Tuesday, June 30, 2009

తెలంగాణ ఆత్మకథ …ఊరువాడ బతుకు …. తెలిదేవర భానుమూర్తి సమీక్ష



ఊకదంపుడు ఉపన్యాసాలు, క్షణక్షణం మారే రాజకీయ వ్యూహాలు, లాబియింగ్‌ ద్వారా తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గాని ఊరువాడ బతుకు వంటి పుస్తకాల ద్వారా జెనానికి తెలంగాణ సంస్కృతి అంటే ఏమిటో తెలుస్తుంది. ఉద్యమస్ఫూర్తి కలుగు తుంది. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావలసిన అవసరం ఏంతైనా ఉంది.
- తెలిదేవర భానుమూర్తి



,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


తెలంగాణ ఆత్మకథ …ఊరువాడ బతుకు

ఊరువాడ బతుకు కేవలం ఆత్మకధేకాదు. తెలంగాణ సంస్కృతి కధ. ఆచార వ్యవహారాల కధ. ఆత్మీయత, అనుబంధాల కధ.

తన ఆత్మకథను నాలుగు భాగాల్లో దేవులపల్లి కృష్ణమూర్తి చెప్పారు. ప్రతిభాగం జానపద గీతం లేదా గేయంతో ప్రారంభమవుతుంది. మధ్య మధ్య సందర్భానికి తగ్గట్లూ జానపద గీతాలను రచయిత ఉటంకించారు. బాల్యం నుంచి నవయవ్యనం దాకా తన అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా రాశారు.

ఇందులో అట్టడుగు వర్గాల జీవితచిత్రణ కనిపిస్తుంది. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, అనంతారంలలో చదువుకున్నప్పుడు తనకు కలిగిన అనుభవాలను ఉన్నది ఉన్నట్లుగా రచయిత వివరించారు. ఏ ఒక్క అంశాన్ని కూడా ఆయన పండుగలు, పబ్బాలు, భాగోతాలు, వంటి పలు అంశాలను రేఖామాత్రంగా ఆయన స్పృశించారు.

భాగోతంలో రాజువేషం వేసే వాడిమీద ఒకామె మోజు పడి ఆదేవేషంలో ఎడ్లకొట్టంకాడికి రమ్మని జీతగాడితో కబురంపుతుంది. జీతగాడు తోవచూపించగా దుప్పటి కప్పుకొని రాజువేషంతోనే ఎడ్లకొట్టంకాడికి అతను వెళతాడు. ఆమె రాజభోగం తీరింది, కానీ తెల్లారి ముఖానికంతా రంగు అంటుకొని ఆమె రంకు బయటపడింది.

గిర్దావరు వద్ద నాటు తుపాకీ ఉండేది. దానితో ఆయన కొంగలు, బాతులను వేటాడేవాడు. ఆ బాతు బొచ్చుపీకడానికి చాకలి వెంకులు వచ్చి కాల్చడానికి తాటకుల కోసం పోగానే పిల్లి వచ్చి బాతును తినిపోతుంది. ఇక ఆ వూట పప్పు పచ్చడితోనే గిర్దావరు తినవలసి వస్తుంది. నిజజీవితంలోని ఇలాంటి హాస్య సంఘటనల గురించి తన ఆత్మకధలో రచయిత ప్రస్తావించారు.

సందర్భోచితంగా ఆయన సామెతలను ఉపయోగించారు. ఒక విషయం గురించి చెబుతూ మధ్యలో సామెతను వాడే సాధారణ పద్థతికి భిన్నంగా విషయమంతా చెప్పేక చివర్న కృష్ణమూర్తి సామెత చెబుతారు. సందంతా దాసర్లే, బిచ్చమెవడు పెట్టాలె' ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం' 'చీర వూడిందాక సిగమూగొద్దమ్మో' వంటి సామెతలు, బింకి, తాతీళ్లు, దూప, గిన్నెపండ్లు వంటి తెలంగాణ పలుకు బళ్లు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

స్నేహితుడిని దగ్గర కూర్చుండబెట్టకొని ముచ్చట్లు ఆయన తన ఆత్మకథను చెప్పారు. మోటకొట్టే తెల్లవారు జముతో మొదలయ్యే ఈ ఆత్మకథ కలికి గాంధారి వేళతో ముగుస్తుంది.

ఊరువాడ బతుకులో తెలంగాణ పండుగల గురించి రచయిత వివరించారు. శ్రీరామనవమి గురించి చెబుతూ 'శ్రీరామనవమికి మా అయ్యదే పెత్తనం. పొద్దున్నే స్నానం చేసి కోమటింటికి పోయి బెల్లం, మంచి చెనిగపప్పు తెచ్చెటోడు. ఊరబావి నుండి బిందెతో నీళ్లు తెచ్చి ఆంజనేయ విగ్రహాన్ని శుభ్రం చేసి, ధూప దీపాలతో ఆరాధన చేస్తడు. చుట్టుపక్కల ఇండ్లలోని ఆడపిల్లలు వచ్చి గుడిముందు పూడ్చిచల్లి, తీరుతీరు ముగ్గులు పెడ్తరు. బెల్లంతో బిందెలో పానకం చేసి, పప్పు నాన బెట్టి వుంచెటోడు. ఈ పనులన్నీ అయ్యేవరకు పొద్దుగూకేది. రాములోరి పెండ్లికి ఊరంతా పండుగే. పటేండ్లు, కోమట్లు ఊదుబత్తీలు, కర్పూరం, కొబ్బరికాయ దేవునికి సమర్పించేది. కొబ్బరి ముక్కలు పప్పుబెల్లంతో ఫలహారం చేసె టోడు. భక్తులందరు గడిచుట్టు ప్రదక్షిణం చేసి పానకం, ఫలహారం తీసుకునేది. ఫలహార ముల్లో అంటే నాకింత, నాకింత అని ఎగబడేది.

అప్పటి రాజకీయ పరిస్థితి గురించి ఈ పుస్తకంలో కొద్దిపాటి ప్రస్తావన ఉంది. నేను రెండో తరగతిల ఉండంగ మా సత్తెన్న ఇంటికి సంగపోల్లు వస్తుండెటోల్లు. చుట్టుపట్టు ఊర్లల్లో గోలలైతున్నయి. సంగపోల్లు వచ్చి సభలు పెట్టి జై కొట్టెది. ఆ భయానికి పెద్దకుటుంబాలు పేటకు వెళ్లి పోయినయి.

చుట్టుపట్టు ఊర్లల్ల రజాకార్ల గోల రాత్రిపూట కాపలా కాయడం మొదలైంది. మా ఊర్లో తురుకోళ్లుండిరి. వాళ్లు తురుకోళ్లమని ప్రత్యేకంగా అనుకోరు. మాతో పాటె కల్సివుండెటోళ్లు వాళ్లకు ఏ పిచ్చిలేదు. తిండిపిచ్చి తప్ప. గ్రామీణ వృత్తులు, వృత్తి పనివారల జీవితాల చిత్రణ ఈ పస్తకంలో కనిపిస్తుంది.

మీకు కల్చర్‌ లేదంటూ అవహేళన చేసే వారికి ఈ పుస్తకం ద్వారా రచయిత దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు.

ఊకదంపుడు ఉపన్యాసాలు, క్షణక్షణం మారే రాజకీయ వ్యూహాలు, లాబియింగ్‌ ద్వారా తెలంగాణ వస్తుందో రాదో తెలియదు గాని ఊరువాడ బతుకు వంటి పుస్తకాల ద్వారా జెనానికి తెలంగాణ సంస్కృతి అంటే ఏమిటో తెలుస్తుంది. ఉద్యమస్ఫూర్తి కలుగు తుంది. ఇలాంటి పుస్తకాలు ఇంకా రావలసిన అవసరం ఏంతైనా ఉంది.

తెలిదేవర భానుమూర్తి
(వార్త 21 జూన్‌ 2009 ఆదివారం సౌజన్యంతో)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

దేవులపల్లి కృష్ణమూర్తి అన్‌ట్రెయిన్డ్‌ టీచర్‌గా సంవత్సరంన్నర పనిచేసి, 1960లో నల్లగొండ జిల్లాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఎల్‌డీసీగా చేరి 1998లో మండల రెవెన్యూ అధికారిగా రిటైరైనారు. అభిరుచులు: సాహిత్యం సంగీతం, జానపదాలు, చిత్రలేఖనం, ఆర్ట్‌ ఫిలింలు. ఇప్పుడు నకిరేకల్‌లో వుంటున్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఊరు వాడ బతుకు
రచన: దేవులపల్లి కృష్ణమూర్తి

135 పేజీలు, వెల: రూ.40
............................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌