Friday, January 21, 2011

వావిళ్ల 'రాధికా సాంత్వనము'నకు నూరేళ్లు - రామతీర్థ

వావిళ్ల 'రాధికా సాంత్వనము'నకు నూరేళ్లు - రామతీర్థ


18వ శతాబ్దికి చెందిన ముద్దుపళని అనే ముగ్ధ జీవించింది కేవలం 21 ఏళ్లే.
దేవదాసీల ఇంటిలో జన్మించిన ఆమె తన 20వ యేటనే ''రాధికా సాంత్వనము'' అనే శృంగార కావ్యాన్ని రాసింది.
ఆ కావ్యం 1887 నాటికే సంప్రదాయ పండితుల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కొంది.

కందుకూరి వీరేశలింగం పంతులు సైతం ఈ కావ్యాన్ని కటువైన పదజాలంతో ఖండించారు. కావ్య రచయిత్రిని 'ఇది', 'వేశ్యాంగన' అని సంబోధిస్తూ ఈసడించుకున్నారు.
''ఈ గ్రంథములోని భాగములనేకములు స్త్రీలు వినదగినవియు, స్త్రీ నోటి నుండి రాదగినవియు గాక దూష్యములయి యున్నవి. 'ఇది' జారత్వమే కులవృత్తిగా గల వేశ్యయగుటచేత స్త్రీ జన స్వాభావిక మయిన సిగ్గును విడిచి శృంగార రసమను పేర సంభోగాది వర్ణనలను పుస్తకము నిండ మిక్కిలి చేసినది'' అంటూ విమర్శించారాయన.

అనేక తాళ పత్ర గ్రంథాలను పరిష్కరించి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన సి.పి.బ్రౌన్‌ గారే ''రాధికా
సాంత్వనము''ను కూడా కాపాడి ముందు తరాలకు అందించారు.
బెంగుళూరు నాగరత్నమ్మ (1878-1952) రాధికా సాంత్వనమును తొలిసారి 1910
లో మద్రాసులోని వావిళ్ల వారి ద్వారా పుస్తకరూపంలో ప్రచురించారు. (ఈ యేడు ఆ పుస్తకానికి నూరేళ్ల పండుగ సందర్భం).

అయితే 1911లోనే ఈ పుస్తకం అశ్లీలత పేరిట ప్రభుత్వ నిషేధానికి గురైంది.
1947లో ప్రకాశం పంతులు మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ''జాతి నగలోంచి జారిపోయిన ముత్యాలను తిరిగి చేర్చగలిగాము'' అన్నారు.
నిషేధం ఎత్తివేయగానే వావిళ్ల వారే రాధికా సాంత్వనమును తిరిగి ముద్రించారు.

ఇలాంటి విశేషాలను ఎన్నింటినో రామతీర్థ గారు తమ ''వావిళ్ల 'రాధికా సాంత్వనము'నకు నూరేళ్లు అనే వ్యాసంలో రాశారు. 


ఆంధ్ర జ్యోతి 27 12-2010 సోమవారం 'వివిధ'లో ప్రచురించిన ఆ వ్యాసాన్ని ఈ కింది 

లింకు లో చూడవచ్చు.

http://www.andhrajyothy.com/i/2010/dec/27-12-10vividha.pdf

మరిన్ని వివరాలకు ''బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర''ను చదవండి.
 




.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌