయి.
అన్నీ పోరాటకాలం నాటివే.
అన్నీ అసాధారణమైన పోరాట పటిమ చూపిన అన్‌సంగ్‌ హీరో, హీరోయిన్స్‌వే.
పాత్రలన్నీ నిజంగా బతుకులో ఉన్నవే.
కృష్ణమూర్తికి తెలిసినవే.
త్యాగం, పోరాటం, విషాదం, విజయం లాంటివి చెప్పేటప్పుడు పాఠకుణ్ణి కన్నీరు పెట్టించాలనో, పిడికిళ్లు బిగించేట్టు చేయాలనో, మెలో డ్రామాలో ముంచెత్తాలనో రచయితకి అనిపిస్తుంది.

కృష్ణమూర్తి కథలు ఆ పనిచేయలేదు.
పైగా తెలిసిన మనుషులనీ, వాళ్లున్న సందర్భాల్నీ వరుసగా చెప్పుకు పోతాడు.
రియలిస్టిక్‌గా మేటర్‌ ఆఫ్‌ ఫాక్ట్‌గా వినిపిస్తున్నట్టే ఉంటుంది.
ఎక్కడా అతి ఉండదు.
అలాగని ఒక్క దగ్గరా విసుగనిపించదు.
అల్లికలో అందంతో అలనాటి ఊళ్లూ, మనుషులూ, ఘటనలూ కళ్లముందు రూపుకడతాయి.
ప్రతి కథా రియలిస్టిక్‌ పెయింటింగే.
కథలో, నవలలో, సినిమాలో ఒకనాడొచ్చిన ఇటాలియన్‌ నియోరియలిస్టిక్‌ పెయింటింగ్‌ ధోరణిలో కథనం సాగుతుంది.
....
- మోహన్‌
(చిన్నమాట నుంచి)


కథలగూడు
దేవులపల్లి కృష్ఞమూర్తి
ముఖచిత్రం : లక్ష్మణ్‌ ఏలె
122 పేజీలు, వెల: రూ. 60/-

ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006
ఫోన్‌ నెం. 040 23521849

ఇమెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com



.

కొండపల్లి కోటేశ్వరమ్మ " నిర్జన వారధి " పై జంపాల చౌదరి గారి సమీక్ష .. పుస్తకం డాట్ నెట్ లో ...


నిర్జనవారధి మనుషుల్లేని వంతెన. 
ఈ పుస్తకం గురించి మొదట విన్నప్పుడూ, పుస్తకం చదివాక కూడా, ఈ పేరు గుండెను తొలిచేస్తూ ఉంది. ఈ మాటను తలచుకున్నపుడల్లా ఏదో అస్పష్టమైన విచారం కమ్ముకొస్తుంది. ఒక విషాద దృశ్యం కళ్ళ ముందు పరచుకొంటుంది.
కానీ మనుషులు లేనంత మాత్రాన వంతెన కూలిపోదు. 
స్థిరంగా అలాగే నిలిచి ఉంటుంది తర్వాత రాబోయేవారిని అవతల దరి చేర్చటం కోసం. 
విషాదం వారధిది కాదు; వారధిని వాడుకోలేనివారిది.
మూడు తరాలకు వారధి అయినా ఒంటరిగా మిగిలిపోయిన కోటేశ్వరమ్మగారి స్వీయకథ చదువుతుంటే విషాదం పెళ్ళుకువచ్చేమాట నిజమే అయినా, ఆమె మీద కల్గేది జాలి, సానుభూతి మాత్రమే కాదు, ఆమె సాహసప్రవృత్తి, ఉద్యమ నిబద్ధత, ఆత్మాభిమానాల పట్ల ఆరాధనాభావం. కల్పిత కథ కాని ఒక వ్యక్తి నిజజీవితంలో ఇంత విషాదమూ, ఇంత ధైర్యమూ ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు.

..........  పూర్తి సమీక్ష పుస్తకం డాట్ నెట్ లో చదవండి 



హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌