Thursday, April 30, 2009

దళితబహుజన కులాలకు తెలుగు మీడియం ...! అగ్రకులాలకు ఇంగ్లీషు మీడియం ...!! ఇదేనా తెలుగు భాషా పరిరక్షణోద్యమం లక్ష్యం?


దళితబహుజనులకు తెలుగు
అగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?


తెలుగు భాష పరిరక్షణ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీషును ప్రవేశపెట్టకుండా అడ్డుకుంటున్న వారిని నిలదీస్తూ వార్త దినపత్రికలో కంచ ఐలయ్య చేసిన వాదనల సంకలనమిది.

ఇందులో
1) మాతృభాషా వాదంలోని మతలబు ఏమిటి?
2) ఆంగ్లం వలస భాష అవుతుందా?
3) రెండు కాళ్లపై నడిచే విద్యావిధానం కావాలి
4) భాషా రాజకీయం బహుజనులతో చలగాటం
5) సైన్సును అడుక్కునే దశలో ఎందుకున్నాం?
6) ఇంగ్లీషు + డబ్బు = ప్రతిభ
అనే వ్యాసాలున్నాయి.

స్వాతంత్య్రం రాగానే హిందీని జాతీయ అధికార భాషగా ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో ఇప్పటికీ ఇంగ్లీషు భాషలోనే విద్యా బోధన జరుగుతోంది. ఐఐటిలు, ఐఐఎంలు, కేంద్ర మెడికల్‌ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు ఇంగ్లీషు భాషలో మాత్రమే బోధిస్తున్నాయి…..

అన్ని కేంద్ర సంస్థలూ అగ్రకులాల, ముఖ్యంగా బ్రాహ్మణుల గుత్తాదిపత్యంలో వున్నాయి. వాళ్ల సిద్ధాంతం ప్రకారం వాళ్లు సంస్కృతంలోనో, హిందీలోనో చదువుకోవాలి. కానీ వారు అ లా చేయరు. ఎందుకంటే తమ పిల్లలు ఇంగ్లీషులో చదువుకుంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందగలరని వాళ్లకి తెలుసు……

ప్రభుత్వ స్కూళ్లలో ఎక్కువగా బీద ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాలవారే చదువుకుంటారు. అగ్రకులాలకు చెందిన పిల్లలెవరూ చదవరు. తెలుగు పరిరక్షణ కోసం ప్రతినిత్యం యుద్ధం చేసే పెద్దలు తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలోనే చదివించుకుంటారు. ….

మాతృభాషలను పరిరక్షించే బాధ్యత ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కులాలవారు చేపట్టాలట.
తమ పిల్లలు మాత్రం ఇంగ్లీషు చదువుకొని అమెరికా ఐరోపా దేశాలకు పోయి, అన్ని ఉన్నతోదోగ్యాలను చేజిక్కించుకుని అభివృద్ధి చెందాలి. దళితబహుజనుల పిల్లలేమో ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా ఇంకా తెలుగు మీడియంలోనే చదువుకుంటూ అగ్రకులాల అడుగులకు మడుగులొత్తుతూ పడివుండాలట…….

ఇదీ ఈనాటి భాషా రాజకీయం!

ప్రజలు తమ భాషను ఉత్పత్తి పనిలో భాగంగా నేర్చుకుంటారు.
మన రాష్ట్రంలోనే గోండు తెగకు ఒక భాష, కోయ తెగకు ఒక భాష, లంబాడీ తెగకు ఒక భాష, ఎరుకలి తెగకు ఒక భాష వున్నాయి. ……

కాస్త అభివృద్ధి చెందిన తెగ భాష మిగతా తెగ భాషలను మింగేసి, ఆ తెగలన్నింటినీ తెగాంతర భాషలోకి మారుస్తుంది. ...ఈ క్రమంలో ప్రజలు ఎన్నో అభివృద్ధి చెందని భాషలను వదులుకొంటూ, అభివృద్ధి చెందిన భాషలను నేర్చుకుంటూ ముందుకు సాగుతారు…..

ప్రాచీన కాలంలో సంస్కృతం పాలకుల భాషగా, పాళీ పాలితుల భాషగా వుండేది. సంస్కృతం అగ్రకులాల గుత్త సొత్తుగా వుంటూ వచ్చింది. ఇవాళ ఇంగ్లీషును కూడా అగ్రకులాలు తమ గుత్తసొత్తుగా చేసుకోవాలని, దళితబహుజనులను ప్రాంతీయ భాషలకు కట్టిపడేయాలని చూస్తున్నాయి. …..

మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి నుండి ఇంగ్లీషు, తెలుగు రెండు భాషలనూ సమానంగా నేర్పాలని దళితబహుజన ఉద్యమాలు ఎప్పటి నుండో డిమాండ్‌ చేస్తున్నాయి. ….

ఇంగ్లీషు చదువుల వల్లనే దళితుల్లోంచి జ్యోతీరావు ఫూలే, అంబేడ్కర్‌ వంటి మేధావులు, తత్వవేత్తలు పుట్టుకొచ్చారు…..

బ్రాహ్మణులు తమ సంస్కృత భాష అభివృద్ధిని పక్కన పెట్టి ఇంగ్లీషు భాషలోకి చొరబడ్డారు. దాన్ని కేంద్రీయ భాషగా ఎదిగించింది కూడా వాళ్లే. కనుక దళిత బహుజనులు కూడా ఆంగ్ల భాషలోకి చొరబడి శత్రువును అధిగమించడం తప్ప మరో మార్గంలేదు. …..

ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా దళితులకు సంస్కృతం నేర్చుకునే హక్కుని నిరాకరిస్తూ వచ్చారు. కానీ బ్రిటీషువారు ఈ దేశంలోకి వచ్చీ రావడంతోనే ఇంగ్లీషుని పాలనా భాషగా చేశారు. దళితులకు ఇంగ్లీషుని నేర్చుకునే హక్కుని, అవకాశాన్నీ కల్పించారు. ఇప్పటికీ ఇంగ్లీషే పాలనా భాషగా వుంది. మరి ఇప్పుడు దళితులు ఏ భాషను ఎన్నుకోవాలి?
కచ్చితంగా ఇంగ్లీషునే……..

లంబాడీ, గోండు, కోయ తదితరులకు తెలుగు వలస భాషే...!
మరి అ లాటప్పుడు ఆదివాసీ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషలో ఎందుకు బోధిస్తున్నారు?

తెలుగు భాషా పెత్తనం కింద కురుమ భాష ఇప్పటికే చచ్చిపోయింది.
లంబాడీ, కోయ, గోండు మొదలైన మరెన్నో భాషలు చచ్చిపోయేక్రమంలో వున్నాయి.
ఎబికె ఉటంకించే యునెస్కో మృతభాషల హెచ్చరిక తెలుగు భాష చేతిలో చనిపోతున్న లంబాడీ తదితర భాషలకు వర్తించదా?

ప్రభుత్వ పాఠశాలల్లో లంబాడీ, గోండు, కోయ భాషలను పరిరక్షించే బాధ్యత అధికార భాషా సంఘానికి లేదా?
అవి ఆయా పిల్లల మాతృభాషలు కావా?

మన దేశంలో ఏ భాష అధికారం లోకి వస్తే ఆ భాషను (ఉర్దూ, పర్షియన్‌, ఇంగ్లీషు) ముందుగా నేర్చుకున్నది అగ్రకులాలవారూ, సంపన్న వర్గాలవారే. అందుకే వారు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోగలిగారు. …..

రాజా రామమోహన్‌ రాయ్‌, సురేంద్రనాథ్‌ బెనర్జీ, దాదాభాయి నౌరోజీ, తిలక్‌, సావర్‌కార్‌,. గాంధీ, నెహ్రూ అందరూ ఇంగ్లాండుకు పోయి ఇంగ్లీషు నేర్చుకున్నవారే. ఇంగ్లీషు వ్యతిరేకి రామ్‌మనోహర్‌ లోహియా కూడా ఆంగ్ల భాషను అమెరికాలో నేర్చుకున్నాడు. విదేశీ వస్తుభహిష్కరణ రోజుల్లో కూడా ఎవరూ ఇంగ్లీషు విద్యను బహిష్కరించలేదు. …..

జాతీయ వాదం దళితబహుజనులకు...ప్రాపంచిక వాదం అగ్రకులాలకా... ఇదెక్కడి న్యాయం?
ఐఐటి, ఐఐఎంలలో ప్రవేశించే ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థుల పట్ల ఈ అగ్రకులాల విద్యార్థులు చాలా దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారు మధ్యలో చదువు మానుకోవలసిన పరిస్థితిని కల్పిస్తుంటారు. …

అగ్రకులాలవారిని సవాలు చేయడానికి ఒకే ఒక మార్గం విద్యావిధానాన్ని ఒకే భాషలో (ఇంగ్లీషులో) నడపాలనీ, దేశమంతటా ఒకే సిలబస్‌ అమలు చేయాలనీ, ద్వంద్వ విద్యావిధానాన్నీ ట్యుటోరియల్‌ కాలేజీలను రద్దు చేయాలనీ డిమాండ్‌ చేయడమే…….

ఈ రకమైన విద్యావిధానం కుల వ్యవస్థ కీళ్లను కూడా సడలించగలుగుతుంది. ….

ఇవీ కంచ ఐలయ్య మన ముందుకు తెచ్చిన వాదనలు.......
గతం లో వీరు రాసిన " నేను హిందువు నెట్లయిత ? " మరియు " సారే తిప్పు - సాలు దున్ను " పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.



దళిత బహుజనులకు తెలుగు
అగ్రకులాలకు ఇంగ్లీషు చదువా!?

- కంచ ఐలయ్య

32 పేజీలు, వెల: రూ.5


ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

....................

4 comments:

  1. నాకు తెలిసి తెలుగు భాషని ప్రోత్సహించే సంఘాలవాళ్ళు ఎవరూ తమ పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్ళకి పంపించరు. మా చిన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా తెలుగు మీడియం ఉండేది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో తెలుగు మీడియం ప్రైవేట్ స్కూళ్ళు మూసి వెయ్యడం లేదా ఇంగ్లిష్ మీడియంగా మార్చెయ్యడం జరుగుతున్నాయి. తెలుగు అధికార భాష ఉద్యమంలో పాల్గొంటూ తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి పంపించే గురువింద గింజ మెంటాలిటీ గల వాళ్ళని మీ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగితే "మా పిల్లల్ని దుంపల బడికి పంపించడం మాకు ఇష్టం లేదు" అని డైరెక్ట్ గా సమాధానం చెపుతారా లేదా సమాధానం చెప్పకుండా నోరుమూసుకుంటారా?

    ReplyDelete
  2. *తెలుగు భాషా పెత్తనం కింద కురుమ భాష ఇప్పటికే చచ్చిపోయింది. * కురుమ భాష అంటె గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు మా ఇంట్లొ అందరం "క" భాష మాట్లాడేవారం. ఈ భాష లో మాట్లాడె ప్రతి తెలుగు అక్షరానికి ఒక "క" అక్షరం జత చేసెవారం. అది ఈ రోజులలో ఇంగ్లిష్ చదువుల వలన చని పొయింది. ఎందుకంటె ఇప్పుడు అందరు ఇళ్ళలో ఇంగ్లిష్ మాట్లాడటం మొదలు పెట్టారు.

    ReplyDelete
  3. nonsense.....dalitula janaba shatam entha....agra kulala janaba shatam entha...so, dalitulu telugu lo chaduvukunte vache nastam enti..? agra kulalu english lo chadukovadam valla vastunna labam enti..? ante andaru english chaduvulu chaduvukoni america,europe velli vallaku sevalu cheyalana...lekapothe english nerchukoni call center lalo pani cheyadanika......oka china,japan nu theesukondi...lekapothe europe lo ee country ayina theesukondi ...vallu valla language ne use chestaru....ee vallu abhi vruddi sadinchatleda....manam matram enduku sadhinchakudadu.....

    */తెలుగు అధికార భాష ఉద్యమంలో పాల్గొంటూ తమ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి పంపించే గురువింద గింజ మెంటాలిటీ గల వాళ్ళని మీ పిల్లల్ని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగితే "మా పిల్లల్ని దుంపల బడికి పంపించడం మాకు ఇష్టం లేదు" అని డైరెక్ట్ గా సమాధానం చెపుతారా లేదా సమాధానం చెప్పకుండా నోరుమూసుకుంటారా?*/

    vallu ala pampistunnadi telugu medium schools lo standards (teachers, infrastructures...) antha baga levani....anthe gaani telugu lo cherpinchadaniki istam leka kaadu

    ReplyDelete
  4. శ్రీకాకుళంలో "డగ్లస్ హై స్కూల్" ఒకప్పుడు ప్రముఖ తెలుగు మీడియం స్కూల్. ఆ స్కూల్ లో infrastructure బాగానే ఉంటుంది. టీచింగ్ ప్రమాణాలు కూడా బాగుంటాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు వచ్చిన తరువాత ఆ స్కూల్ patronage పడిపోయింది. తెలుగు మీడియం స్కూళ్ళని దుంపల బడులు అనడం so called తెలుగు భాషాభిమానులకి కూడా అలవాటే.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌