Monday, September 3, 2012

అణువుపై ఒకింత అవగాహన...జీవశాస్త్ర విశేషాల సమాహారం ...


 అణువుపై ఒకింత అవగాహన

రచయితల ఊహల్లోని ఆలోచనలను అక్షరబద్ధం చేసేందుకు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకపోయినా శాస్త్ర సంబంధిత అంశాల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. ఈ పరిమితి మూలంగా రచనలోని భావధారకు తరచూ బ్రేక్‌పడే అవకాశముంది. కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన ‘అణువుల శక్తి’లో ఈ పరిమితిని చాలా వరకూ అధిగమించారనే చెప్పాలి. ఇటీవలి కాలంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రయోగం ప్రస్తావనతో పదార్థ లక్షణాలకు పరిచయం కల్పించడం... అక్కడి నుంచి క్రమేపీ గతంలోకి.. ఆ వెంటనే వర్తమానంలోకి తీసుకొస్తూ రచనను నడపడం హాయిగొలిపింది. పాఠ్యపుస్తకాల్లో కనిపించే గ్రాంధిక భాషను పక్కనబెట్టి వాడుక భాషలోనే అంశాలను వివరించేందుకు చేసిన ప్రయత్నం ఎన్నదగ్గది. అయితే వాడుకలో లేకపోవడం వల్లనో... స్థిరీకరించకపోవడం వల్లనో తెలియదు కానీ... రచయిత వాడిన కొన్ని పదాలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. కొత్త పదబంధాలను సృష్టించి ఉంటే శాస్త్ర సంబంధ దృగ్విషయా లకు తగిన తెలుగు అనువాదాలు లేకపోవడమన్న లోటును అధిగమించి ఉండవచ్చునన్న భావన కలుగుతుంది.

జీవశాస్త్ర విశేషాల సమాహారం
రచయిత కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ తన ముందుమాటలో చెప్పినట్లు సైన్స్ రచయితల బాధ్యతను గుర్తుచేసే సంకలనం ఇది. మార్కుల ప్రాతిపదికన చదువుకునే పాఠ్యపుస్తకాల మాదిరిగా కాకుండా సంక్లిష్టమైన అంశాలకూ సులభగ్రాహ్యంగా ఉందీ రచన. కాబట్టి విద్యార్థులు తరగతి గదుల్లోని చదువుకు మెరుగులు దిద్దేందుకూ ఉపయోగపడుతుంది. పరిణామ సిద్ధాంతాన్ని... మన ఆలోచనాసరళి, వచ్చే వ్యాధులకు ఉన్న జన్యుమూలాలను తెలిపేందుకు చేసిన ప్రయత్నమూ బాగుంది. సంకలనం మొత్తమ్మీద మూఢనమ్మకాలపై రచయితకు ఉన్న సహేతుక వ్యతిరేకత... వాటిని దనుమాడేందుకు చేసిన ప్రయత్నం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా

అణువుల శక్తి, 
పే 192, వెల రూ. 100/-,
జీవశాస్త్ర విజ్ఞానం: సమాజం,
పే 175, వెల రూ 100/- /
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్/

ప్రతులకు:
 హైదరాబాద్ బుక్‌ట్రస్ట్, ఫ్లాట్ నెం. 85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్-6.

( సాక్షి దినపత్రిక 3 సెప్టెంబర్ 2012 సౌజన్యం తో )


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌