Monday, May 11, 2009

ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం: మొల్ల, వేమన, పోతులూరి, ముద్దు నర్సింహం, త్రిపురనేని, జాషువా రచనలపై పరిశీలన ...



ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం
- కంచ ఐలయ్య ...


ఉత్పత్తి కులాల నుండి వచ్చిన రచయితలు దాదాపు 17వ శతాబ్దం నుండి రచనా రంగంలో ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో ఈ చిన్న పుస్తకం చెబుతుంది. మొల్ల నుండి గుర్రం జాషువా వరకు సూద్ర, ఓబీసీ, దళిత రచయితలు బ్రాహ్మణిజంతో తలపడేందుకు ఎటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ల కులాల ప్రత్యేకతను కాపాడుకునేందుకు , వాటిలోని అభివృద్ధి లక్షణాలను సమాజం ముందుంచేందుకు ఎటువంటి ఎత్తుగడలు వేశారు అనే అంశాలను, వారి వారసత్వాన్ని ఉత్పత్తి కులాల రచయితలకు చూపించే ప్రయత్నం చేస్తుందిది.

దళిత బహుజనుల స్పష్టమైన ముద్ర కలిగిన కావ్య సంపుటిని 16 వ శతాబ్ధంలో తొలిసారిగా మొల్ల అనే కుమ్మరి మహిళ రచించింది. అది '' మొల్ల రామాయణం '' గా ప్రసిద్ధిచెందింది. కవియిత్రి మొల్ల కాకతీయ సామ్రాజ్యవారసురాలు. ప్రస్తుత వరంగల్‌ సమీప ప్రాంతంలో ఆమె నివసించేది. కొంతమంది నెల్లు ప్రాంత వాసురాలని చెబుతారు. స్త్రీలకు అందునా సూద్ర స్త్రీలకు చదువుకునేందుకు ఎట్లాంటి అవకాశాలు లేని ఆ రోజుల్లో స్వయంగా చదువు నేర్చుకుని మొల్ల కావ్యం రాసే స్థాయికి చేరుకోవడం నిజంగా అబ్బురపరిచే విషయమే.

మొల్ల తరువాత సూద్ర కవుల్లో ప్రముఖుడు వేమన.
కాపు (రెడి)్డ కులస్థుడైన వేమన '' విశ్వదాభి రామ వినుర వేమ '' అంటూ ఆటవెలదిలో రాసిన పద్యాలు17వ శతాబ్దంలో దళిత బహుజనులను ఉర్రూతలూపాయి. సరళమైన వాడుక భాషలో చేసిన వేమన రచనలన్నీ దైవత్వ రహితంగా, లౌకికత్వాన్ని ప్రతిబింబేచివిగా, మూఢనమ్మకాలనూ మూర్ఖ ఆచారాలను చీల్చిచెండాడేవిగా వుండేవి.

పోతులూరి వీరబ్రహ్మం, సిద్దయ్యల ప్రవచనాలు, రచనలు కుల రహిత సమాజ నిర్మాణానికి నాంది పలికాయి. వడ్రంగి కులానికి చెందిన పోతులూరి మొదట్లో తన కుల వృత్తినే చేసేవాడు. దూదేకుల ముస్లిం అయిన సిద్దయ్యను తన శిష్యుడిగా చేసుకుని ఎంతో దూరదృష్టిని ప్రదర్శిచాడు. బ్రాహ్మణాధిక్యతను ఎదిరించాడు.
కాపు కులంలో జన్మించిన ముద్దు నర్సింహం (1800-1858) హితసూచిని అనే తొలి తెలుగు వచన గ్రంథాన్ని రచించారు. మానవాళి అభవృద్ధికి విద్య ఎంతో అవసరమని అది చాటి చెబుతుంది.

ఒక ధనిక “కమ్మ” కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి చౌదరి (1887-1943) సూద్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ, బ్రాహ్మణ వ్యతిరేక చైతన్యంతో అనేక రచనలు చేశారు. ఆయన రచించిన శంభూక వధ నాటకం ఆరోజుల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇక గుర్రం జాషువా అయితే దళితుల ఆశాజ్యోతిగా వెలుగొందారు. కర్మ సిద్ధాంతం దళితులను కట్టి పడేసిందని అదే దళితుల కొంప ముంచిందని, దానిపై దళితులు తిరుగుబాటు చెయ్యాలని పురికొల్పారు. 'గబ్బిలం' కావ్యం ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది.

తెలుగు సాహిత్యంలో మరుగున పడ్డ మహోన్నతుల గురించి చిత్రిస్తూ తెలుగు సాహిత్య చరిత్రను పునర్లిఖించాల్సిన అవసరాన్ని చాటి చెబుతుందీ పుస్తకం.

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య తాత్వికుడిగా, రాజకీయ శాస్త్రవేత్తగా, ఉస్మానియా యునివర్సిటీలో రాజనీతి శాబస్త విభాగాధిపతిగా సుప్రసిద్ధులు. వారు '' నేను హిందువు నెట్లయిత ? '' , '' మనతత్వం '' , '' దేవుడి రాజకీయతత్వం - బ్రాహ్మణత్వంపై బుద్ధుడి తిరుగుబాటు '' వంటి పలు పుస్తకాలు రాశారు.



ఉత్పత్తి - తెలుగు సాహిత్య వారసత్వం:
మొల్ల, వేమన, పోతులూరి, ముద్దు నర్సింహం, త్రిపురనేని, జాషువా రచనలపై పరిశీలన ...

- కంచ ఐలయ్య ...


ఆంగ్ల మూలం : Telugu Nationalism: The Unknown Vision

తెలుగు అనువాదం: సఫ్దర్‌ అహ్మద్‌

40 పేజీలు, వెల: రూ.10

............................

3 comments:

  1. బాగుంది. ఇలాటి రచనలు మనకి మంచి ఉపయోగం. పరిచయం చేసినవారికి, ప్రచురించిన మీకూ ధన్యవాదాలు.

    ReplyDelete
  2. @ te.thulika
    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. well said. but the only thing in your description is, you wrote "sree veera brahmam garu belongs to vadrangi caste." but as per my knowledge, there is no such a caste. the word vadrangi refers the occupation(vritthi), not caste. we cannot refer a person with his occupation as the caste name (vritthi vaachakaas are not kula vaachakaas). his caste name is viswabrahmana. now a days any body can do the carpentary. but all the carpenters cannot become viswabrahmin. i hope u can understand.thank you.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌