Monday, January 4, 2010

పుస్తకం డాట్ నెట్ లో సుజాత గారి వనవాసి నవలా సమీక్ష ...



పుస్తకం డాట్ నెట్ లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ "వానవాసి" నవలపై 'మనసులో మాట' సుజాత గారు చక్కని సమీక్ష రాశారు. పుస్తకాభిమానుల స్పందనలతో సహా ఆ సమీక్షను ... ఇక్కడ ... చూడవచ్చు.
మా బ్లాగు సందర్శకుల సౌలభ్యం కోసం పుస్తకం డాట్ నెట్ వారికి, సుజాత గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ సమీక్షను తిరిగి ఇక్కడ పొందు పరుస్తున్నాం.
కొందరు ఈ ప్రచురణ అసలు నవలకు సంక్షిప్త రూపమా అని అడుగుతున్నారు. ఇది 1961 నాటి తొలి ముద్రణకు యధాతధ రూపమని గమనిచగలరు.
- హైదరాబాద్ బుక్ ట్రస్ట్

........

"వానవాసి"

కొన్ని పుస్తకాలు చదువుతున్నపుడు అంత ఆసక్తిగా అనిపించకపోయినా పూర్తయ్యేసరికి ఒక గాఢమైన నిట్టూర్పు వెలువడక మానదు. కనీసం ఒక పదినిమిషాలన్నా అప్పటికప్పుడు ఆలోచనల్లో పడెయ్యక మానదు. ఆ తర్వాత పదే పదే గుర్తుకు రాకా మానదు.ఆ కోవలోదే “వనవాసి” నవల!

ఇది నవలా? సామాజిక ప్రయోజనం కోసం రాసిన డాక్యుమెంటరీ రచనా? ఒక ఏకాంత స్వాప్నికుడి జీవిత ప్రయాణంలో భాగమా? అని తలెత్తే ప్రశ్నలకు ఎవరికి వారు సమాధానం చెప్పుకోవలసిందే!

అప్పుడెప్పుడో పథేర్ పాంచాలి నవల చదువుతుంటే ముందు మాటలో భిభూతి భూషణ్ వంద్యోపాధ్యాయ గారి మరో నవల ‘అరణ్యక” గురించి చదివి దానికోసం ప్రయత్నిస్తే అది దుర్లభమని తేలింది.
అనుకోకుండా ఆ మధ్య విజయవాడలో పాత పుస్తకాల షాపులో వనవాసి మొదటి ప్రచురణ కాపీ,(1961 లో సాహిత్య అకాడేమీ తరఫున అద్దేపల్లి అండ్ కో రాజమండ్రి వారు వేసింది) దొరికింది. చాలా జాగ్రత్తగా చదవాల్సి వచ్చింది. కొన్ని పేజీలు పట్టుకుంటే పొడి అయిపోయేలా ఉన్నాయి.

ఇందులో కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. ఉండేవల్లా ఆలోచనలే! రచయిత కథకుడిగా మారగా అతని మెదడులో ప్రాణం పోసుకుని హృదయం ద్వారా మనలోకి ప్రవహించి మనలో కూడా ఆలోచనల్ని రేకెత్తించే ఆలోచనలు!

విద్యావంతుడై ఉన్నత సంస్కారం కలిగిన ఒక బెంగాలీ యువకుడు సత్యచరణ్ బాబు!ఉద్యోగార్థియై తిరుగుతుండగా పాత స్నేహితుడు కనపడతాడు. మాటల మధ్యలో తమకు పూర్ణియా జిల్లాలో 30 వేల బిఘాల (బిఘా అంటే సుమారు 40 సెంట్ల నేల)ఎస్టేట్ అడవి ఉందనీ దాని బాగోగులు చూస్తూ అడవిని వ్యవసాయానికి కౌలుకిస్తూ వసూళ్ళు చూసే మేనేజర్ అవసరం ఉందని చెప్తాడు. ఏ పనికైనా సిద్ధంగా ఉన్న సత్యచరణ్ తాను ఆ ఉద్యోగం చేస్తానని ఒప్పుకుని అడవికి ప్రయాణమవుతాడు. ఒకవైపు కలకత్తా నగరాన్ని “మిస్”అవుతానేమో అన్న బెంగతోనే, అయిష్టంగానే పొట్టకూటికోసం అడవికి వెళతాడు.

ఎటుచూసినా అడవి, నిశ్శబ్దమైన అడవి, జన సంచారం లేని అడవి,కొద్ది మంది జనం ఉన్నా.. గిరిజనులు! వారి భాష అర్థం కాదు! బంధుమిత్రులు, పాటకచేరి, లైబ్రరీ,సాహిత్యం లేని జీవితాన్ని ఎన్నడూ ఎరగని సత్యచరణ్ ఈ జీవితాన్ని చూసి కుంగిపోతాడు.

కానీ రోజులు గడిచేకొద్దీ,అరణ్య సౌందర్యం అతన్ని వ్యామోహంలా ఆవహిస్తుంది.ఎంతగా అంటే కొన్నాళ్ళకి తిరిగి కలకత్తా నగరానికి పోలేనేమో అని భయం వేస్తుందతనికి!

అపూర్వ రక్తారుణ రాగరంజిత మేఘమాలలు ధరించిన సంధ్యలూ,ఉన్మాదిని అయిన భైరవీ స్వరూపం ధరించిన ఉగ్ర మధ్యాహ్నాలు,హిమస్నిగ్ధ వనకుసుమపరిమళంతో జ్యోత్స్నాలంకారాలతో ఎన్నో గంభీర నిశీధులు అతన్ని కట్టి పడేస్తాయి.అడవి కాచిన వెన్నెలే సార్ధకం అని నిర్ధారిస్తాడు అతడు.ఏకాంతంలో దిగంతాల వరకూ వ్యాపించిన వెన్నెల్ని అనుభవించి అడవిలో వెన్నెల రాత్రిని చూడని వారి జీవితంలో ఈశ్వర సృష్టిలో ఒకానొక అద్భుత సౌందర్యానుభూతి నష్టపోయినట్లే అంటాడు.

ఒకపక్క అడవిని నరికించి కౌలుకిస్తూనే ఆ చుట్టుపక్క పల్లెల్లో పేద జీవితాల దరిద్రం వికృత స్వరూపాన్ని చూసి నిర్ఘాంతపోతాడు. ఆకలితీర్చుకోడానికి పచ్చి మినప్పిండి తినేవారిని చూస్తాడు.పిల్లల ఆకలి తీర్చడానికి ఎంగిలాకుల కోసం ఆశపడుతూ, రేగుపళ్ళు దొంగతనం చేసి శిక్షకు సిద్ధమయ్యే అద్భుత సౌందర్యరాశిని చూస్తాడు. డబ్బుతో తనను కొనాలని చూసే భూస్వామిని చూస్తాడు. గొర్రెలు కాస్తూ ఒక ఆటవిక తెగకు రాజుగా పరిచయమయ్యే ముసలివాడిని కలుస్తాడు.

మొక్కలమీద ప్రేమతో ఎక్కడెక్కడినుంచో పూలతీగలు తెచ్చి సరస్వతీ మడుగు వద్ద నాటి అడవిని సప్తవర్ణ శోభితం చేయాలనుకునే బన్వారీని చూసి ముగ్ధుడవుతాడు.అతడితోపాటు మడుగు చుట్టూ అద్భుత పుష్ప వనాన్ని సృష్టిస్తాడు.పూలతో పందిరి వేస్తాడు.కోతల సమయంలో ఎక్కడెక్కడినుంచో వచ్చి పని చేసే కూలివాళ్లను, వాళ్ల కష్టాన్ని దోచుకునే చిల్లర వ్యాపారులనీ పరికించి నిశ్చేష్టుడవుతాడు.

కొన్నాళ్ళకి…మొత్తం అడవంతా నరికి కౌలుకివ్వడం పుర్తవుతుంది. ఇక సరస్వతి మడుగు ప్రాంతాన్ని ఇవ్వడానికి ఎంతో దుఃఖపడినా లాభం లేకపొతుంది.ఇక అతడికి అక్కడ పనేముంది?

భారమైన మనసుతో ఇరుకు వీధుల కలకత్తా నగరానికి తిరుగు ప్రయాణమవుతాడు.
తిరిగి వచ్చాక కూడా అతన్ని అడవి జ్ఞాపకాలు వదిలిపెట్టవు. వేధిస్తాయి.

అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువు…పచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.

కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!

ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
“అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.
కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్…వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.

అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.

ఏకాంతంలో తనకు మాత్రమే గోచరమయ్యే ఆ అద్భుత వన సౌందర్యానికి పరవశుడై కవితావేశంతో స్పందిస్తాడు.రాగరంజితమైన మేఘాలను,దిగంతాల వరకూ వ్యాపించి జ్యోత్స్నా ప్లావితమై నిర్జనమైన మైదాన ప్రాంతాలనూ చూసి” ఈ స్వరూపమే ప్రేమ!ఇదే రొమాన్స్! కవిత, సౌందర్యం,శిల్పం, భావుకత. ఈ దివ్యమంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది.ఇదే లలిత కళను సృష్టించేది. ప్రీతిపాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలిపోయేది. తిరిగి విశ్వ జ్ఞాన శక్తినీ, దృష్టినీ వినియోగించి గ్రహాలను, నక్షత్ర లోకాలనూ, నీహారికలనూ సృష్టించేది ఇదే..” అంటాడు.

విద్యావంతుడైన సత్యచరణ మూఢనమ్మకాలకు విలువనివ్వడు. అడవి దున్నలకు ప్రమాదం రాకుండా ఎప్పుడూ కాపాడే ఒక దేవుడి గురించి ఆదివాసీలు చెపితే కొట్టిపారేస్తాడు. కలకత్తా వచ్చాక ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ….బరువు ను లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి “ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండు”అని అప్రయత్నంగా అనుకుంటాడు.

ఇలాంటి అద్భుత సన్నివేశాలు, అపూర్వమైన వనసౌందర్య వర్ణనలూ, ఆదివాసీల జీవితంలో దరిద్ర దేవత విశ్వరూపం,
ప్రతి పేజీలో కనపడతాయి.

ఈ పుస్తకం చదవాలంటే కేవలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. ఆ తర్వాత వెంటాడే యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలు,అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు, మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలు, అన్నానికి, రొట్టేలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చి పిండీ తినే దృశ్యాలు, ఒక్క రొట్టె కోసం పన్నెండు మైళ్లు నడిచి వచ్చే పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే భావాన్ని భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!
ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు అందుబాటులోకి తెచ్చారు. ప్రకాశకులు చెప్పినట్లు ఈ పుస్తకం అవసరం రచనాకాలం కంటే ఇప్పుడే ఎక్కువ. మరీ ఎక్కువ.

స్వర్గీయ శ్రీ సూరంపూడి సీతారామ్ గారు అనువదించిన ఈ పుస్తకం ఇప్పుడు అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది. వెల నూట ఇరవైరూపాయలు!
..................
వ్యాసం రాసిపంపినవారు: సుజాత(మనసులో మాట) – నా స్వపరిచయం ప్రత్యేకంగా ఏమీ లేదు. జర్నలిజం చదువుకుని కొద్ది రోజుల పాటు పని చేసాను. రంగనాయకమ్మ, కొడవటిగంటి కుటుంబరావు,నామిని గారి రచనలంటే బాగా ఇష్టపడతాను. జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించే ఏ రచనైనా నా అభిమాన రచనే! ఇంకా చదవని, వెదుకుతున్న పుస్తకం క్రిస్టఫర్ రీవ్(హాలీవుడ్ సూపర్ మాన్) రాసిన still me! ఏ పనైనా చేస్తూ సరే పుస్తకాలు చదవగలను. వంట చేసేటపుడు కూడా పుస్తకం చేతిలో ఉండాల్సిందే! రాయడం అంటే బద్ధకం, చదవడం అంటే ఎక్కడ లేని ఉత్సాహం!
- pustakam.net


......

...............

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌