Sunday, January 24, 2010

మహారణ్యం సమక్షంలో మహామానవుడి సాక్షాత్కారం - చినవీరభద్రుడు ...

ప్రసిద్ధ బెంగాలీ రచయిత బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ (1884-1950) రాసిన పథేర్‌ పాంచాలిని సత్యజిత్‌ రాయ్‌ సినిమాగా మలిచి ప్రపంచ ప్రసిద్ధం చేశాడు.

ఆ స్థాయిలో ప్రసిద్ధి చెందనప్పటికీ, బిభూతి భూషణ్‌ రాసిన మరో నవల ''అరణ్యక'' (1938) కూడా ఎంతో విశిష్టమైన రచన.

దాన్ని సాహిత్య అకాడెమీ కోసం సూరంపూడి సీతారాం ''వనవాసి'' (1961) పేరిట తెలుగు చేశారు. ఎంతో కాలంగా ఆ పుస్తకం ప్రతులు ఎక్కడా దొరకడం లేదు. ఆ లోటు తీర్చడం కోసం ఇప్పుడు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఈ పుస్తకాన్ని మళ్లా తెలుగు ప్రజలకు అందించడం నాకెంతో సంతోషం కలిగించింది.

ఇప్పటికి దాదాపు ముఫ్ఫై ఏళ్ల కిందట ఎనభైల ప్రారంభంలో ఈ పుస్తకాన్ని మొదటిసారి నేనే కనుగొన్నట్టుగా ఎందరికో పరిచయం చేశాను. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత ఆ పుస్తకాన్ని చూడగానే, పేజీలు తిప్పగానే- మహాలిఖారూప పర్వత శ్రేణి, మోహన్‌పురా రిజర్వు ఫారెస్టు, జ్యోత్స్నా పులకిత జలరాశి మయమైన సరస్వతీహ్రదం, వన్యశేఫాలికాపుష్పాల సౌరభం, పసుపు పచ్చని దూధలి పుష్పాల పరాగం
నన్నొక్కసారిగా ముంచెత్తాయి.

ప్రాచీన సంతాల్‌ రాజకుటుంబం, చకుమికి టోలాలో వాళ్ల ఇల్లు, బోమాయి బూరు పచ్చికబయళ్లు, నాఢా, లటులియాల్లో అ ల్లుకుంటున్న నూతన జీవన సంరంభం; నా జ్ఞాపకాల్లో మరుగుపడ్డవి ఒక్కసారిగా మేల్కొనడంతో, నా నిద్రాణ స్వప్నాల్నీ, నా చుట్టూ వున్న నగర జీవితాన్నీ సముదాయించుకోలేక నేను చాలా అవస్థపడ్డాను.

వనవాసి కథాంశం చాలా సరళం.
కలకత్తాలో నిరుద్యోగిగా వున్న సత్యచరణ్‌ అనే యువకుడు అవినాశ్‌ అనే మిత్రుడి కోరిక మీద బీహార్‌లోని పూర్ణియా జిల్లాలో వున్న దాదాపు పదివేల ఎకరాల ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే పనికి ఒప్పుకుంటాడు.
నగరాన్ని వదిలిపెట్టి, ఆ అడవిలో దాదాపు ఆరేళ్లపాటు వుండిపోతాడు. అక్కడ అడవి నరికించి, భూమిని సాగులోకి తెచ్చి ఎస్టేటు ఆదాయం పెంచలవలసిన పని ఒకవైపూ, నెమ్మదిగా తనను లోబరుచుకున్న అడవి సౌందర్యం ముందు వివశుడైపోవడం మరొకవైపూ అతణ్ణి లాగుతుంటాయి. ఆ క్రమంలో దీన దరిద్ర భారతదేశ ముఖచిత్రమొకవైపూ, ప్రాచీన అరణ్య సీమల మహా సౌందర్యం మరొకవైపూ అతడికి సాక్షాత్కరిస్తాయి.

ఈ అనుభవాలన్నిటినీ ఎన్నాళ్ల తరువాతనో ''కలకత్తా నగరంలో క్షుద్రమైన ఒక గొందిలో, అద్దె కొంపలో మధ్యాహ్నవేళ కూర్చుని భార్య కుట్టుపని సూది చేసే సవ్వడి వింటూ వున్న సమయంలో తలచుకుంటూ మనకి చెప్తాడు. 'ఆ నిగూఢారణ్య సౌందర్యం, తెల్లవారు ఝామున చంద్రాస్తమయ దృశ్యం, కొండల పైన ఆకులు లేని గోల్‌గోలీ చెట్లపై కొమ్మకొమ్మకూ పూసిన పచ్చని పూలరాశి, శుష్కకాశవనం వ్యాపింపచేసిన కసరువాసనలు 'గుర్తొస్తూంటే' మళ్ళీ ఎన్ని పర్యాయాలు ఊహాకల్పనలోనే గుర్రమెక్కి, వెన్నెల రాత్రిలో పూర్ణియా ప్రయాణం చేశానో గుర్తులేదు' (పే.106) అంటాడు.

కథకుడు పూర్ణియా అడవులకు వెళ్లిన మొదటి రోజుల్లో అతడి కచేరీ ఉద్యోగి ఒకడు 'అడవి మిమ్మల్ని ఆవహిస్తుంది, అప్పుడింక ఎలాటి కోలాహలమూ జనసమ్మర్థమూ రుచించవు' అంటాడు.
అడవి ఆవహించిన అనుభవం ఎలా వుంటుందో కథకుడు నెమ్మదిగా మనకు వర్ణించడం మొదలుపెట్టడంతో మనని కూడా అటవీ సౌందర్యం ఆవహించడం మొదలుపెడుతుంది. అందుకు బిభూతి భూషణ్‌ వాడిన భాష, చిత్రించిన సన్నివేశాలూ, వాటికి సూరంపూడి సీతారాం వాడిన తెలుగూ మనల్ని గాఢంగా సమ్మోహపరుస్తాయి. అది ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చేదిగా వుంటుంది.

అయినా కూడా కథకుడు తాను చూసిన సౌందర్యాన్ని మనకు పూర్తిగా చెప్పలేకపోయాననే అనుకుంటాడు. ''పూల్కియా భైహార్‌ల''లో ఆ వెన్నెల రాత్రులను వర్ణించడానికి ప్రయత్నించను. ఆ సుందరలోకాన్ని, ఆ రూపంలో ప్రత్యక్షంగా చూడనంతకాలం, దాని గురించి చెప్పగా వినీ, రాయగా చదివీ గ్రహించడం అసంభవం... అంటువంటి వెన్నెల రాత్రిని జీవితంలో ఒక్కసారైనా చూడటం ఉచితం. అ లా చూడని వారికి ఈశ్వర సృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్న మాటే' (పే.21) అంటాడొకచోట.

కానీ, కేవలం అడవి అందాన్ని వర్ణించడానికే బిభూతి భూషణుడు ఈ నవల రాయలేదు.
అడవి ఒక నెపం మాత్రమే. వనవాసం వల్లనే అతడు ప్రపంచమంటే ఏమిటో తెలుసుకుంటాడు.
అడవికి వెళ్లిన తరువాతనే మనుషుల్ని ప్రేమించడం మొదలుపెడతాడు.
అడవికి వెళ్లిన మొదటి రోజుల్లో కలకత్తాను తలచుకుంటూ ''మనుషుల మధ్య వుండడం అంటే, అంత ప్రియమైనదని ఇంతకు ముందు తెలియలేదు. మనుషుల పట్ల నా కర్తవ్యాన్ని సర్వదా నిర్వర్తించలేకపోయినమాట నిజమే.; అయినా ఎంత ప్రేమ!'' (పే.10) అనుకుంటాడు. ఈ వాక్యాలు ఈ నవల మొత్తానికి ప్రాతిపదిక.

కథకుడు కలకత్తాలో వున్నప్పుడు తన చుట్టూ మనుషులుండడంలోని ఆనందాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. కానీ వాళ్ల పట్ల తన కర్తవ్యం నిర్వహించే విషయంలో అతనికప్పుడేమీ ప్రాధాన్యత లేదు. కానీ అడవికి వెళ్లిన తరువాత అతడి చిత్తప్రవృత్తిలో వచ్చిన మార్పు సుస్పష్టం. అతడు మనుషుల కోసం ఆర్రులు చాచడమే కాదు, తనకు తారసపడ్డ ప్రతి ఒక్కరి పట్లా అతడెంతో ఉదారంగా, ఆప్యాయంగా, సుస్నేహంగా ప్రవర్తించడం కనిపిస్తుంది మనకి. తను కలిసిన ప్రతి ఒక్కరి భౌతిక, మానసిక, సాంఘిక అవసరాలు గుర్తించడంలో, వాటిని తీర్చడానికి ప్రయత్నించడంలో అతడి వ్యక్తిత్వంలో ధీరత్వం మన ముందు ఆవిష్కృతమౌతూ ముగ్ధుల్ని చేస్తుంది.
నవదాలక్ష్మీపురం సరిహద్దుల్లో మిఛీనది ఒడ్డున కనిపించే ధన్‌ ఝరి కొండ ఎంత గంభీరంగా కనిపిస్తుందో కథకుడి జీవితానుభవం కూడా అంతే గంభీరంగా కనిపిస్తుంది. అతడికి తారసపడ్డ రకరకాల మనుషులు కథకుడు జీవితంలో ప్రవేశించినట్లే మన జీవితంలోకి నెట్టుకొచ్చేస్తారు.

కథంతా చదివాక మనకేమనిపిస్తుంది?
కథకుడొకచోట ఇలా అంటాడు. ''నాఢా అరణ్యమూ, అజామాబాద్‌ విస్తృత మైదానాల్లో గోధూళివేళ రక్తరాగ రంజితమైన మేఘాలనూ, దిగంచలాల వరకూ వ్యాపించి జ్యోత్స్నాప్లావితమైన నిర్జన మైదానాలనూ చూచినప్పుడల్లా తోచేది ఈ స్వరూపమే. ప్రేమ ఇదే రోమాన్స్‌, కవిత, సౌందర్యం శిల్పం, భావుకత- ఈ దివ్య మంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది, ఇదే లలితకళను సృష్టించేది. ప్రీతి పాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలి పోయేది'' (పే.230). ఒక మహారణ్య సమక్షంలో కథకుడు తనలోని మహామానవుణ్ణి సాక్షాత్కరించుకున్నాడనీ, గొప్ప సౌందర్యం మనలోని మనిషిని మేల్కొల్పుతుందనీ, అదే సౌందర్య ప్రయోజనమనీ, సాహిత్య ప్రయోజనమనీ చెప్పకుండానే చెప్తుందీ రచన.

- చినవీరభద్రుడు
ఆదివారం ఆంద్రజ్యోతి 24 జనవరి 2010 సౌజన్యంతో.



వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి ముద్రణ: సెప్టెంబర్‌ 2009

278 పేజీలు, వెల: రూ.120


ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849


...

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌