Monday, October 13, 2008

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర ... రెండు భాగాలు ... రచన : కంభంపాటి సత్యనారాయణరావు ... తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామమోహనరావు


మనకింతకు పూర్వం రచించిన ఆంధ్రదేశ చరిత్రలున్నాయి. అవి సాధారణంగా రాజవంశాలనో, ప్రముఖ వ్యక్తులనో కీర్తిస్తూ సామ్రాజ్య విస్తీర్ణతను ప్రశంసించేవిగా వున్నాయి.
శాతవాహనులు తెలుగువారేనా? విజయనగర సామ్రాజ్యం తెలుగువారిదేనా? కాకతీయుల వర్ణమేది? ఇట్లాంటి ప్రశ్నలకు ఆ చరిత్ర గ్రంథాల్లో ప్రాధాన్యత ఎక్కువ.
ప్రజల సాంస్కృతిక చరిత్రను సాహిత్యం ద్వారా పునర్నిర్మించటానికి సురవరం ప్రతాపరెడ్డి (1896-1953) కృషిచేసి ఆంధ్రుల సాంఘిక చరిత్రను ప్రకటించారు.
ఆ తరువాత ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు శేఖరం గార్లు ఆంధ్రుల సంస్కృతి చరిత్ర-సంస్కృతి అనే గ్రంథం రచించారు. ఇందులో సాంస్కృతికాంశ పూర్వపు చరిత్రలకన్నా కొంత ఎక్కువ వున్న మాట నిజమే. అయినా ఈ రెండు పుస్తకాలు సమాజ ఆర్థిక వ్యవస్థను గురించి పట్టించుకొన్నవి కావు.
కంభంపాటి సత్యనారాయణగారు స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి వివిధ ప్రజోద్యమాల్లో పాల్గొన్నారు. బహు గ్రంథ రచయితలు.
వారు మార్క్సిస్టు మూలసూత్రాల వెలుగులో ఆంధ్ర దేశ ప్రజల ఆర్థిక సాంస్కృతిక చరిత్రను ఇంగ్లీషులో రచించారు. ఆయన పరిణత వయస్సులో బహు ప్రయాసల కోర్చి, ఎన్నో గ్రంథాలు పరిశీలించి స్వత్సంత పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రూపొందించారు.
యూరపులో ఫ్యూడలిజానికి, మన దేశంలో చిరకాలం వర్థిల్లిన స్వయం పూర్ణ గ్రామీణ వ్యవస్థకూ భేదాల్ని చాలా స్వతంత్రంగా ప్రతిపాదించారు. ఈ పద్ధతిలో ఆంధ్ర దేశానికి చరిత్ర కూర్చటం ఇదే ప్రథమం.
తరవాత రాబోయే విపుల చరిత్రలకు ఇది మార్గదర్శకం అవుతుందని మా నమ్మకం.
ఈ పుస్తకంలో చేసిన ప్రతిపాదనలు తుది నిర్ణయాలనే భ్రమ రచయితకూ లేదు. ప్రకాశకులకూ లేదు.
ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవితం ఆధారంగా నవలలు రచించిన సుప్రసిద్ధ రచయిత మహీధర రామమోహనరావుగారు ఈ గ్రంథాన్ని తెలుగు చేసి పెట్టారు. రామమోహనరావు గారు కూడా బహుగ్రంథ రచయితలేగాక, ప్రజోద్యమాల్లో జీవితాన్ని పండించుకున్నవారు. వారి సరళమైన అనువాదం ఈ పుస్తకాన్ని ఆకర్షణీంగా తయారు చేసిందని మా నమ్మకం.

మొదటి భాగంలో 1. చరిత్ర పూర్వయుగం, 2. సజీవ చరిత్ర పూర్వదశ 3. శాతవాహన యుగం 4. తెగ సంస్కృతి నుంచి నాగరికతకు పరివర్తన 5. శాతవాహనుల అనంతరపు వ్యవస్థా రూపం 6. ఫ్యూడల్‌ వ్యవస్థ పునాదులు 7. మధ్య యుగాల ఆరంభ దశ 8. ఫ్యూడల్‌ వ్యవస్థ పుట్టుక పెరుగుదల అనే ప్రకరణాలున్నాయి.

రెండవ భాగంలో 1. వరంగల్లు కాకతీయులు 2. వరంగల్లు కాకతీయులు వాణిజ్యం, సాహిత్యం కళలు 3. కాకతీయుల తదనంతరులు 4. బహమనీ రాజవంశం 5. గజపతుల కళింగ రాజ్యం 6. విజయ నగర సామ్రాజ్యం 7. విజయనగర రాజ్య పరిపాలనా వ్యవస్థ 8. విజయనగర రాజ్య ఆర్థిక విధానం 9. విజయనగరం సామాజిక స్థితి 10. విజయనగర సాహిత్యం కళలు, 11. కుతుబ్‌షాహీ రాజవంశం 12. కుతుబ్‌షాహీల పరిపాలనా వ్యవస్థ 13 కుతుబ్‌షాహీల ఆర్థిక నిర్మాణం 14. కుతుబ్‌షాహీ యుగ మతం సమాజ స్థితి 15. కుతుబ్‌షాహీ యుగ సాహిత్యం-కళలు 16 ఆర్థిక వ్యవస్థలో సరికొత్త మార్పులు: విదేశీ పెట్టుబడుల పాత్ర మొదలైన అధ్యాయాలున్నాయి.

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 1
190 పేజీలు వెల: రూ.50

ఆంధ్రుల సంస్కృతి - చరిత్ర - 2
274 పేజీలు వెల : రూ.75

రచన: కంభంపాటి సత్యనారాయణ
తెలుగు సంక్షిప్తానువాదం : మహీధర రామ మోహనరావు

ఆంగ్ల మూలం : A Study of the History and Culture of the Andhras by Kambhampati Satyanarayana, Peoples's Publishing House, New Delhi.

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌