Thursday, June 26, 2008

ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర



ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర
యాగాటి చిన్నారావు
ఆంగ్రమూలం : దళిత్స్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీయాగాటి చిన్నారావుకనిశ్క్ పబ్లిషర్స్‌న్యూ ఢిల్లీ

తెలుగు అనువాదం: ప్రభాకర్‌ మందార
కాపీరైట్‌ : రచయిత
198 పేజీలు వెల: రూ.70/-
అర్థ శతాబ్దపు (1900 - 1950) ఆంధ్ర దళిత ఉద్యమాల చరిత్రను లోతుగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన పుస్తకమిది. ఆంధ్ర చరిత్రలో మరుగున పడి కనిపించని అనేక సామాజిక, సాంస్కృతిక అంశాలను యాగాటి చిన్నారావు నూతన ఆధారాలతో వెలికితీసి ఇందులో పొందుపరిచారు.
అంటరానితనం పేరిట హిందూ సమాజం దళితులపై ప్రదర్శించిన హేయమైన వివక్షను, క్రౌర్యాన్ని, వాటి మూలాలలనూ దళితుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అభివృద్ధికి దోహదం చేసిన దళిత విద్య, రాజకీయాలలో దళితుల భాగస్వామ్యం గుర్తింపుకోసం, ఆత్మగౌరవం కోసం చేసిన దళితుల పోరాటాలు, దళితుల ప్రతిఘటనా సాహిత్యం వంటి అనేక అంశాలను ఇందులో లోతుగా పరిశీలించారు.
1932 నాటి గాంధీ హరిజనోద్ధరణ కార్యక్రమాని కంటే ఎంతో ముందే మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంతంలో, హైదరాబాద్‌ రాష్ట్రంలోనూ పెల్లుబికిన స్వతంత్ర దళితోద్యమాలను ఇందులో సవివరంగా పేర్కొన్నారు. జాతీయ దళితోద్యమ చరిత్రలో అటుంచి, స్థానికంగా కూడా సరైన గుర్తింపునకు నోచుకోని ఎందరో తెలుగు దళిత మేధావులు, రచయితలు, నేతల విశిష్ట కృషిని ఇందులో కళ్లకు కట్టినట్టు వివరించారు.

దళిత్స్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ'' పేరిట ఆంగ్లంలో వెలువడి ఇప్పటికే దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ పుస్తకాన్ని ప్రతి దళితుడూ విధిగా చదవాల్సిన అవసరం వుంది.
డా.యాగాటి చిన్నారావుది విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని అరసబలగ అనే మారుమూల పల్లెటూరు. ప్రభుత్వ ఎస్‌.సి. బాలుర వసతి గృహంలో ఉంటూ తెర్లాం పంచాయితీ ఎలిమెంటరీ స్కూల్‌, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌(1974-82)లో చదివిన తర్వాత ఎ.వి.యన్‌. కళాశాల, విశాఖపట్నం (1985-88)లో బి.ఎ. పూర్తి చేసుకొని పై చదువుల కోసం ఢిల్లీ జె.ఎన్‌.యు.లో చేరి ఎమ్‌.ఎ., ఎమ్‌.ఫిల్‌ పి.హెచ్‌.డి. పూర్తి చేశారు.
అనంతరం స్కాట్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌లో విజిటింగ్‌ ఫెలోగా, న్యూ ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కొంతకాలం పని చేశారు. ప్రస్తుతం జె.ఎన్‌.యు.లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్నారావు అనేక రచనలు చేశారు.
వాటిలో - దళిత్‌ స్టడీస్‌ ఎ బైబ్లియోగ్రాఫికల్‌ హ్యాండ్‌బుక్‌ (2003), రైటింగ్‌ దళిత్‌ హిస్టరీ అండ్‌ అదర్‌ ఎస్సేస్‌ (2007) ముఖ్యమైనవి.



No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌