Wednesday, September 10, 2008

ఒక తల్లి ... మహా శ్వేతాదేవి నవల ... హజార్‌ చౌరాసియా కీ మా హిందీ సినిమాకి మాతృక


మానవ హక్కుల కోసం పోరాడే యువ శక్తిని నిర్వీర్యం చేస్తున్న నేటి సమాజాన్నీ, ఆ సమాజంలోని దుష్టశక్తులనూ, వారి దౌష్ట్యాన్నీ కళ్లకు కట్టినట్టు చూపే నవల యిది.
చిన్న కొడుకు ఇరవైయేళ్ల వ్రతి ఆవిధంగా ఎందుకు మారిపోయాడు?
ఇంటి పట్టున వుండడు, ఎక్కడికి వెడుతున్నాడో ... ఎవరితో స్నేహం చేస్తున్నాడో తెలియదు.
తమకిి డబ్బుకి లోటు లేదు. కాలేజీ చదువు పూర్తికాగానే అమెరికాకు పంపి పైచదువులు చదివించాలనుకున్నారు తల్లిదండ్రులు. కానీ వ్రతి ఇంటిలో ఎవరితోనూ మనసిచ్చి మాట్లాడడు. భోగభాగ్యాలంటే లెక్కలేదు, నిరసన. అతని ఆలోచనలేమిటో, ఆవేదన దేని గురించో తల్లికి ఒకపట్టాన అర్థం కాదు.
వ్రతి మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు. చివరికి ఇరవయ్యేళ్ల లేత వయసులోనే దారుణంగా చంపబడ్డాడు. ఈ దుర్మార్గపు వ్యవస్థ వ్రతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేసింది.
వ్రతి పుట్టిన రోజూ, చచ్చిపోయిన రోజూ ఒకటే. జనవరి 17. తల్లి సుజాతకి మాత్రమే జ్ఞాపకం ఇది.
సుజాత అన్వేషణకు బయలుదేరింది. తన చిన్న కొడుకు ఎందులా మారిపోయాడు తెలుసుకోవాలనుకుంది. వ్రతి స్నేహితుల్ని కలుసుకుంది. జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటిగా అవగతమయ్యాయి.
ఆరోజు సాయంత్రం అయ్యే సరికి ఆమెకు వాస్తవం బోధపడింది. ఆ వాస్తవాన్ని తట్టుకోలేక పోయింది. తల్లడిల్లి పోయింది. చివరికి ఆమె ఆవేదన కూడా అదే రోజున అంతమయింది.
ఇది ఆ ఒక్క తల్లి కథ మాత్రమే కాదు. ఈనాడు సమాజంలో స్వాతంత్య్రానంతరం పుట్టిన తరం ఇలా ఎందుకు మారిపోతున్నారో తెలియక అంతులేని ఆవేదనతో తల్లడిల్లిపోతున్న అనేక మంది తల్లులందరి కథ.
మహా శ్వేతాదేవి బెంగాలీలో రచించిన ఈ నవల విశేష ప్రాచుర్యం పొందింది. నాటకంగా వేలాది ప్రేక్షకుల. ప్రశంసలు అందుకుంది. ప్రఖ్యాత దర్శకుడు గోవింద నిహలాని దర్శకత్వంలో హజార్‌ చౌరాసియా కీ మా పేరుతో హిందీలో చలనచిత్రంగా కూడా నిర్మించబడింది. అందులో తల్లి పాత్రను జయా బచ్చన్‌ అద్భుతంగా పోషించారు.
....
...ఈ సమాజంలో ఆహార పదార్థాలను, ఔషధాలను కల్తీ చేసేవాళ్లు, హంతకులు, రౌడీలు, దొంగలు, దోపిడీదార్లు, లంచగొండులు హాయిగా బతకొచ్చు. దేశ సంపదను దిగమింగే నేతలు పోలీసుల రక్షణలో సకల భోగ భాగ్యాలతో దర్జాగా బతకొచ్చు. కానీ ఈ సమాజాన్ని మార్చాలనుకునే వాళ్లకి ... కవులూ కళాకారులు, బుద్ధి జీవులకు మాత్రం బతికే హక్కు లేదు. వాళ్లకి మృత్యుదండన ఒక్కటే తగిన శిక్ష. వాళ్లని నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్‌ చేసిపారేయవచ్చు. వాళ్లని చంపెయ్యడం వీళ్ల ప్రజాస్వామిక హక్కు. రిపబ్లిక్‌ వీళ్లకా అధికారం యిచ్చింది. వీళ్లకి ఏ చట్టం వర్తించదు. ఏ నియమం, ఏ నీతీ అడ్డు రాదు. అసలు న్యాయ విచారణే అవసరం లేదు.......
....

ఒక తల్లి
రచన: మహా శ్వేతాదేవి
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం
142 పేజీలు, వెల: రూ.18

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌