Wednesday, March 23, 2011

చంద్రగిరి పై సాహస యాత్ర-1 ... కాత్యాయని ...

చంద్రగిరి పై సాహస యాత్ర-1 ...


ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రించిన రచయితల్లో బిభూతి భూషణ్‌ మొదటివాడేమీ కాదు. కానీ, ఆయన రచనల్లోని ప్రకృతి చిత్రణకు ప్రత్యేకమైన స్వభావమున్నది. ఆయన దృష్టిలో ప్రకృతి సౌందర్యమంటే మానవులకు తీరిక సమయాల్లో ఆహ్లాదాన్నిచ్చే వినోద సాధనం కాదు - ఒక జీవితావసరం. మానవ స్వభావంలోని సహజాతాలకూ, బాహ్య ప్రకృతికీ అవినాభావ సంబంధాన్ని ఆరోపిస్తాడాయన, ప్రాచీన సంస్కృత కవుల్లాగా. సాధారణమైన ప్రకృతి ప్రేమికుల్లాగా ప్రకృతిలోని కొన్ని పార్శ్వాలను మాత్రమే ప్రేమించే దృష్టి కాదాయనది. వసంతశోభను ఎంత ఆహ్లాదంగా వర్ణిస్తాడో- నిప్పులు కురిసే గ్రీష్మ సౌందర్యానికీ అంతే అబ్బురపడతాడు. వెన్నెల వానలో తడిసి ఎంత పరవశించిపోతాడో చీకటి రాత్రుల నిగూఢ లోకాల్లోకీ అంతే ఆసక్తితో అడుగుపెడతాడు. ప్రకృతిపై ప్రేమ ఆయన్నొక తీరని దాహంలా, మోహంలా ఆవిరించుకుని ఆయన అక్షరాలకు అపూర్వమైన అందాన్ని అద్దింది. బిభూతి భూషణుడి ''వనవాసి''తో ముగ్ధులైన తెలుగు పాఠకులకు ఇదంతా అనుభవమే. ఆ నవల ఇచ్చిన అనుభూతిలోకి మరింత లోతుగా ప్రయోగించాలంటే ఆయనే రాసిన ''మూన్‌ మౌంటెన్‌'' (బెంగాలీలో ''చందేర్‌ పహార్‌''/తెలుగులో ''చంద్రగిరి శిఖరం'') ను చదివి తీరాల్సిందే.

''అరణ్యక'' (తెలుగులో ''వనవాసి''), ''చందేర్‌ పహార్‌'' (తెలుగులో ''చంద్రగిరి శిఖరం'')  లను దాదాపుగా ఒకే కాలంలో అంటే 1930ల చివర్లో రాశాడు భిభూతి భూషణ్‌, రెండింటిలోనూ ప్రధానాంశం ప్రకృతి చిత్రణే అయినప్పటికీ కథావస్తువులు పూర్తిగా భిన్నమైనవి. భారతదేశంలోని అరణ్య ప్రాంతాల ప్రకృతినీ, అక్కడి ప్రజల జీవితాలనూ, ప్రకృతికి దూరమవుతున్న మానవుల భౌతిక ఆత్మిక జీవితాల్లోని క్షీణతనూ విస్తృతమైన కేన్వాస్‌పై చిత్రించిన రచన ''వనవాసి''. దీనితో పోల్చినప్పుడు ''చందేర్‌ పహార్‌ (చంద్రగిరి శిఖరం)'' లోని జీవిత చిత్రణ పరిథి తక్కువనే చెప్పాలి. ఈ నవల టీనేజ్‌ పాఠకులను ఉద్దేంశించి రాసినది కావటమే అందుకు కారణం అయ్యుండొచ్చు. బెంగాలీలో ఇటువంటి రచనలు ''కుమార్‌-సాహిత్య'' అనే విభాగం కిందికి వస్తాయట. శంకర్‌ అనే బెంగాలీ యువకుడు ఆఫ్రికాలోని అరణ్యాల్లో, ఎడారుల్లో చేసే సాహసయాత్ర ఇందులోని కథంశం. ఐతే గాఢమైన తాత్విక దృక్పథంగల రచయిత ఎంత చిన్న జీవిత శకలాన్నయినా ఒక గొప్ప సత్యాన్ని నిరూపించటానికి సాధనంగా ఉపయోగించుకోగలడు. అందుకే కేవలం పద్దెనిమిది నెలల జీవితానుభవాలతో పదేళ్ల పరిణితిని పొందగలిగానంటాడు శంకర్‌ నవల చివరిలో.

''పథేర్‌ పాంచాలి''లోని అపూ, ''వనవాసి''లోని సత్యచరణ్‌ వంటి తన ప్రాత్రలన్నింటిలోనూ అంతులేని జీవన తృష్ణను నింపాడు. బిభూతి భూషణ్‌. అది వాళ్లను ఒకచోట నిలవనివ్వదు. ముగింపులేని దారుల్లో ప్రయాణమంటే వాళ్లకు ఆకర్షణ. చంద్రగిరి శిఖరంలోని శంకర్‌ కూడా అ లాంటివాడే. ఎఫ్‌.ఎ పరీక్షలు రాసి గ్రామానికొచ్చిన ఆ యువకుడికి ఉత్తేజకరమైన జీవితం గడపాలని ఎన్నో కలలు. క్రీడలన్నా, సాహస గాథలన్నా ప్రాణమిచ్చే శంకర్‌ను ఇంటి ఆర్థిక పరిస్థితులు నిస్సారమైన గుమాస్తా ఉద్యోగంలోకి నెట్టాయి. అందులో ఇమడలేక దిగాలు పడిన అతనికి, ఒక పరిచయస్తుడి ద్వారా ఆఫ్రికాలోని ఓ రైల్వే కంపెనీలో ఉద్యోగం దొరకటంతో పొంగిపోయాడు. ఆఫ్రికాలోని మూన్‌ మౌంటెన్‌ (చందేర్‌ పహార్‌/చంద్రిగిరి శిఖరం) అనే పర్వతాన్ని గురించీ, దాన్ని అధిరోహించిన ఒక జర్మన్‌ పరిశోధకుడి సాహసం గురించీ పుస్తకాల్లో చదివిన శంకర్‌కు ఆఫ్రికాపై ప్రత్యేకమైన ఆకర్షణ.

గుంపులుగా తిరిగే సింహాలతో, నిశ్శబ్దంగా మృత్యుపాశాలు విసిరే పచ్చికబయళ్లతో నిండిన ఆఫ్రికన్‌ అరణ్యాల్లోకి శంకర్‌తోబాటు మనల్నీ నడిపిస్తాడు రచయిత. సమ్మోహనకరమైన ప్రకృతి సౌందర్యానికీ, అడుగడుగునా వెంటాడే మృత్యు భయానికీ మధ్యన శంకర్‌లో చెలరేగే భావోద్వేగాలను అద్భుతంగా వర్ణిస్తాడు భిభూతి భూషణ్‌. ''ఈ ఆఫ్రికా ఒక భయద సౌందర్య సీమ'' అనుకుంటాడు శంకర్‌. ''వెన్నెల వానలో తడుస్తున్న పచ్చికబయళ్ల మార్మిక సౌందర్యాన్ని'' చూసి ముగ్ధుడౌతూ ఉండగానే, వాటిలోంచి నిశ్శబ్దంగా వచ్చిన సింహం  తన కళ్ల ముందునుండే తోటి ఉద్యోగిని నోటకరచుకుపోయిన దృశ్యాన్ని చూసి వణికిపోతాడు. ఐనా, ఈ అరణ్యాల్లో ''ఎన్ని పేరు తెలియని మానవ జాతులూ, ప్రకృతి సోయగాలూ, ఎవరూ చూడని ప్రాణులూ, ఎవరూ వినని పక్షుల కలకూజితాలూ దాగి వున్నాయో'' అనే ఆసక్తి అతన్ని ముందుకే నడిపించింది.


(ఇంకా వుంది)
(  "చినుకు " మాస పత్రిక జూలై 2010 సౌజన్యం తో )

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌