Thursday, October 27, 2011

కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలకు వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారి సత్కారం

...

1961 నుంచీ ఇప్పటి వరకూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్న తెలుగు కవులూ, రచయితలూ, అనువాదకులను వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారు తమ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు.

హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభలో 23 అక్టోబర్‌ 2011 న డా.సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం విలక్షణరీతిలో జరిగింది. డా. సినారెతో పాటు డా. ఎన్‌. గోపి, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గొల్లపూడి మారుతీరావు, శ్రీజొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, శ్రీ వంగూరి చిట్టెన్‌ రాజు, శ్రీ వంశీ రామరాజు, డా. తెన్నేటి సుధాదేవి, శ్రీ ద్వానా శాస్త్రి ప్రభృతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ వంగూరి చిట్టెన్‌ రాజు రచించిన ''అమెరి 'కాకమ్మ' కథలు'' పుస్తకాన్ని సభలో ఆవిష్కరించారు.

తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి లభించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న తెలుగు భాష విశేష అధ్యయన పీఠాన్ని మైసూర్ లో కాకుండా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.


కేంద్ర సాహిత్య అ
కాడెమీ పురస్కార గ్రహీతలలో -
ఆచార్య చేకూరి రామారావు (చేరా),
డా. ఎన్‌.గోపి,
డా.కేతు విశ్వనాథరెడ్డి,
డా.భూపాల్‌ రెడ్డి (భూపాల్‌),
శ్రీ ప్రభాకర్‌ మందార
మొదలైన వారితో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టుకు ఆత్మీయమైన అనుబంధం వుంది.


2009 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాదక బహుమతి పొందిన ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టే ప్రచురించిందన్న విషయం విదితమే.

ఈ శుభ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
...

డాక్టర్. చేరా















డాక్టర్ కేతు విశ్వనాధ రెడ్డి

















డాక్టర్ ఎన్. గోపి
















శ్రీ ప్రభాకర్ మందార















డాక్టర్ ఎం . భూపాల్ రెడ్డి (భూపాల్)



















ముఖ్య అతిధి, సత్కర గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి



















సత్కార గ్రహీతలు:
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ... సంవత్సరం ... గ్రంథం పేరు... వరుసక్రమంలో
1. కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంతారావు... 1961 ... ఆంధ్రవాగ్గేయకార చరిత్రము
2. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డా.సి.నారాయణరెడ్డి ... 1973 ... మంటలూ మానవుడూ (వచన కవితా సంపుటి)
3. కళాప్రపూర్ణ రావూరి భరద్వాజ ... 1983 ... జీవన సమరం (స్కెచ్‌)
4. డా.కె. శివారెడ్డి ...................... 1990 ... మోహనా ఓ మోహనా (కవితా సంపుటి)
5. శ్రీమతి మాలతీ చందూర్‌ .......... 1992 ... హృదయనేత్రి (నవల)
6. డా.యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ....... 1992 ... తమస్‌ (హిందీ నుండి తెలుగు అనువాదం)
7. డా.పి.ఆదేశ్వరరావు .............. 1994 ... అమృతం-విషం (హిందీ నుండి తెలుగు అనువాదం)
8. శ్రీ కాళీపట్నం రామారావు ....... 1995 ... యజ్ఞంతో తొమ్మిది (కథలు)
9. పద్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ... 1996 ... కావ్య ప్రకాశం (సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం)
10. డా.కేతు విశ్వనాథరెడ్డి ....................... 1996 ... కేతు విశ్వనాథరెడ్డి కథలు
11. డా.ఐ.పాండురంగారావు .................... 1998 ... అనువాద సాహిత్యం
12. డా.ఎన్‌. గోపి ................................... 2000 ... కాలాన్ని నిద్రపోనివ్వను (కవితా సంపుటి)
13. డా.ఆర్‌.అనంత పద్మనాభ రావు ... 2000 ... ఛాయా రేఖలు (ఆంగ్లం నుండజీటి తెలుగు అనువాదం)
14. ఆచార్య రవ్వా శ్రీహరి ................. 2001 ... ప్రపంచపది (డా.సినారె ప్రపంచపదులు సంస్కృతంలోకి అనువాదం)
15. శ్రీ పింగళి సూర్య సుందరం .......... 2001 ... ఆత్మ సాక్షాత్కారం (రమణ మహర్షి జీవిత చరిత్ర, బోధనలు - ఆంగ్లం నుండి తెలుగు అనువాదం)
16. ఆచార్య చేకూరి రామారావు ........ 2002 ... స్మృతికిణాంకం (విమర్శ)
17. శ్రీ దీవి సుబ్బారావు .................. 2002 ... మాటన్నది జ్యోతిర్లింగం (కన్నడం నుండి తెలుగు అనువాదం)
18. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ...... 2003 ... దేవీ భాగవతం (సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం)
19. డా.డి.నవీన్‌ (అంపశయ్య నవీన్‌) ... 2004 ... కాలరేఖలు (నవల)
20. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ ... 2004 ... పర్వ (కన్నడం నుండి తెలుగులోకి అనువాదం)
21. శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి .......... 2005 ... తన మార్గం (కథలు)
22. డా.జి.ఎస్‌.మోహన్‌ .................... 2005 ... మాస్తి (కన్నడం నుండి తెలుగు అనువాదం)
23. శ్రీ మునిపల్లె రాజు ...................... 2006 ... అస్తిత్వనదం ఆవలి తీరాన (కథలు)
24. శ్రీ చిట్టిప్రోలు కృష్ణమూర్తి ............... 2008 ... పురుషోత్తముడు (పద్యకావ్యము)
25. శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ............ 2008 ... ఒక విజేత ఆత్మకథ (అబ్దుల్‌ కలాం - ఆంగ్లం నుండి తెలుగు అనువాదం)
26. పద్మశ్రీ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ... 2009 ... ద్రౌపది (నవల)
27. శ్రీ ప్రభాకర్‌ మందార ................... 2009 ... ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర (ఆంగ్లం నుండి తెలుగు అనువాదం)
28. శ్రీ సయ్యద్‌ సలీం ....................... 2010 ... కాలుతున్న పూలతోట (నవల)
29. శ్రీ జిల్లేళ్ల బాలాజీ ...................... 2010 ... కళ్యాణి (తమిళం నుండి తెలుగు అనువాదం)
30. డా.ఎం.భూపాల్‌రెడ్డి (భూపాల్‌) ... 2011 ... ఉగ్గుపాలు (కథలు- బాలసాహిత్యం)

...

Tuesday, October 25, 2011

నేను భంగీని


... అవును నేను అంటరానివాన్ని.
నేను ఈ రోజు నా కథని వినిపించాలనుకుంటున్నాను.

నా కథ, నా భాష మీరు ఇంతకు ముందు వినివుండరు.

నా కథని ఎవరూ రాయలేదు.

నేను సమాజపు చిట్టచివరి అంచున వున్నవాణ్ని.
చెత్త కుండీని.

మురికిబట్టిన పనికిరాని చెత్తని ఇందులో విసిరివేస్తారు.
మూగవానిగా, కాళ్ల కింది గడపగా మార్చబడిన ఈ సమాజంలోని మనిషిని.
ప్రతి మనిషీ నాపై అడుగులేసి ఇంట్లోకి వెళ్తాడు. కానీ నాకు మాత్రం ఇంట్లోకి ప్రవేశం లేదు. ....
...
ఇదో అంటరానివాడి చరిత్ర
నేను అంటరానివాన్ని.
నేను పాకీవాన్ని.
నేను ఛండాలుడిని.
మ్లేచ్ఛుడిని అని అంటున్నాడు ఈ వ్యక్తి.

ఇతను ఎవరు?

చరిత్ర వున్నవాడు కానీ చరిత్రలో లేనివాడు.

అక్షరాలు తెలియనివాడు. జ్ఞానం లేనివాడు. అచ్చమైన మూలవాసి.

ఆయుధాలు పట్టినవాడు. పోరాటాలు చేసినవాడు. నెత్తురు
పారించినవాడు.
కిరీటాలు మార్చిన వాడు, తలకాయలు కత్తిరించినవాడు.
సామ్రాజ్యాలు స్థాపించినవాడు. పడిపోతున్న సింహాసనాలకి
ప్రాణాలు పోసినవాడు.
రాజ్యాన్ని నిలబెట్టడంలో,
రాజ్యాన్ని పడగొట్టడంలో ప్రధానమైన పనిముట్టు ఇతను.


''నీళ్లు జీవితాన్నిస్తాయి.

కానీ నాకు మాత్రం నీళ్లు బానిస సంకెళ్ళు.

ప్రకృతిలో నీరూ, గాలీ మీద అందరికీ సమాన హక్కులున్నాయంటారు...

కానీ హిందూ సమాజంలో నీళ్లపై హక్కు కూడా నాకు దక్కకుండా చేశారు''
అని అంటున్నాడు ఈ మనిషి.


అశుద్ధాన్ని , మురికిని, పెంటని వీధుల నుండి, గ్రామం నుండి వేరు చేస్తూ... అద్దంలా ఊరిని తయారుచేస్తూ, తాను అశుద్ధ మానవుడుగా
మారి అసహ్యంతో, రోగాలతో, అశుభ్రతతో దగ్గీ దగ్గీ ప్రాణాలు తీసుకుంటున్న అధోజగత్‌ సహూదరుల చరిత్ర ఇది.

అందుకే ఇది అంటరానివారి చరిత్ర.

ఇందులో భగవాన్‌ బుద్ధుడు వస్తాడు.

అనన్య సామాన్యమైన ఆయన బోధనలు వినిపిస్తాయి.
ఈ దేశానికి రాజ్యాంగం రాసిన దిక్సూచి బాబా సాహెబ్‌ డా. అంబేడ్కర్‌ వస్తాడు.
బోధించు, పోరాడు, సమీకరించు, విప్లవించు అనే ఆయన బోధనలు వినిపిస్తాయి.


అంటరానివాడు అంటరానివాడిగానే ఊరిబైట అ లాగే మగ్గాలి అనే దొంగ సాధువులు, మహాత్ములు కనిపిస్తారు.
వారి కపట నాటకాలు
ధర్మప్రభోదాలు వినిపిస్తాయి.
పురుషార్థాన్ని సాధించవచ్చు అంటూ వర్ణవ్యవస్థ జెండాకి జై కొడుతున్న సిగ్గుమాలిన దగుల్భాజీలు కనిపిస్తారు.

బుద్ధ భగవానుని ప్రవచనాల నుండి బాబాసాహెబ్‌ బోధనల వరకు అన్నింటిని వింటూ అక్షర జ్ఞానానికి దూరంగా బలహీనతలతో, అజ్ఞానంతో
బతుకుతున్న అంటరాని, పాకీ సోదరుల ఈ చరిత్రని మనం వీధివీధికి తీసుకెళ్లాలి.
అందుకోసం మనవంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి
అని చెప్తుంది ఈ పుస్తకం.
అందుకే దీన్ని అందరూ చదవాలి.
...

భగవాన్‌ దాస్‌ (1927-2010)

భారతదేశం తొలితరం దళిత చైతన్యానికి నిలువెత్తు ప్రతీక. కొంతకాలం అంబేద్కర్‌ వద్ద పరిశోధన సహాయకుడిగా పనిచేసిన ఆయన
జీవితాంతం అంబేద్కర్‌ ఆశయాల సాధనకోసమే పాటుపడ్డారు. భంగీ (పాకీ) వృత్తికులంలో జన్మించారు. బౌద్ధాన్ని స్వీకరించిన ఆయన శాంతి కోసం ప్రపంచ మతాల సమ్మేళనం (క్యోటో, 1970) ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1983లో అంటరానితనం, దాని అమానుషాల గురించి ఐక్య రాజ్య సమితి వేదిక మీద ప్రసంగించారు.
డా. జి.వి.రత్నాకర్‌
తెలుగులో మట్టిపలక, లట్లేటి అ లం కవిగా సుపరిచితుడు. హిందీ నుండి తెలుగులోకి 25 పుస్తకాలను అనువదించారు. సాక్షి మానవ హక్కుల నిఘా పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీ హిందీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ...

నేను భంగీని

రచన: భగవాన్‌ దాస్‌

తెలుగు: డా. జి.వి.రత్నాకర్‌

128 పేజీలు, వెల: రూ. 80/-


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-23521849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

..

Monday, October 24, 2011

రూపం-సారం ... సాహిత్యంపై బాలగోపాల్‌


...
కె.బాలగోపాల్‌ (1952-2009) మానవ హక్కుల వేదిక నాయకులు, ప్రముఖ న్యాయవాది, రచయిత, వ్యాసకర్త.

మనిషి జీవితంలో సాహిత్యానికి గల పాత్రను లోతైన తాత్విక దృక్పథంతో పరిశీలించి చేసిన విశ్లేషణలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

స్థిరపడిపోయిన ఎన్నో మౌలిక భావనలను, ధోరణులను ప్రశ్నిస్తూ విస్తారమైన అన్వేషణ సాగించారాయన. సాహిత్యంపై చెదురుమదురుగానే అయినా చిక్కగా రాసిన వ్యాసాలు, సమీక్షలు, ముందుమాటలు, ఇంటర్వ్యూల సంకలనమిది.

''దేనికయినా ఒక్క వాక్యంలో నిర్వచనం ఇవ్వడంలో సమస్యలున్నాయి గానీ సాహిత్యం పాత్రను ఒక్క వాక్యంలో నిర్వచించమంటే , జీవితంలోని ఖాళీలను పూర్తిచేయడం సాహిత్యం పాత్ర అని చెప్పవచ్చు.''

''మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడం. కొన్ని అభద్రత వల్ల చూడం. కొన్ని ఒక బలమైన భావజాలం ప్రభావం వల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపించవు. ఒక్కొక్కసారి మనకు అ లవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్లగానీ కొన్ని విషయాలు కళ్లముందే ఉండీ కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు కూడా ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి.''

''సాహిత్యాన్ని కేవలం ఉద్యమాల నేపథ్యంలో చర్చించడం పొరబాటు. ఉద్యమాలు మానవ జీవితంలో ఎప్పుడూ ఒక చిన్న భాగం మాత్రమే. సాహిత్యం పాత్ర దానికి పరిమితం కాదు. అది జీవితమంత విస్తృతమైనది.''

... ... ...

మా మాట

తెలుగు సాహిత్యానికి ఇది చాలా విలువైన పుస్తకమవుతుందని మా నమ్మకం.
ఆరేడు సాహిత్య వ్యాసాలతో పాతికేళ్ల క్రితం వచ్చిన ''రూపం-సారం'' తరువాత బాలగోపాల్‌ సాహిత్య వాస్యాసాలు ఇంతవరకూ సంకలనంగా వెలువడలేదు. బాలగోపాల్‌ను ప్రధానంగా రాజకీయ వ్యాఖ్యాతగా భావించేవాళ్లు ఆయన ఆలోచనల తాత్విక మూలాలు ఆయన సాహిత్య పరిశీలనలలో ఉన్నాయని గుర్తించడానికి ఈ పుస్తకం దోహదం చేస్తుంది.

మనిషి జీవితంపై, సమాజ జీవితంపై ప్రతీ మలుపులోనూ వెలుగులు ప్రసరించి అన్ని పార్శ్వాలనూ మనకు చూపించగల శక్తి సాహిత్యానికి మాత్రమే ఉందని నమ్మిన వ్యక్తి బాలగోపాల్‌. మనం మన సందిగ్ధాలను, సంశయాలను లోతుగా నిజాయితీగా పరిశీలించుకునేందుకు ఈ వ్యాసాలు తోడ్పడతాయి.

ఈ పుస్తకాన్ని సంకలనం చేయడం మేము అనుకున్నదానికన్నా చాలా పెద్దపనయింది. మొదటిసారి ఈ వ్యాసాలు అచ్చయిన పత్రికలు దొరకక, దొరికిన వాటిల్లో అనేక తప్పులు, పేరాలకు పేరాలు ఎగిరిపోవడం, అనువాద కష్టాలు వంటి ఇబ్బందులు ఎదురవడంతో గత అక్టోబర్‌కి తీసుకువద్దామనుకున్న పుస్తకాన్ని ఈ అక్టోబర్‌కి తీసుకురాగలిగాం.

ఇందులో అయిదు ఇంగ్లీషు వ్యాసాలను అనువదించిన మృణాళిని, వసంతలక్ష్మిలకు, వ్యాసాల సేకరణ, పరిష్కారంలో తోడ్పడిన మన్నం బ్రహ్మయ్య, ఆర్‌.కె., ఎన్‌. వేణుగోపాల్‌లకు, ముందుమాట రాసిచ్చిన కె. శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు.

రూపం-సారంకి చేరా, కెవిఆర్‌, త్రిపురనేని మధుసూదనరావులు రాసిన ముందుమాటల్ని, బాలగోపాల్‌ ఆంగ్ల వ్యావాసలను (అనువాద ఒరిజినల్స్‌) కూడా అనుంబంధాలుగా ఇందులో చేర్చాం.

- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
1 అక్టోబర్‌ 2011

రూపం-సారం
సాహిత్యం పై బాలగోపాల్‌

339 పేజీలు, వెల: రూ.150

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌-500 067

ఫోన్‌: 040-2352 1849

ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

మతాలపై వైజ్ఞానిక విశ్లేషణ


... మత విశ్వాస పరిణామాలను వైజ్ఞానికంగా విశ్లేషించిన వ్యాసాల కూర్పు ఇది. ప్రకృతి శక్తులకు తలొగ్గి దినదినగండంగా బతికిన ఆదిమానవులకు మత భావనలు మంచే చేశాయి. వారి మధ్య ఐకమత్యం పెంచి సామూహిక పద్ధతిలో ఆశావాద దృక్పథాన్ని కలిగించాయి. అయితే లాభనష్టాలను బేరీజు వేసినప్పుడు మత విశ్వాసాల ద్వారా సమకూరేఉపయూగాలేవీ ఇన్‌హేలర్ల స్థాయిని మించవని రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ విస్పష్టంగా చెబుతారీ పుస్తకంలో! అవి వ్యక్తిగత, సమాజ ఆరోగ్యానికి పట్టిన జలుబును ఎంత మాత్రం తగ్గించవనీ, పైగా 'సైడ్‌ ఎఫెక్ట్స్‌' ప్రమాదకరమైనవనీ వివరిస్తారు. ఈ క్రమంలో సాంస్కృతిక చరిత్రకున్న భిన్న పార్శ్వాలను స్థూలంగా ప్రస్తావిస్తారు రచయిత. ప్రాచీన నాగరికతలూ, దేశధేశాల్లోని విశ్వాసాలూ, అవశేషాల విశేషాల గురించి ఆకట్టుకునే చిత్రాల సాయంతో వివించారు. ఉద్వేగాలకు తావివ్వకుండా, సిద్ధాంతాల ప్రమేయం లేకుండా సాగిన ఈ వ్యాసాల శైలి సులభంగా, సూడిగా ఉండి ఆసక్తికరంగా చదివిస్తుంది.
- వేణు (ఈనాడు ఆదివారం 23 అక్టోబర్‌ 2011 సౌజన్యంతో)

మనుషులు చేసిన దేవుళ్లు

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌


పేజీలు: 196; వెల: రూ. 100/-
ప్రతులకు :
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌

ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,

గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500 ౦౬౭

...

Monday, October 3, 2011

' నేనే బలాన్ని ..... ' టి.ఎన్‌. సదాలక్ష్మి బతుకు కథ ... పుస్తక సమీక్షా సభ ... నీలి జెండా నివేదిక



'నేనే బలాన్ని - టి.ఎన్‌.సదాలక్ష్మి బతుకు కథ' పుస్తకం 60 ఏళ్ల సాంఘిక, రాజకీయ చరిత్రకు దర్పణం వంటిదనీ, నేటి నాయకులు తప్పక చదవవలసిన గ్రంథమనీ డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రొ.ఘంటా చక్రపాణి అన్నారు.

అన్వేషి, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా ప్రచురించిన ఈ పుస్తక సమీక్షా సదస్సు సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది.

సదాలక్ష్మి రాజీపడని మనస్తత్వం గల నాయకురాలనీ, ఈ గ్రంథంలో రచయిత్రి గోగు శ్రామల మొత్తం సమాజాన్ని కూడా విశ్లేషణ చేశారనీ అన్నారు. మురికివాడల నుంచి పైకి వచ్చిన నిప్పుకణిక సదాలక్ష్మి అని కొనియాడారు. 1969లో తెలంగాణ సమస్యపై జె. ఈశ్వరీబాయి, సదాలక్ష్మి ప్రభుత్వంపై విరుచుకుపడేవారని చక్రపాణి అన్నారు.

ఈ గ్రంథంపై విస్తృతంగా చర్చ జరగాలని ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర అన్నారు. వివిధ కోణాల నుంచి సదాలక్ష్మి జీవితాన్ని విశ్లేషణ చేయాలన్నారు.

సుశీతారు (ఇఫ్లూ యూనివర్సిటీ) మాట్లాడుతూ రాజకీయ నాయకుల జీవిత చరిత్రల్లో సదాలక్ష్మి వంటి అణగారిన వర్గాల నాయకుల చరిత్రలు చోటు చేసుకోలేకపోవడం, కుల వివక్షకు తార్కాణమన్నారు.

సదాలక్ష్మి కుమారుడు డా. వంశీ తిలక్‌ పుస్తకాన్ని సమీక్షిస్తూ ఆమెకు ఆమె భర్త టి.వి. నారాయణ ప్రథమ గురువు అనీ, ఆమె జీవితంలో అనేక నాటకీయ విజయగాథలు ఉన్నాయని చెప్పారు. కొన్ని విలువలకు కట్టబడిన నాయకురాలనీ, ధనాశకు పోలేదనీ అన్నారు.

తెలంగాణ మహిళా మేధావుల, రచయితల వేదికకు చెందిన డా. టి. దేవకీదేవి మాట్లాడుతూ సదాలక్ష్మి స్త్రీ కావడం వల్లా, అందులో దళిత స్త్రీ కావడం వల్లా, అందులోనూ అట్టడుగు కులంలో జన్మించినందువల్లా రావలసినంత రాణింపు రాలేదన్నారు.

ఉస్మానియా విద్యార్తి జెఎసికి చెందిన బాలలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణా సాహిత్యంలో ఈ పుస్తకం చెప్పుకోతగ్గదన్నారు.

సదాలక్ష్మి భర్త డా.టి.వి.నారాయణ గ్రంథాన్ని సమీక్షిస్తూ ఆమె జీవితం ఒడుదొడుకులతో గడిచిందన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దేవాదాయ శాఖల మంత్రిగా విశేష సేవలందించారని చెప్పారు. కాంగ్రెస్‌పై విసుగుచెంది జగ్జీవన్‌రాం పిలుపు మేరకు 'జనతా పార్టీ'లో చేరిందనీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షులయ్యారనీ చెప్పారు. ఆమె రాజకీయ జీవితంలోని ఎత్తుపల్లాలను డా. నారాయణ ఎత్తి చూపారు. ఎప్పుడూ ఆమె వెనుక ఒక పురుషుడు ఉన్నట్లు అనిపించేదికాదనీ, తనకు ఇంకెవరి బలం అక్కరలేని బలవంతురాలనీ ఆమెను కొనియాడారు. ఈ పుస్తకం స్ఫూర్తితో
తనుకూడా తన జీవిత చరిత్రను రాయడానికి పూనుకున్నట్లు చెప్పారు.

పుస్తక రచయిత్రి శ్రీమతి గోగు శ్యామల స్పందిస్తూ దళితులు ఎవరికి వారు తమ చరిత్రలు రాసుకోవాలనీ, అట్లా చేయకపోవడం వల్ల దళిత చరిత్రలో అనేక చారిత్రక అంశాలు చోటు చేసుకోలేదనీ చెప్పారు. తన కుటుంబాన్నీ, శాసన సభనీ ఒకే ధాటిన పెట్టిన ధీశాలిగా సదాలక్ష్మిని కొనియాడారు. ఈ పుస్తక రచనకు ఏడు సంవత్సరాలు పట్టిందన్నారు. పుస్తక రచనకు తోడ్పడిన వారందరికీ - ముఖ్యంగా లలిత (అన్వేషి), హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు చెందిన గీతా రామస్వామికి, సదాలక్ష్మి బంధువులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సభకు లలిత అధ్యక్షత వహించారు.

- నీలిజెండా హైదరాబాద్‌ ప్రతినిధి
నీలిజెండా, పక్షపత్రిక,( సెప్టెంబర్‌ 16-30, 2011) సౌజన్యంతో
సంపాదకులు: బొజ్జా తారకం; అసోసియేట్‌ సంపాదకులు: గనుమల జ్ఞానేశ్వర్‌
వెబ్‌సైట్‌ : www.neelizenda.com


...

Saturday, October 1, 2011

వీరనారి ఝల్‌కారీ బాయి



వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి


ఝాన్సీకి చెందిన ఝల్‌కారీ బాయి ఒక దళిత వీర వనిత. గత అనేక శతాబ్దాలుగా బుందేల్‌ఖండ్‌ (ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం)లో ప్రజలు ఆమె గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కానీ ఆమె పేరు ఇంతవరకూ చరిత్ర పుటల్లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయింది. ఆమె చరిత్రను దళిత రచయితలే అతి కష్టం మీద కాపాడుకుంటూ వస్తున్నారు. ఆమె జీవితాన్ని, ప్రత్యేకించి ఆమె మారువేషంలో ఈస్టిండియా కంపెనీ సైన్యంతో చేసిన పోరాటాన్ని బుందేల్‌ఖండ్‌లో జానపద గీతాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. ఆమె ధైర్య సాహసాలు, దళిత అస్తిత్వం ఉత్తర భారత దేశంలో దళితుల సాంస్కృతిక ఐక్యతకు దోహదం చేస్తూ గొప్ప స్ఫూర్తి నిస్తున్నాయి.

ఇవాళ ఇతర దళిత కులాలలో మాదిరిగానే కోరిస్‌ కులం వారు కూడా ఝల్కారీ బాయిని తమ కులదేవతగా కొలుస్తున్నారు. తమ స్వాభిమానాన్ని, తమ కుల ప్రతిష్టను పెంపొందించుకునేందుకు వారు ప్రతి సంవత్సరం ఝల్కారీ బాయి జయంతిని వేడుకగా జరుపుకుంటున్నారు. ఆమె కోరిస్‌ కులంలో పుట్టిన దళిత వీరాంగణ కావడం గర్వకారణంగా భావిస్తున్నారు. అందుకే ఆమె వీరోచిత పోరాటాన్ని గానం చేసేటప్పుడు వారు ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారని సుప్రసిద్ధ విద్యావేత్త బద్రీనారాయణ్‌ అంటారు.

వివిధ దళిత సంస్థలు ప్రతి యేటా ఝల్కారీ బాయి వర్థంతిని 'షహీద్‌ దివస్‌' (మృతవీరుల సంస్మరణ దినం) గా జరుపుతున్నాయి. గ్వాలియర్‌లో ఆమె పేరిట ఝల్కారీ బాయి బాలికల కళాశాల కూడా వుంది. 2001 జులైలో భారత ప్రభుత్వ తపాలా శాఖ ఆమె స్మారకార్థం నాలుగు రూపాయల పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. 2010లో నీలి జెండా పత్రికలో ఈ పుస్తకం సీరియల్‌గా వచ్చింది.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ గతంలో అయ్యంకాళీ, పండిత్‌ అయోతీదాస్‌, కొమురం భీం వంటి విస్మృత దళిత కథానాయకుల జీవిత చరిత్రలను ప్రచురించింది. ఆ పరంపరలో భాగంగా ఇప్పుడు ఈ ఝల్కారీ బాయి జీవిత గాధను సగర్వంగా సమర్పిస్తోంది.

వీరనారి ఝాన్సీ ఝల్‌కారీ బాయి
రచన: మోహన్‌ దాస్‌ నైమిశ్‌ రాయ్‌

తెలుగు: డా. జి.వి. రత్నాకర్‌

బొమ్మలు: పైడిరాజు
24 పేజీలు, వెల: రూ.30/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com

స్మశానం దున్నేరు - డా. కేశవరెడ్డి నవల ...



కొన్ని మంచి నవలలు - తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి.
మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు 'షాక్ట్రీట్మెంట్‌' యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి.
''స్మశానం దున్నేరు'' సరిగ్గా యిటువంటి నవలే!

...మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా?
చట్టాలు ఏం చేస్తున్నాయి?
ప్రభుత్వాధికారులు దుర్మార్గులను అణగ ద్రొక్కి సన్మార్గులకు న్యాయం కలిగిస్తున్నారా?
ప్రభుత్వాలు వున్నది ఎందుకు?
ప్రజలను రక్షించడానికా? భక్షించడానికా?


... ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు - నవల చదివిన తర్వాత మనల్ని కలచివేస్తాయి.

...దోపిడీ వర్గం అభివృద్ధికి కొమ్ముకాసే వెంకటాద్రి వంటి మధ్యతరగతి వ్యక్తులు యెలాంటి పరిణామాన్ని యెదుర్కోవలసి వస్తుందో, తమకు జరిగిన ఘోరాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు సంఘటిత శ్రామిక శక్తి ఏవిధంగా విజృంభిస్తుందో అద్భుతంగా చిత్రీకరించిన నవల యిది. శ్రమజీవులకు వాళ్ల హక్కులు, బాధ్యతలు గురించి 'ఎడ్యుకేట్‌' చేస్తూ, వారిని క్రమశిక్షణాయుతమైన విప్లవపథంవైపు నడిపించే - 'రాజకీయ నాయకత్వం' లేనప్పుడు - ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయో పరోక్షంగా నిరూపిస్తున్నది నవల. (ఆంధ్రజ్యోతి మాసపత్రిక, ఏప్రిల్‌1980 సమీక్ష నుంచి).

(విశాలాంధ్ర పత్రిక నిర్వహించిన పోటీలో (1980) ద్వితీయ బహుమతి పొందిన నవల ఇది)

డా.కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10 పుట్టారు. తిరుపతిలో పియుసి, పాండచ్చేరిలో ఎంబిబిఎస్చేశాక నిజామాబాద్జిల్లా డిచ్పల్లి విక్టోరియా మెమోరియల్ఆసుపత్రిలో స్కిన్స్పెషలిస్ట్గా కుష్ఠురోగులకు సేవలందించారు. ప్రస్తుతం నిజామాబాద్లో వుంటూ ఆర్మూర్లూ వైద్య సేవలు అందిస్తున్నారు. కుష్ఠువ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ మెడికల్జర్నల్స్లో ప్రచురితమయ్యాయి.

పాతిక సంవత్సరాలుగా పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యల పట్ల సానుతాపంతో రాయలసీప గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. బానిసలు, భగవానువాచ, అతడు అడవిని జయించాడు, రాముడుండాడు రాజ్జిముండాది, మూగవాని పిల్లలన గ్రోవి, చివరి గుడిసె, సిటీ బ్యూటిఫుల్‌, ఇన్క్రెడిబుల్గాడెస్‌, మునెమ్మ వీరి ఇతర రచనలు. అతడు అడవిని జయించాడు నవలను నేషనల్బుక్ట్రస్ట్వారు 14 నారతీయ భాషల్లోకి అనువదించారు. ఇన్క్రెడిబుల్గాడెస్నవల మరాఠీలోకి అనువాదమైంది.

తన రచనా స్పర్శతో బాధల గాయాలు స్పృశించి, హృదయాలను తేలికపరచడం, అనివార్యమైన జీవిత పోరాటానకి ఉపక్రమించపజేయటమే తన లక్ష్యమని వినమ్రంగా చెప్పే వీరిది వర్ణాంతర, మతాంతర వివాహం. కొడుకూ , కూతురూ సంతానం.


...

స్మశానం దున్నేరు
రచన : డా. కేశవరెడ్డి

ముఖచిత్రం: కాళ్ల
160 పేజీలు, వెల: రూ.80/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500067
ఫోన్‌ నెం. 040 2352 1849
ఇమెయిల్‌:hyderabadbooktrust@gmail.com

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌