Tuesday, October 14, 2008

వైద్యులారా, రోగుల వద్దకు మీరే వెళ్లండి. ... డాక్టర్ నార్మన్ బెతూన్ జీవితగాధ ... రక్తాశ్రువులు


ఆయన జీవించిందీ, పని చేసిందీ, పోరాడిందీ మూడు దేశాల్లో. ఒకటి స్వదేశమైన కెనడాలో, రెండు ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రప్రధమ ప్రజా ప్రతిఘతనా సమరం జరిగిన స్పెయిన్ లో, మూడు చైనా లో. ఒక ప్రత్యేకార్థంలో ఆయన ఈ మూడు దేశాలకు చెందినవాడు. విపులార్థంలో పీడనకు వ్యతిరేకంగా పోరాడే సమస్త ప్రజనీకానికి ఆయన చెందుతాడు.

డాక్టర్ బెతూన్ చనిపోయాక ఆయన స్థాపించిన అంతర్జాతీయ చికిస్తాలయాల్లో ఒక దానికి భారతీయ వైద్యబృందానికి చెందిన డాక్టర్ కొట్నీస్ డైరెక్టర్ పదవి స్వీకరించాడు. డక్టర్ బెతూన్ విడిచివెళ్లిన బాధ్యతల్ని డాక్టర్ కొట్నీస్ సాహసోపేతంగా నిర్వర్టిస్తూ విధి నిర్వహణలో మరణించాడు. చాగ్ కై షేక్ ప్రభుత్వం విధించిన దిగ్భంధనల ఫలితంగా మరణించిన అనేక మందిలో డాక్టర్ బెతూన్, డాక్టర్ కొట్నీస్ ఇద్దరు. ఆ దిగ్భందం లేకపోతే వారు యింకా జీవించి వుంటూ, ప్రప్రంచంలో ప్రజల విముక్తి లక్ష్యం కోసం పోరాడుతూ వుండేవాళ్లు.

నవ చైనా డాక్టర్ బెతూన్ ని ఎన్నడూ మరచిపోదు.

- మదాం సన్ యట్ సేన్

రెండుసార్లు మరణించి ఎప్పటికీ బతికుండే వీరుడి కథ
.................................

వీధుల్లో, సందుల చివర, ఇంటి ముందర గేటు దగ్గర, సినిమా హాలు రేకు కప్పుల నీడన, టీ బడ్డీల దగ్గర గంటల తరబడి దేశం గురించి, సమాజం గురించి, తమ ఈడు ఆడపిల్లల గురించి చర్చించుకుని, వ్యాఖ్యానించుకుని, పుకార్లు ప్రచారం చేసుకుని గడిపే యువతరం ఒక మూడు గంటలు (గట్టిగా ఒక సినిమా చూసినంతసేపు) కేటాయించగలిగి ఒక పుస్తకం చదివితే చాలు. ఈ దేశంలో కొన్ని కోటానుకోట్ల పనిగంటలు సద్వినియోగమవుతాయి. ఆ పుస్తకం ఏ మత ప్రబోధాల గ్రంథమూ కాదు. ఇటీవల మార్కెట్టును ముంచెత్తుతున్న వ్యక్తిత్వ వికాస పుస్తకమూ కాదు. ఒక నవల. ఒక డాక్టర్ జీవితాన్ని చిత్రించిన సాధారణ నవల. టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్ లు రాసిన “ది స్కాల్ పెల్, ది స్వోర్డ్” నవల. ఈ మహత్తర గాథను తెలుగులోకి సహవాసి “రక్తాశ్రువులు” పేరుతో సంక్షిప్తానువాదం చేశారు. కేవలం అనువాద నైపుణ్యం గురించే రెండు పేజీల వ్యాసం రాయొచ్చు. అంతటి స్ఫూర్తిదాయకమైన “రక్తాశ్రువులు”ను ఈ వారం పరిచయమ్ చేస్తున్నాను.

స్పెయిన్, చైనా ప్రజల విమోచన పోరాటాలను తనవిగా భావించి పరిపూర్ణ నిస్వార్ధ దీక్షతో, అంతర్జాతీయతా చైతన్యంతో, ఆ లక్ష్యసాధన కోసం నిర్విరామ కృషిచేసి, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన డాక్టర్ నార్మన్ బెతూన్ జీవిత కథ ఈ ‘రక్తాశ్రువులు’. ఇంతే కథ. కానీ ఆ సాహసోపేత జీవితం ఎంత కఠినంగా ఉంటుందో ఆలోచించండి. కష్టపడి పనిచేసేవారిని గొడ్డులాగా పనిచేస్తున్నాడని అంటాం. వంద అడుగుల దూరంలో జపాన్ బాంబులతో దాడి చేస్తుండగా 69 గంటలలో నిద్రాహారాల జోలికి పోకుండా 115 మంది గాయపడ్డ వాళ్లకు చికిత్స చేసి ఇరవై ఆపరేషన్ల తరువాత వున్న మందులన్నీ అయిపోతే, మత్తుమందు లేకుండా పదిగంటలపాటు సైనికులకు శస్త్ర చికిత్సలు చేస్తూనే వున్న వాడిని ఏమనాలి? ‘పని రాక్షసుడు’ అనొచ్చా? చైనా ప్రజలు సరిగ్గా అదే పేరు పెట్టారు - పాచూ ఎన్.

కెనడాలో పుట్టి, వైద్య విద్యను అభ్యసించి, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని, ఎం.డి. పట్టా పుచ్చుకున్నాక లండన్ వెళ్లి, తనకు లలిత కళల పట్ల ఉన్న మోజంతా తీర్చుకుని, అక్కడ్నుంచి ఎఫ్.ఆర్.సి.ఎస్. పరీక్షల కోసం ఎడింబరో వెళ్లి, అక్కడ ఫ్రాన్సిస్ అనే సంపన్నురాలు, అందమైన యువతిని ప్రేమించి పెళ్లాడాడు బెతూన్. కానీ అతడి జ్ఞానతృష్ణ తీరని దాహం. అహం దేనికోసమో అర్రులు చాస్తుంది. అతనేవేవో పనులు చేస్తున్నాడు. అవేవీ నచ్చక విడిచి పెడుతున్నాడు. విపరీతంగా తాగడం, విపరీతంగా చదవడం, కఠోరంగా బతకడం… వివాహ సంబంధం బీటలు వారింది. యూరప్ నుంచి తిరిగి వచ్చే ముందర తనే ఇలా అనుకుంటాడు. ‘తన శృంగార యాత్ర ఒక వెక్కిరింత.. తన వివాహం ఒక వెక్కిరింత.. తన బ్రతుకొక వెక్కిరింత..’.
నార్మన్ బెతూన్ భార్యతో సహా డెత్రాయిట్ లో వైద్యవృత్తి మొదలుపెడతాడు. పేదలు సాదలు, బీదాబిక్కీ, అనారోగ్యం అజ్ఞానంతో నలిగినాక డబ్బున్న పేషెంట్లు తగులుతారు. ఆ డబ్బంతా పేదల కోసం వెచ్చించడం.. ఆర్థిక పరిస్థితి అతలాకుతలం.. క్షయ వ్యాధి సోకుతుంది. ఎడమ ఊపిరితిత్తి పూర్తిగా చెడిపోయి ట్రూడో శానిటోరియంలో రోజులు లెక్కపెట్టుకుంటూ మృత్యువుకోసం ఎదురు చూస్తుంటాడు. ఫ్రాన్సిస్ కు విడాకులు మంజూరైపోయాయి. అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో నార్మన్ బెతూన్ ఒక పుస్తకం చదువుతాడు. డాక్టర్ జాన్ అలెగ్జాండర్ రాసిన గ్రంథమది. ఎలాగూ చావు తప్పదు, ప్రయత్నించి చూద్దామని తానే గినీ పందిగా మారుతాడు. చివరికి వైద్య బృందం అంగీకరించి ఎడమ ఊపిరితిత్తిని స్తంభింపజేస్తారు. ఒకే ఊపిరితిత్తితో కొనప్రాణంతో బయటపడతాడు బెతూన్.

గొప్ప సర్జన్ కావాలన్న తన చిన్ననాటి కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో డాక్టర్ ఎడ్వర్డ్ ఆర్చిబాల్డ్ దగ్గర అసిస్టెంట్ గా చేరుతాడు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా శ్వాసకోశ శస్త్ర చికిత్సలో ప్రపంచంలోనే అతిపెద్ద, గొప్ప నిపుణుడని పించుకుంటాడు. పేరు ప్రఖ్యాతులతో పాటు సంపద, పదవులు వచ్చి చేరుతాయి. మళ్లీ ఫ్రాన్సిస్ తో ప్రేమరాయబారం నడుపుతాడు. కాని వృత్తిపట్ల పెంచుకున్న మమకారం భార్యను నిర్లక్ష్యం చేయిస్తుంది. మళ్లీ కలిసిన ఫ్రాన్సిస్ ఈసారి శాశ్వతంగా విడిపోతుంది. బెతూన్ ఒంటరివాడవుతాడు. పూర్తిగా వైద్యమొక్కటే అతని ప్రపంచమైపోతుంది. వైద్య వ్యాపారం చేయడమ్ సహించలేకపోతాడు. వృత్తిపరమైన హక్కులకన్నా మానవ హక్కులు గొప్పవంటాడు. నెమ్మది నెమ్మదిగా కమ్యూనిజం వైపు ఆకర్షితుడవుతాడు.

ఇంతలో స్పెయిన్ దురాక్రమణ ప్రారంభమవుతుంది. కెనెడియన్ వైద్య సహాయ బృందంగా పనిలో దిగి రక్తదానం కార్యక్రమం చేపడతాడు. బీభత్సమైన యుద్ధరంగంలో ప్రాణదాతగా తొమ్మిది నెలలపాటు సుడిగాలికంటే వేగంగా పర్యటించిన బెతూన్ పోరాటానికి విరాళాలు సేకరించే పనిమీద స్వదేశంలో పర్యటిస్తాడు. కెనడా, అమెరికాలలో ఏడు నెలలపాటు పర్యటించి, ప్రసంగాలు చేస్తాడు. అంతలో చైనామీద జపాన్ దురాక్రమణ దాడి ప్రారంభమవుతుంది. వెoటనే చైనా చేరుకుని యుద్ధరంగంలో వైద్య సేవలు మొదలుపెడతాడు. క్షతగాత్రులను హాస్పిటల్ కు చేర్చడంకంటే క్షతగాత్రుల దగ్గరకే వైద్య సహాయం చేరితే బావుంటుందన్న బెతూన్ సూచనకు మావోసేటుంగ్ అవాక్కయిపోతాడు. 29 నెలలపాటు గెరిల్లా యుద్ధవీరులకు వైద్య సహాయం అందించిన బెతూన్ సరైన ఆహారం, విశ్రాంతి తీసుకోకుండా నిర్లక్ష్యం చేసి యాభై ఏళ్ల వయసులోనే రెండోసారి నిజంగా మరణిస్తాడు.

కవి, విద్యావేత్త, సైనికుడు, విద్యార్థి, చిత్రకారుడు, శరీర ఉపశమనకారుడు, స్వాప్నికుడు, శాస్త్రవేత్త, అన్నింటినీ మించి ప్రజల పట్ల గాఢానురాగం, జీవన విచ్చినకుల పట్ల అంతులేని జుగుప్స, భవిష్యత్తులో అనంత విశ్వాసం నిండిన మానవతా మూర్తి, పాచూ యెన్, లావో జెన్ చా, కామ్రేడ్ డాక్టర్ నార్మన్ బెతూన్ ప్రాత: స్మరణీయుడు. ఒక చేత్తో వైద్యం, మరో చేత్తో ప్రసంగాలు, ఇంకో చేత్తో వైద్య శాస్త్ర గ్రంథాలు, మరింకో చేత్తో సామాజిక నాయకత్వాన్ని తయారుచేయడం, ఇతర చేతుల్తో సమాజాన్ని ప్రక్షాళన చేసేందుకు కృషి చేయడం.. ఇంకా ఇలా చెప్పాలంటే పని.. పని.. పని.. అంతే. అదే బెతూన్ జీవన విధానం. జీవితం. ప్రపంచ యువతకు మార్గ దర్శకం.

పరిచయ వ్యాసంలో కథంతా చెప్పడాన్ని వ్యక్తిగతంగా నేనిష్టపడను కానీ, ఇదంతా చదివాకైనా మన యువత ఈ పుస్తకాన్ని చదువుతారని కక్కుర్తి. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తొలి ప్రచురణగా విడుదల చేసిన ఈ ‘రక్తాశ్రువులు’ నవల వెల 18 రూపాయల 50 పైసలు మాత్రమే. (పేజీలు 256). మరి మీరూ చదువుతారుగా.

దుప్పల రవి
http://chaduvu.wordpress.com
సౌజన్యంతో

రక్తాశ్రువులు
ఆంగ్ల మూలం : The Scalpel, The Sword, Sydney Gordan, Ted Allen
తెలుగు అనువాదం : సహవాసి

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌