Wednesday, March 18, 2009

నూరేండ్ల దళిత చరిత్ర ... - అడప సత్యనారాయణ


ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఏ మతంలోనూ లేని కుల వ్యవస్థ భారత దేశంలో వుంది. ప్రాచీన కాలం లో పుట్టి ఇప్పటికీ ఇంకా పెంచి పోషించబడుతున్న అతి భయంకరమైన సామాజిక రుగ్మత ఇది.

ఈ కుల వ్యవస్థలో అతి దారుణంగా అణచివేతకు గురైన నిమ్న కులాల ప్రజలు పంచములుగా, అంటరానివాళ్లుగా అతి దుర్భరమైన, హేయమైన, పశువులకంటే హీనమైన జీవితాలను వెళ్లదీస్తున్నారు.
ఈ అమానవీయ వ్యవస్థకు వ్యతిరేకంగా గతంలో అనేక పోరాటాలు జరిగాయి. చార్వాక, బౌద్ధ, జైన తత్వాలు క్రీ.పూ.5వ వతాబ్దంలోనే కులవ్యవస్థను ఎదురించాయి.

ఎందరో కింది కులాలకు చెందిన తత్వవేత్తలు హిందూ మతంలో వుంటూనే కులతత్వాన్నీ, అంటరానితనాన్నీ నిరసించారు. భక్తి ఉద్యమకారులైన నందనార్‌, చోకమేళ, రవిదాస్‌, కబీర్‌దాస్‌ వంటి వారు బ్రాహ్మణ భావజాలాన్ని కొంతవరకు తట్టుకుని ఎదురు నిలిచినప్పటికీ కుల రక్కసిని నిర్మూలించలేకపోయారు. అయితే వారి కృషి దళిత ఉద్యమాలకు నాంది పలికింది.

హిందూ మతాన్ని ఎదురించి మేం హిందువులం కాము అంటూ అయ్యంకాళి, అయోతిదాస్‌ వంటివారి తత్వాన్ని దళితులు జీర్ణించుకుంటున్న క్రమంలోనే దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి.
మహత్మా జ్యోతీరావు ఫూలే భక్తి ఉద్యమ వారసత్వానికి భిన్నంగా హిందూ ధర్మశాస్త్రాల్ని అవహేళన చేస్తూ నిమ్న కులాలవారి దైన్యాన్ని ఎత్తి చూపుతూ నూతన కుల నిర్మూలనా భావజాలాన్ని నిర్మించారు.

మన రాష్ట్రంలో మొదటి దశలోని ఆది హిందూ, ఆది ఆంధ్ర ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు మూలపురుషుడైన భాగ్యరెడ్డి వర్మ, ఆతరువాత అరిగె రామస్వామి, ఆదెయ్య, శ్యాంసుందర్‌, వెంకట్రావ్‌ లాంటి వారు దళిత జాగృతికి, ఉద్యమ నిర్మాణానికి ఎంతగానో శ్రమించారు. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన జగన్‌ మిత్ర మండలి హైందవ (వైదిక) ధర్మాన్ని, వర్ణవ్యవస్థను నిరసించి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేసింది.

గాంధీ ప్రవేశపెట్టిన హరిజనోద్ధరణ, అంటరానితన నిర్మూలన, దళితుల దేవాలయ ప్రవేశం లాంటి కార్యక్రమాలలోని డొల్లతనాన్ని ఆది ఆంధ్ర నాయకులు ఎప్పుడో ఎండగట్టారు. పూనా ఒప్పందం సందర్భంగా గాంధీ - అంబేడ్కర్‌ ల మధ్య చెలరేగిన వివాదం దళితుల్లో కొత్త ఆలోచనా విధానానికి దోహదం చేసింది.

కారంచేడు, పదిరికుప్పం, చుండూరులలో జరిగిన దళిత మారణకాండలోంచి పుట్టిన దళిత మహాసభ దళితుల ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. అనేక ఉద్యమాలు జీవం పోసుకున్నాయి.

ఈవిధంగా గత వందసంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దళిత ఉద్యమాల స్వభావ, స్వరూపాల్ని ఈ పుస్తకంలో సమగ్రంగా విశ్లేషించడం జరిగింది. మొత్తం దళిత ఉద్యమాలను నాలుగు దశలుగా విభజించి వివిధ దశల్లోని ఉద్యమ స్వభావాన్ని అంచనా వేశారు. ఆది ఆంధ్ర, దళిత మహాసభ, దండోరా ఉద్యమాల పూర్వాపరాల్ని, తాత్వికతను, వాటి ప్రాధాన్యతలను రచయిత సోదాహరణంగా వివరించారు.

ఆచార్య అడపా సత్యనారాయణ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర శాఖ అధ్యాపకులు.
ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ నుండి యంఫిల్‌ పట్టాను; జర్మనీలోని హైడెల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంనుండి పిహెచ్‌డిని పొందారు.

దళిత బహుజనుల చరిత్రకు సంబంధించిన అంశంపై పోస్ట్‌ డాక్టరేట్‌ స్థాయిలో విశేష కృషి చేసినందుకు గాను ఆయనకు టోక్యో, బెర్లిన్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ విశ్వవిద్యాలయాలలో విజిటింగ్‌ ఫెలోషిప్స్‌ లభించాయి. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగువారి వలసలు అనే అంశంపై యు.జి.సి. ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్‌లో నూరేండ్ల దళిత చరిత్ర
- అడప సత్యనారాయణ
కవర్‌ డిజైన్‌: వెంకట్‌
ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి 2009
45 పేజీలు, వెల: రూ.30

........................
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849

సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌
12-13-427, స్ట్రీట్‌ నెం. 17, తార్నాక,
సికింద్రాబాద్‌
ఫోన్‌ నెం. 040- 2344 9192

ఇ మెయిల్‌:
http://hyderabadbooktrust.blogspot.com

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌