Sunday, April 25, 2010

DILEMMAS IN AGRICULTURE – A Personal Story - By Gorrepati Narendra Nath








DILEMMAS IN AGRICULTURE – A Personal Story
- By Gorrepati Narendra Nath


Edited and Supllemented by Uma Shankari


The book discusses Narendranath's experiences in organic and chemical farming, the problems faced by farmers in water, electricity, markets, etc, and his efforts to mobilize farmers, especially on electricity. It discusses issues related to livestock, forest, healthy food and lifestyle, problems of agricultural workers who belong by and large to the Scheduled Castes and Naren's efforts to mobilize people against untouchability and pressure government to carry out land reforms. It describes the plight of artisans and service castes, and lastly, discusses the farming sector in the international context, talks about alternatives and naren's thought on creative, constructive action needed.

Published by
Vasudhaiva Kutumbkam Publication (P) Ltd,
XC - 7, Saha Vikas Apts,
Plot no 68, IP Extension,
Patparganj, Delhi- 110 092,

Price: Rs. 120


Copies are available at Hyderabad Book Trust also.

It is the English version of ITLU OKA RAITU (Telugu) published by Hyderabad Book Trust in the year 2008.

Saturday, April 24, 2010

టీవీ 9 లో ఏప్రిల్ 25 ఆదివారం ఉదయం 11.20 కి వనవాసి నవల పై సమీక్షా కార్యక్రమం!

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన
"వనవాసి" నవల పై
(రచన: బిభూతి భూషణ్ బంధోపాధ్యాయ , తెలుగు అనువాదం : సూరంపూడి సీతారాం)
ఏప్రిల్ 25 ఆదివారం ఉదయం (11 .00 - 11 .30 గంటల మధ్య )
టీవీ 9 లో పుస్తక సమీక్ష / చర్చా కార్యక్రమం వుంటుంది.
సమీక్షకులు సుజాత గారు.
చూచి వీలయితే మీ అభిప్రాయాలు తెలియజేయగోరుతున్నాం .

Friday, April 23, 2010

"మర్యాదస్తులకు రోత పుట్టించే జీవితాలే!" - కె. సుధ. రంగనాయకమ్మ గారి విమర్శ పై ప్రతి విమర్శ.

ఆంద్ర జ్యోతి 19 ఏప్రిల్ 2010 సోమవారం వివిధ లో "మర్యాదస్తులకు రోత పుట్టించే జీవితాలే!" అనే శీర్షికతో కే. సుధ గారు ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కధపై రంగనాయకమ్మ గారి (వ్యభిచారం కూడా ఒక వృత్తేనా?) విమర్శ పై ప్రతివిమర్శ చేసారు. ఆంద్ర జ్యోతి సౌజన్యం తో మా బ్లాగు వీక్ష కుల సౌలభ్యం కోసం దానిని ఇక్కడ పొందు పరుస్తున్నాము.



''మర్యాదస్తుల''కు రోత పుట్టించే జీవితాలే!
...................................................
నళిని తాను నీచమైన, రోత పుట్టించే జీవితం గడుపుతున్నందుకు విచారిస్తే రంగనాయకమ్మ సంతోషిస్తారా? ఇదేం పైశాచిక ఆనందం? ఫెమినిస్టులను తూర్పారపట్టడానికి రంగనాయకమ్మకు అనేకానేక అవకాశాలూ సందర్భాలూ ఉండగా వారిని తిట్టిపోయడానికి నళిని జీవితాన్ని ఒక వేదిక చేయాల్సిన అవసరం వుందా? నళినిని సెక్స్‌వర్కర్‌ అనకూడదు. వ్యభిచారాన్ని వృత్తి అనకూడదు. సరే, ఇది చాలామందికి ఇబ్బంది కలిగించే విషయమే.
................................................

సాంప్రదాయవాదులకు 'శీలం' ఎంత పవిత్రమైనదో మార్క్సిస్టులకు 'పని' అంత పవిత్రమైంది. వేశ్యలు చేసే రోత పుట్టించే పనికి సెక్స్‌ 'వర్క్‌' హోదా కల్పించడం నిజంగానే సబబు కాదనుకుందాం. మరైతే సెక్స్‌ వర్కర్‌ అనకుండా వారిని ఏమనాలి? వేశ్య, పతిత, సాని, లం..., గుడిశేటి, తిరుగుబోతు, గాలిది, ముండ... వీటిల్లో ఏది బాగుంది? రోత పుట్టించే జీవితం గడుపుతున్నారు కాబట్టి ఎంత రోత పుట్టించే మాట వాడితే అంత బావుంటుందంటారా? సంబోధించే పద్ధతిలోనే అమర్యాద వుంది. మర్యాదివ్వండని వాళ్లు అడుగుతుంటే కాసేపు మన ఇబ్బందులను పక్కన పెట్టలేమా?

వ్యభిచారంలో దోపిడికి గురవుతున్న స్త్రీలకు అందరిమీదా ఉన్నట్లే స్త్రీవాదుల మీదా అనేక విమర్శలున్నాయి. స్త్రీవాదులకు కూడా వేశ్యా సమస్యపై ఏకాభిప్రాయం లేదు. కొంతమంది స్త్రీవాదులు వ్యభిచారాన్ని నిర్మూలించాలంటే కొంతమంది నియంత్రిస్తే సరిపోతుందంటున్నారు. వ్యభిచారంలోకి తరలించడాన్ని (ట్రాఫికింగ్‌ని) నేరంగా పరిగణించాలి కాని వ్యభిచారాన్ని కాదనే వాళ్లున్నారు. ట్రిఫికింగ్‌నే కాదు వ్యభిచారాన్ని కూడా మానవ హక్కుల ఉల్లంఘనగా భావించాలనే వారున్నారు. కాదు ట్రాఫికింగ్‌ ఒక్కటే మానవ హక్కుల ఉల్లంఘన అనే వాళ్లున్నారు. ట్రాఫికింగ్‌ని నిర్మూలించి వేశ్యలకు సగటు పౌరులకు కల్పించే అన్ని స్వేచ్ఛలు వర్తింపజేయాలనే వాళ్లున్నారు. వేశ్యలను పోలీసులు, కోర్టు ఉచ్చులోనుంచి బైటపడేస్తే సరిపోతుంది, అంటే నేరం పరిధిలో నుండి తొలగించాలని అడుగుతున్న వారున్నారు. లైసెన్సులు ఇచ్చి తీరాలనే వాళ్లున్నారు. నువ్వు పునరావాసానికి ఒప్పుకుంటేనే సహాయపడతాం లేకపోతే నిర్బంధంలో వుంచైనా నిన్ను సంస్కరిస్తామనే వాళ్లున్నారు.

హైదరాబాద్‌లో మెహందీ ఎత్తేసినప్పుడు 'ప్రత్యామ్నాయ' పేరుతో తల్లీ బిడ్డలను దూరం చేసిన వెర్రి ప్రయత్నాలేమయ్యాయి? వేశ్యా సమస్యపై జరుగుతున్న ఈ చర్చ గురించి రంగనాయకమ్మ ప్రస్తావించలేదు. వాటి గురించి తెలిసిన దాఖలాలు కూడా ఈ వ్యాసంలో లేవు. ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నళిని జీవితం ఈ చర్చలో చిక్కుకు పోయి ఉంది. కాబట్టి నళినికి అవన్నీ తెలుసుకోక తప్పదు. పునరావాసానికి నళిని ఒప్పుకోలేదని రంగనాయకమ్మ కన్నెరజ్రేశారు. కాని ఆ పునరావాసాలు ఎలా వున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారా? వ్యాసం చదివితే అ లా అనిపించలేదు. నళిని కుటుంబ స్త్రీల జీవితాన్ని తూలనాడిందని ఆమె కోపం వ్యక్తం చేశారు. మరి కుటుంబ స్త్రీలు నళిని జీవితాన్ని తూలనాడవచ్చా? ఇరువురి జీవితాలూ లోపభూయిష్టమే అయినప్పుడు ఎవర్ని ఎవరు విమర్శించుకోవచ్చు? ''పేద స్త్రీ లందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అ లా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం ధనిక కుటుంబాల స్త్రీలలో వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే'' అన్నారు రంగనాయకమ్మ. ఈ సూత్రీకరణని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌.ఐ. ముందు పెట్టి చూడండి. అది సరైన సూత్రీకరణ అవునో కాదో తేల్చి చెప్పేస్తారు.

ఇప్పుడైనా, ఎప్పుడైనా సమాజానికి నళిని లాంటివారు నిత్యం గుర్తుండే వ్యక్తులు కారు. సమాజానికి అవసరమైనప్పుడే వాళ్లు గుర్తుకొస్తారు. ఇప్పుడైనా ఈ ''సెక్స్‌ వర్కర్స్‌'' గుర్తొచ్చింది ఎయిడ్స్‌ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికే. అందుకే నళిని లాంటివారు ఇప్పుడు సెక్స్‌ వర్కర్సే కాదు పియర్‌ (పీర్‌) ఎడ్యుకేటర్స్‌ కూడా అయ్యారు. ఎయిడ్స్‌ నివారణ పేరుతో ఇవాళ వాళ్ల ఆరోగ్యాల గురించి కొంత పట్టించుకుంటున్నారు. రేపు ఆ వ్యాధికి మందు కనిపెట్టగానే నళిని లాంటివారి ఊసెత్తేవారు కూడా వుండరు. ప్రజారోగ్యం దృష్టిలో వుంచుకుని ఎ.పి.సాక్స్‌, నాకో వంటి ప్రభుత్వ సంస్థలు సెక్స్‌ వర్కర్స్‌ సముదాయాలను ఏర్పాటు చేస్తున్నా ఒకసారి ఆ రోగానికి మందులేస్తారు. కనిపెట్టగానే ఈ రకమైన ప్రయత్నాలను గాల్లో వదిలేస్తారు.

19వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో ఉన్నత, మధ్యరతగతి స్త్రీలు గడప దాటి బైట ప్రపంచంలోకి అడుగుపెట్టాలంటే వేశ్యలు వారికి కంటగింపుగా కనిపించారు. ఈ స్త్రీట్‌ వాకర్స్‌ పక్కన నడవడం ఆ స్త్రీలకు రోత అనిపించింది. ''మర్యాదస్తులైన'' కుటుంబ స్త్రీలు బైట ప్రపంచంలోకి రావాలంటే ఈ స్ట్రీట్‌ వాకర్స్‌ని వీధుల్లోకి రానీయకూడదని జసఫీన్‌ బట్లర్‌ వంటి స్త్రీవాదులు వాదించి ఆమేరకు చట్టాలు రూపొందించారు. ఫలితంగా స్ట్రీట్‌ వాకర్స్‌ రోడ్లపై నుంచి మాయమయ్యారు. ఆ తర్వాత వాళ్లు తిండికి మాడారా? వాళ్ల పిల్లా జెల్లా ఏమయ్యారు? ఎవరికి పట్టింది? గాలి ముండలు, గాలి ముండల పిల్లలు... వాళ్ల గురించి పట్టించుకోవడమేమటిట అనుకుందామా? ఇంగ్లాండ్‌ వీధుల్లో స్ట్రీట్‌ వాకర్స్‌ని నడవనీయకుండా చేసినా, దేవదాసీ వ్యవస్థను రద్దు చేసినా, మెహందీ రూపు మాపినా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంది వేశ్యలను కాదు. ప్రజా ఆరోగ్యం, ప్రజా భద్రత, భ్రద్రలోక్‌ మహిళల సున్నిత భావాలు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రయోజనాలు మాత్రమే. వాటి కోసం చేశారే కాని వేశ్యలను ఉద్దరించడానికి కాదు. సౌజన్యారావు పంతుల్ని మధురవాణి ముద్దు అడిగే సన్నివేశంలో గురజాడ అప్పారావు వీరేశలింగం పంతులు గార్కి వేసిన చురకలు అర్థమైతే నళిని మీద రోత పుట్టాలో పుట్టకూడదో అర్థమవుతుంది.
- కె. సుధ
(ఆంధ్రజ్యోతి, 19 ఏప్రిల్‌ 2010)

Saturday, April 17, 2010

మహాదార్శనికుడు ఫూలే - సంపాదకులు: తాటికొండ రమేష్‌, ముందు మాట: అంపశయ్య నవీన్‌



మహా దార్శనికుడు ఫూలే

మహాత్మా జోతిరావు ఫూలే మానవీయ మహా దార్శనికుడు. ఆయన ఆలోచనలు దేశవ్యాప్తంగా బ్రాహ్మణేతర సామాజిక ఉద్యమాలకు తాత్విక భూమికను అందిస్తూ, దళిత, బహుజన ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేశాయి.
ఆయన తాత్విక చింతననూ, తరతరాలుగా అణచివేయబడిన వర్గాల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్యకోసం, మహిళల, కార్మిక, కర్షక, మానవహక్కుల కోసం ఆయన సాగించిన కృషిని సమకాలీన దృక్కోణం నుంచి పాఠకుల ముందుంచే విస్తృత వ్యాస సంకలనమిది.
... ... ... ... ... ...
ప్రపంచంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ భారతదేశంలో వేల సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఈ కుల వ్యవస్థ భారతీయ సమాజాన్ని అసమ సమాజంగా మార్చివేసింది.
నిచ్చెన మెట్లలాగా ఏర్పడిన భారతీయ సమాజంలో బ్రాహ్మణులూ, క్షత్రియులూ పై వరుసలోనూ, శూద్రులూ, అతి శూద్రులూ పంచనములూ కింది వరుసలోనూ చేర్చబడ్డారు. పైవరుసలో వున్న బ్రాహ్మణులూ, క్షత్రియులూ క్రింది వరుసలోకి నెట్టివేయబడ్డ శూద్రులనూ, పంచములనూ శాశ్వతంగా క్రింది వరుసలోనే ఉంచేందుకు ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలూ తీసుకున్నారు.
కులాలను సాక్షాత్తు భగవంతుడే సృష్టించాడనీ, ఏ కులంవాడు యే వృత్తిని చేపట్టాలో కూడా భగవంతుడే నిర్ణయించాడనీ, కుల వృత్తిని చేసుకుని బ్రతకడం, అగ్రవర్ణాల వారికి దాస్యం చేయడం ఆ కులంలో పుట్టిన వాడి ధర్మమనీ బ్రాహ్మణులు క్రింది కులంవాళ్లని నమ్మించారు.
ఇలా అగ్రవర్ణాల వారి కుట్రకు క్రింది వర్గాల వారు వేల సంవత్సరాలుగా బలిపశువులుగా మారారు. అమానుషమైన దోపిడీకీి, అవమానాలకూ గురయ్యారు. శూద్రులకూ, దళితులకూ చదువుకునే అవకాశం లేకుండా చేశారు. విద్యకు దూరం కావడంవల్ల వారు అజ్ఞానాంధకారంలోంచి బయటపడలేకపోయారు. తమకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించలేకపోయారు. పైకులాల వారికి దాస్యం చేయాలని భగవంతుడే నిర్ణయించాడనీ, అది తాము పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితమనీ నమ్మారు. అ లా నమ్మడం వల్ల తమకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్న చైతన్యమే వారిలో కలగలేదు. ఇలా మన హైందవ సమాజంలో తరతరాలుగా శూద్రులకు జరుగుతున్న అన్యాయాలనీ అవమానాలనీ గుర్తించిన మొట్టమొదటి భారతీయ దార్శనికుడు జోతిరావు ఫూలే (1827-1890).
...
ఆ మహాత్ముడు చేసిన కృషిని స్మరించుకోడానికి కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌ వారు 2007 జనవరి 30, 31 తేదీల్లో ఒక జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించారు. నిమ్నవర్గాల అభ్యున్నతికోసం ఎంతో కృషి చేసిన వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజి ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌ పదవీ విరమణ సందర్భంగా జరిగిన ఆ సెమినార్‌కు ఉ.సాంబశివరావు, బి.ఎస్‌.ఎ.స్వామి, బి.ఎస్‌.రాములు, బుర్రా రాములు, తాటికొండ రమేష్‌ మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఫూలే జీవితం, దృక్పథం, ఉద్యమం మీద 23 అధ్యయన పత్రాలను సమర్పించారు. ఆ పత్రాల సమాహారమే ఈ పుస్తకం.

మహాదార్శనికుడు ఫూలే
సంపాదకులు: తాటికొండ రమేష్‌
ముందు మాట: అంపశయ్య నవీన్‌

250 పేజీలు, వెల: రూ.100


ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ 500 067

ఫోన్‌: 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Friday, April 16, 2010

సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి - సావిత్రీబాయి ఫూలే జీవితం-ఉద్యమం



భారతదేశ చరిత్ర రచనపై బ్రాహ్మణీయ భావజాల ప్రభావం అధికంగా వుంది. దాని ఫలితంగా అట్టడుగు కులాలకూ, వర్గాలకూ చెందిన ఎందరో సామాజిక విప్లవకారుల కృషి మరుగున పడిపోయింది. ఆలస్యంగానైనా మనకు అందుబాటులోకి వచ్చిన ఉద్యమకారుల జీవిత చరిత్రల్లో సావిత్రీబాయి ఫూలే జీవితానికి గొప్ప ప్రాధాన్యత ఉన్నది.

ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సారిగా బ్రాహ్మణీయ కులతత్వ సంస్కృతి, మత వ్యవస్థలపై యుద్ధాన్ని ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి. విద్యకు వెలియైన ప్రజలకోసం వారు విద్యాలయాలను నిర్మించారు. విద్యను పీడితుల చేతి ఆయుధంగా మలిచారు. ఆ విశేషాలన్నిటినీ ఈ పుస్తకంలో పలువురు వ్యాస రచయితలు హృద్యంగా వివరించారు.

జ్యోతిబా ఫూలే సహచరిగా ఆయన ఉద్యమ జీవితంలో తోడుగా నిలవటమేగాక తనదైన స్వతంత్ర వ్యక్తిత్వాన్నీ, సాహితీ ప్రతిభనూ రూపొందించుకున్న వ్యక్తి సావిత్రీబాయి. నిబద్ధతతో ఉద్యమించిన మహిళల తొలిగురువు సావిత్రీబాయిని స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం చేసిన కాత్యాయని ''చూపు'' పత్రిక నిర్వాహకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. ఇప్పటికే అనేక నవలలనూ, పుస్తకాలనూ తెలుగులోకి అనువదించారు.
ఇందులో...
1. పరిచయం - బ్రజ్‌ రంజన్‌ మణి
2. సామాజిక విప్లవకారులు - సింథియా స్టీఫెన్‌
3. ఉత్తమ ఉపాధ్యాయిని , నాయకురాలు - గేల్‌ ఆంవెట్‌
4. ఫూలే దంపతులకు స్ఫూర్తి ప్రదాత : సగుణాబాయి - పమేలా సర్తార్‌
5. జోతిబాకు సావిత్రి రాసిన సాటిలేని ప్రేమ లేఖలు - సునీల్‌ సర్దార్‌
6. ఉద్యమ కవితా వైతాళికురాలు సావిత్రీబాయి ఫూలే కవితలు
7. ఒక దళిత బాలిక తిరుగుబాటు స్వరం
8. సత్యాన్వేషి సావిత్రీబాయి - విక్టర్‌ పాల్‌
9. సావిత్రీబాయి జీవిత విశేషాలు

సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి
- సావిత్రీబాయి ఫూలే జీవితం-ఉద్యమం
సంకలనం: బ్రజ్‌ రంజన్‌ మణి, ప్యామెల సర్దార్‌



మూలం: A Forgotten Liberator : The Life and Struggle of Savitribai Phule, Mountain Peak, Delhi 2008.

తెలుగు అనువాదం: కాత్యాయని


72 పేజీలు , వెల: రూ. 40


ప్రతులకు, వివరాలకు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ 500 067
ఫోన్‌: 040 2352 1849
ఇ మెయిల్‌: hyderabadbooktrust@gmail.com

Monday, April 5, 2010

వ్యభిచారం కూడా ఒక వృత్తేనా? "ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పై రంగనాయకమ్మ గారి విమర్శ

ఆంద్ర జ్యోతి 5 ఏప్రిల్ 2010 వివిధ లో "ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కథ" పుస్తకం పై రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ ను మా బ్లాగు వీక్షకుల కోసం ఇక్కడ తిరిగి పొందు పరుస్తున్నాం .
ఆంద్ర జ్యోతి వారికి కృతజ్ఞతలతో.



వ్యభిచారం కూడా ఒక వృత్తేనా?

ఈ మధ్య నేను చదివిన పుస్తకాల్లో 'సెక్స్‌ వర్కర్‌ ఆత్మ కథ' కూడా ఒకటి. తనను సెక్స్‌ వర్కర్‌గా చెప్పుకున్న నళినీ జమీలా మలయాళీ స్త్రీ (కేరళ). తన ఆత్మకథని ప్రచురించుకున్న కాలంలో ఆమె వయసు 52.

పుస్తకం రాసిపెట్టే పని ఇతరులు చేశారు. కానీ పుస్తకంలో ఆభిప్రాయాలన్నీ ఆమెవే. రాసిన వాళ్ళు చేర్చిన అభిప్రాయాలన్నీ ఆమె ఏకీభవించినవే. నళిని. తన పుస్తకంలో చివరికి తేల్చిన విషయం. 'ఎవరికి తోచిన వృత్తి వాళ్లు చేసుకుంటున్నట్టు, మేము వ్యభిచారం వృత్తి చేసుకుంటున్నాం. మా పనిని కూడా సమాజం. ఒక వృత్తిగా గుర్తించాలి. అన్ని వృత్తులతో పాటే మా వృత్తిని. కూడా సమాన గౌరవంతో చూడాలి'. ఇదీ పుస్తకం సారాంశం.

మానవ సమాజంలో-ఆకలి కన్నా, అధిక శ్రమ కన్నా, నిరుద్యోగం కన్నా, కులం కన్నా, మతం కన్నా, వైద్యం లేని జబ్బుల కన్నా, అన్ని రకాల దురంతాల కన్న్నా, అతి క్రూరమైన - అతి నీచమైన దురంతం-వ్యభిచారం. సమాజంలో నిరు పేదతనమూ, పురుషాధిక్యతా అనేవి ఏ దశలో ప్రారంభమయ్యామో ఆ దశలో ప్రారంభమైంది వ్యభిచారం. ఇది, పురుషుల కోసమే. స్త్రీలకు ఇది జుగుప్సాకరమైన దురంతం. కానీ ఈ నళిని. వ్యభిచారాన్ని స్త్రీల కోసం కూడా అవసరమైన విధానంగా కనిపెట్టింది. 'సెక్స్‌ అనేది కేవలం మగవాళ్ల అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ, అందరూ భావిస్తూ వుంటారు' అంటూ ఆమె వాపోయింది.

మగవాళ్లు విటులుగా తయారైనట్టే, ఆడవాళ్లు వేశ్యలుగా తయారవడం, వారి ఆనందానికి చక్కని మార్గమనే సూచన ఇస్తుంది ఈ పుస్తకం. ఈ సూచనని కనిపెట్టడంలోనూ. ప్రకటించడంలోనూ, నళిని పాత్ర ఒక్కటే కాదు. కొందరు ఫెమినిస్టుల పాత్ర కూడా వుంది. ప్రతి వ్యభిచారిణి జీవితంలోనూ తప్పకుండా ఏదో ఒక విషాదగాధ వుంటుంది. ముఖ్యంగా బీదరికం వుంటుంది. నళిని ప్రారంభ చరిత్ర కూడా అలాంటిదే. తాగుబోతూ,తిరుగుబోతూ గూండాగిరీ గల మగవాడితో సంసారం ప్రారంభించి. తను కూడా తాగుడు నేర్చి తాగుడు తెగులుతో భర్త మూడేళ్ళకే పోగా. ఇద్దరు పిల్లల పోషణ కోసం కూలి డబ్బులు చాలక, క్రమంగా వ్యభిచార ఆదాయ మార్గం చేపట్టింది నళిని.

కూలి పనికి వచ్చే ఆదాయం రెండు పూటలా తినడానికి సరిపోయేదిగా ఉంటే. ఆమె తన దారి మార్చుకునేది కాదు. ఆ తర్వాత కూడా అప్పుడో మగాణ్ణి. ఇప్పుడో మగాణ్ణి భర్తలుగా నమ్మి. ఆ కాలాల్లో వ్యభిచారం కట్టిపెట్టి. కొత్త భర్తల పాత భార్యలు బైట పడగా ఎక్కడా స్థిరపడ లేక, ఇక వ్యభిచారాన్నే శాశ్వితాధారంగా చేసుకుంది. పేద స్త్రీలందరూ వ్యభిచారిణులుగా మారకపోయినా, వారిలో కొందరైనా అలా మారడానికి కారణం నిరుపేదతనమే అనడానికి సాక్ష్యం. ధనిక కూటుంబాల స్త్రీలలో, వ్యభిచారంతో జీవించేవారెవరూ ఉండకపోవడమే.

వ్యభిచార స్త్రీలకు పోలీసుల నించి ఎదురయ్యే కేసులూ, అనారోగ్య పరిస్థితులూ, గూండాల దాడులూ- వంటి సమస్యల్లో, వారిని ఆదుకోవడానికి 'జ్వాలాముఖి' అనే ఫెమినిస్టు సంస్కర్తల సంఘం వుందని తెలిసి, అందులో సభ్యురాలిగా చేరిన తర్వాతే నళినికి. 'వ్యభిచారం చక్కని వృత్తి' అనే విశ్వాసం కలిగింది. ఆ సంఘం ద్వారా ఆ అవగాహన ఏర్పడిన తర్వాతే రాసిన తన ఆత్మకథలో నళిని. తనని 'సెక్స్‌ వర్కర్‌గానూ, విటుల్ని తన 'క్లయింట్లు' గానూ. ఆ సంబంధాల్ని అవగాహనతో ఏర్పడిన ప్రేమ సంబంధాలు గానూ, అదంతా సమాజం పట్టించుకోనక్కర లేని వ్యక్తుల వ్యక్తిగత విషయంగానూ వివరించింది.

వ్యభిచార స్త్రీలని పోలీసులు అరెస్టు చేసి కేసులు పెట్టడం గురించి నళిని మంచి ప్రశ్నలే వేస్తుంది- 'మాది నేరం అయితే. మా దగ్గరికి వచ్చే పురుషులది నేరం కాదా? వాళ్ళని పట్టించుకోరెందుకు? అని, కానీ పోలీసుల దాడుల్లో దొరికిపోయినప్పుడు పురుషులమీద కూడా అరెస్టులూ కేసులూ ఉండడం పత్రికల్లో చూస్తాం. 'వ్యభిచారానికి లైసెన్స్‌' పద్ధతిని ఆమె ఒప్పుకోదు. అది నీచమైన మార్గం- అని కాదు. లైసెన్సుల్ని పోలీసుల నుంచీ. డాక్టర్ల నుంచీ తీసుకోవాంటే అది మళ్ళీ అనేక ఇబ్బందులు తెచ్చి పెడుతుందని ఆమెకు తెలుసు. 'సెక్స్‌ వర్క్‌ని ఒక నేరంగా చూడడం మానెయ్యాలనేది మా డిమాండ్‌, అంటుంది నళిని.

'స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రతి లైంగిక సంబంధమూ పెళ్ళితో ముగియాల్సిందేనా? జీవితాంతమూ ఆ సంబంధం అలా కొనసాగడానికి అవకాశం ఉండదా?' అంటుంది. అంటే, పెళ్ళిళ్ళు వేరే స్త్రీలతో చేసుకోండి. అది వేరు. ఆ తర్వాత కూడా వ్యభిచారం సాగడాని కేం?- అని అర్థం.

ఈ విజ్ఞానం అంతా తనకు, జ్వాలాముఖి సంస్థలో చేరిన తర్వాతే అబ్బినట్టు చెప్పుకుంటుంది. వ్యభిచార సంబంధాలు జీవితాంతమూ సాగకూడదా?- అని ఒక పక్క చెపుతూ. సెక్స్‌ని అమ్మడమూ-కొనడమూ శాశ్విత సత్యాలు కావు. పరిస్థితులే నిర్ణయిస్తాయి అంటుంది ఇంకోచోట. సెక్స్‌ని అమ్మే- కొనే పరిస్థితులు ఎప్పటికైనా బాగుపడాలని ఆమె అభిప్రాయం కాదు.ఆ పరిస్థితులు మారకూడదన్నదే ఆమె వాంఛితం. ఒకసారి. ఒక టీవీ ఇంటర్వ్యూలో టీవీ వాళ్ళు ఆమెని 'ఈ వృత్తి నిర్మూలనకు మీ సంఘం ద్వారా మీరేం చెయ్యదల్చుకున్నారు?' అని అడిగితే. 'ఈ వృత్తి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని జవాబు చెప్పింది. అంటే, 'సెక్స్‌ ని అమ్మే- కొనే పరిస్థితులేవీ మారనక్కరలేదని. 'వ్యభిచార స్త్రీలకు పునరావాసం' అనే దానికి ఆమె పూర్తిగా వ్యతిరేకం. ఆ పునరావాస పద్ధతుల్లో లోపాలు వుంటే. వాటిని విమర్శించడం కాదు. అసలు పునరావాసం అనవసరం. వృత్తి మానేస్తేనే మర్యాద దొరకడం కాదు. వృత్తి చేసినా తమకు మర్యాద ఇవ్వాలి.

కుటుంబ స్త్రీలకు లేని ఎన్నో స్వేచ్ఛలు. భర్తలు లేని వ్యభిచారిణులకు వుంటాయిని ఆమె వాదం. భర్తకు వండి వార్చటం. అతని మీద ఆధారపడడం మాకు అక్కర లేదు. అతని ఆస్తిపాస్తుల్లో వాటా ఇమ్మని దేవిరించటం మాకు వుండదు అంటుంది. కుటుంబాల్లో స్త్రీలు, వంటలు చేసేది. భర్తల కోసమే కాదు. తమకోసమూ. పిల్లల కోసమూ కూడా. స్త్రీ భర్త నుంచి స్వేచ్ఛని నిలబెట్టుకోవలసింది. తిరుగుబోతు పురుషుల ద్వారా సంపాదించే డబ్బుతో కాదు. ఈ నళిని తన క్లయింట్ల ద్వారా తను ఎలాంటి అవమానాలు పడిందో. ఎంత జుగుప్సాకరమైన ఘట్టాల్లో నించి ఎంత ప్రాణభయంతో బైట పడిందో చెపతూనే, మానాభిమానాలకు చోటులేని ఆ బతుకులోనే. స్వేచ్ఛ వుంటుందని చెపుతుంది.

'ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో, సెక్స్‌ సంబంధంలోకి వెళ్ళదలుచుకుంటే, దానివల్ల మిగిలిన సమాజానికి జరిగే హాని ఏమీ లేనప్పుడు ఆ విషయాన్నొక నేరంగా పరిగణించనక్కర్లేదనేది నా వాదన' అంటుంది. తన వాదనలన్నీ చాలా సరైనవని ఆమె నమ్ముతుంది. క్లయింటుతో' పరస్పర అవగాహన' అంటే, 'డబ్బు బేరం' కుదరడం. అది సెటిలైపోతే, మిగతా విషయాలతో సమాజానికి హాని ఉండదు. తన క్లయింట్లు వేరే స్త్రీలకు భర్తలైనా, ఆ భర్తలు జీవితాంతమూ వ్యభిచారిణులతో కూడా చక్కని అవగాహనతో గడపవచ్చు భార్యల జీవితాలు దుఖ్ఖసాగరాల్లో మునిగి పోయినా. తిరుగుబోతు పురుషులవల్ల. సమాజం నిండా తండ్రులు లేని బిడ్డలు తయారైనా. సమాజానికి హాని వుండదు.

'మాకు కావలసింది. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడమే తప్ప, జాలీ. దయా కాదు' అంటుంది. ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటే. 'వ్యభిచారం కూడా ఒకవృత్తే' అని అర్థం చేసుకోవాలి. 'బ్రతుకు దెరువుకోసం రాళ్ళ తట్టలు మోసినట్టూ, పారిశుద్ధ్యం పనులు చేసినట్టూ మేము ఈ వృత్తిని చేపట్టాం' అంటుంది ఆడ సెక్స్‌ వర్కర్లతో పాటు మగ సెక్స్‌ వర్కర్ల వృత్తిని కూడా ప్రస్తావించింది.

టీచర్లు విద్యాబోధన చేసి డబ్బు తీసుకుంటారు. మధుర గాయకుడు జేసుదాసు పాటలు పాడి డబ్బు తీసుకుంటాడు. ఆ పాటలు విని అందరూ ఆనందిస్తారు. సెక్స్‌ వర్కర్ల వృత్తిని కూడా అలాగే అర్థం చేసుకోమని నా కోరిక అంటుంది. ఈ కోరిక, దొంగలకూ, హంతకులకూ కూడా వుండవచ్చు.'దొంగతనాలు మా వృత్తి' అని దొంగలూ, 'హత్యలు మా వృత్తి' అని కిరాయి హతకులూ గర్వం గా చెప్పుకోవచ్చు. 'మా వృత్తులకు మర్యాద ఇవ్వండి' అని డిమాండ్‌ చేయవచ్చు. ఈమె వాదనల ప్రకరం నేరాలన్నీ వేరువేరు వృత్తులే అవ్వాలి. ఇటువంటి అస్తవ్యస్తపు వాదనలు ఎన్నో. ఈ వాదన ప్రకరం. వ్యభిచారిణుల పిల్లలందరూ. 'మా అమ్మ సెక్స్‌ వర్కర్‌గా పని చేస్తోంది. ఫలానా కంపెనీలో' అని నిస్సంకోచంగా చెప్పుకోగలగాలి. తన కూతురు తనని అలాగే చక్కగా అర్థం చేసుకుందని నళిని ఎంతో ముచ్చటగా చెప్పుకుంటుంది.

వ్యభిచారాన్ని ఒక చక్కని వృత్తిగా బోధించే సంఘసంస్కర్తల చేతుల్లో పడకముందు ఈమె, తన వ్యభిచారాన్ని రహస్యంగా దాచుకోవాలనే తాపత్రయ పడింది. కానీ, కొత్త జ్ఞానంవల్ల, క్రమంగా వ్యభిచారిణులందరికీ ధైర్యాన్ని నూరిపోసే కార్యకర్తగా ఎదిగింది. ఆ ధైర్యంతోనే తన చరిత్రని సాహన చరిత్రగా చిత్రించుకుంది. కానీ, ఆ ఫెమినిస్టుల్లో కూడా కొందరి మీద ఈమె చాలా అసంతృప్తి పడింది. 'జయశ్రీ లాంటి కొద్దిమంది తప్ప, సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్‌ వర్కర్లకు గుర్తింపు నివ్వడానికి ఇష్టపడడం లేదు. సెక్స్‌ అనేది మగవాళ్ల అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ. అందరూ భావిస్తూ వుంటారు. చాలామంది ఫెనిమిస్టుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా లేదు' అని ఆ ఫెనిమిస్టుల మీద అసంతృప్తి ప్రకటించి వాళ్ల పరువు కాపాడింది. 'ఆడ వాళ్ళ అవసరం గురించి ఆడవాళ్ళకు ఈమె చాలా నేర్పబోయింది. గానీ అసలు ఆ విషయం అనేక ప్రశ్నలు సృష్టించింది. తన అవసరం కోసమే తను ఆరకంగా చేస్తున్నానని ఆమె ఆర్థమా? అది తన ఆవసరమే అయితే, దానికి డబ్బు ఎందుకు తీసుకోవాలి? జవాబు లేదు.

వ్యభిచారం అనేది. కుట్టు పనీ. నేత పనీ. వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. ఆ వృత్తుల్లాగే ఇది కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికీ కావాలి. కానీ. సెక్సు అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదు. ఇంత చిన్న జ్ఞానం, ఈమెకు, వికృత మార్గాలు కనిపెట్టే రకపు ఫెనిమిస్టులు ద్వారా అందలేదు.

నిజానికి, వ్యభిచారిణి అయినా, తన నిస్సహాయ చరిత్రని చెప్పి'మా జీవితాల వంటి నీచమైన జీవితం ఏ స్త్రీకి సంభవించకూడదు. ప్రపంచం ఏ నాటికైనా వ్యభిచారం అనే రోత మాటని మరిచి పోవాలి' అనే ఆశతో ముగిస్తే, ఆ రెండు మాటలే ఉత్తమ సందేశంగానూ, ఆమె పూర్తిగా నిర్దోషిగానూ అవుతుంది.

Saturday, April 3, 2010

టీవీ 9 లో ఏప్రిల్ 4 న ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన
నళినీ జమీలా రచన "ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ" పై
ఏప్రిల్ 4 ఆదివారం ఉదయం (11 .00 -11 .30 గంటలకు)
టీవీ 9 లో పుస్తక సమీక్ష / చర్చా కార్యక్రమం వుంటుంది.
చూచి వీలయితే మీ అభిప్రాయాలు తెలియజేయండి.

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌