Sunday, December 18, 2011

రూపం - సారం ... బాలగోపాల్‌ పుస్తకంపై 'నమస్తే తెలంగాణా' పత్రిక సమీక్ష


బాలగోపాల్‌ను ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యాతగా భావించేవాళ్లు ఆయన ఆలోచనల తాత్విక మూలాలు, ఆయన సాహిత్య పరిశీలనలో ఉన్నాయని గుర్తించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందంటూ ప్రచురణ కర్తలు పేర్కొన్నారు.

మనిషి జీవితంపై, సమాజ జీవితంపై ప్రతి మలుపులోనూ వెలుగులు ప్రసరించి అన్ని పార్శ్వాలనూ మనకు చూపించగల శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని నమ్మిన వ్యక్తి బాలగోపాల్‌.

అటువంటి వ్యక్తి ఎంతో నిజాయితీగా వేర్వేరు సందర్భాల్లో రాసిన సమీక్షలు, వ్యాసాలు, ఇచ్చిన ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, అట్లే రాసిన ముందుమాటలను ఈ పుస్తకంలో సంకలనం చేశారు. అంతేకాదు తన రూపం సారం పుస్తకానికి చేరా, కె.వి.ఆర్‌., త్రిపురనేని మధుసూధనరావులు రాసిన ముందుమాటల్ని, అదేవిధంగా బాలగోపాల్‌ రాసిన ఆంగ్ల వ్యాసాల్ని కూడా ఈ పుస్తకంలో అనుబంధాలుగా చేర్చారు.

కె. శ్రీనివాస్‌ ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ కె. బాలగోపాల్‌ విమర్శకుడిగా, సిద్ధాంతకర్తగా లభించడం తెలుగు సాహిత్యానికి చరిత్ర కల్పించిన ఒక అపురూపమైన అవకాశం అన్నాడు. అయితే, విప్లవ శిబిరమే కాదు, ఆ స్రవంతికి సమాంతరంగా వర్థిల్లిన గుర్తింపు ఉద్యమాలు సైతం బాలగోపాల్‌ నుంచి మద్దతు స్వీకరించి నంతగా , ఆయన ఆలోచనలను తీసుకోలేదు. ఫలితంగా ఆయన సాహిత్య వ్యక్తిత్వం ఒక తరం వారికి పెద్దగా పరిచయమే కాలేదు. ఆయన రచనలన్నింటినీ ఒక క్రమంగా అధ్యయనం చేసి, అర్థం చేసుకోవడానికి ఆయన నిష్క్రమణతో అవకాశం కలగడమే విషాదం అన్నారు . అది పూర్తిగా నిజం.

ఈ పుస్తకం సాహిత్యాన్ని బాలగోపాల్‌ తన కార్యరంగంగా ఎంచుకోదని, సాధికారంగా వ్యాఖ్యానించడానికి తగినంతగా తెలుగు సాహిత్యాన్ని చదవలేదని, తాను రాసిన వ్యాసాలు సమగ్రం కావని బాలగోపాలే అనేక సందర్భాల్లో అన్నప్పటికీ సాహిత్యానికి ఆయన వ్యక్తిగత, ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్నది. తాత్విక విశ్వాసంగా తాను అప్పటిదాకా భావిస్తూ వచ్చిన మార్క్సిజం పట్ల వున్న అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భమూ, తాను మొదలుపెట్టిని తాత్విక అన్వేషణ ఒక కొలిక్కి వచ్చిందని, తనకు సంతృప్పినిచ్చే ప్రాపంచిక దృక్పథం లభించిందని ప్రకటించిన సందర్భమూ సాహిత్య అవగాహన, వివేచన, మీమాంస అన్నీ కూడా ఈ వ్యాసాలనుంచి అందిపుచ్చుకోవడం ప్రజా జీవితంలో ఉన్న పాఠకులందరికీ అత్యంత అవసరం, అవశ్యం.

యండమూరి తులసీదళం నుంచి అలెక్స్‌ హేలీ రూట్స్‌ నవల దాకా మాభూమి నుంచి శంకరాభరణం దాకా, ఇంకా చెప్పాలంటే అటెన్‌బరో గాంధీ దాకా బాలగోపాల్‌ నిశిత పరిశీలనతో చేసిన సమీక్షలు, వ్యాసాలూ ప్రతీ అంశాన్ని సీరియస్‌గా లోతుగా తరచి చూడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. సామాన్య పాఠకులనూ లోతైన అధ్యయనానికి ప్రేరేపిస్తాయి.

- ( నమస్తే తెలంగాణా ఆదివారం బతుకమ్మ 11 డిసెంబర్ 2011 సౌజన్యంతో )

రూపం-సారం
సాహిత్యం పై బాలగోపాల్‌
339 పేజీలు, వెల: రూ.150

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067
ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌